గవర్నర్‌ను కాపాడుతున్నదేమిటి?

గవర్నర్‌ను కాపాడుతున్నదేమిటి? - Sakshi


భోపాల్: మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్‌నరేశ్ యాదవ్‌పై వ్యాపమ్ స్కాంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఫారెస్టు గార్డులుగా నియామకానికి ఐదుగురి పేర్లను ఆయన సిఫారసు చేశారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చింది. నిజానికి నైతిక బాధ్యతతో ఆయన తక్షణం గవర్నర్ పదవికి రాజీనామా చేయాలి లేదా కేంద్రమైనా ఆయనను అలా చేయమనాలి. ఈ రెండూ జరగలేదు.  గవర్నర్‌గా తనకు రాజ్యాంగపర రక్షణ ఉన్నందున(పదవిలో ఉండగా క్రిమినల్ కేసులో విచారించడం కుదరదు) ఎఫ్‌ఐఆర్ నుంచి తన పేరు తొలగించాలని ఆయన  హైకోర్టుకు వెళ్లి ఉపశమనం పొందారు.



ఇంతజరిగినా కేంద్రంలోని మోదీ సర్కారు రామ్‌నరేశ్ జోలికి వెళ్లలేదు. నిజానికి యూపీఏ హయాంలో గవర్నర్లుగా నియమితులైన  షీలా దీక్షిత్, బి.ఎల్.జోషి, శేఖర్‌దత్ తదితరులను ‘రాజీనామా’ చేసి వెళ్లిపోయేలా చేసిన మోదీ ప్రభుత్వానికి మరి కాంగ్రెస్‌కు చెందిన, అపఖ్యాతి మూటగట్టుకున్న రామ్‌నరేశ్‌పై ప్రత్యేకప్రేమ ఎందుకు? గవర్నర్‌కు గతంలో ఓఎస్‌డీగా పనిచేసిన ధన్‌రాజ్‌యాదవ్, స్వయంగా గవర్నర్ కుమారుడు శైలేష్ యాదవ్(ఈయన మార్చిలో అనుమానాస్పదంగా మృతిచెందారు) కూడా ఈ స్కాం నిందితులే.



సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ దగ్గరి బంధువులకు ఈ స్కాంతో సంబంధముందని ఆరోపణలున్నాయి. గవర్నర్‌గా రామ్‌నరేశ్‌ను సాగనంపితే... రాజ్యాంగపర రక్షణ తొలగిపోయి వెంటనే ఆయనపై కేసు నమోదవుతుంది. సిట్ విచారణలో ఆయన మరిన్ని విషయాలు వెల్లడిస్తే... తెరవెనకున్న పెద్దలకు ఇబ్బందే. గవర్నర్ హోదాలో వ్యాపమ్‌కు సంబంధించిన కీలక ఫైళ్లు, నిర్ణయాలు, సమాచారం రామ్‌నరేశ్ దగ్గరకు వచ్చాయి. మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందనేది ఆయనకు లోతుగా తెలుసు. కాబట్టే కేంద్రం ఆయన జోలికి వెళ్లలేదన్న అభిప్రాయం నెలకొంది. 2011లో గవర్నర్‌గా నియమితులైన ఆయన పదవీకాలం వచ్చే ఏడాది ఆగస్టుతో ముగుస్తుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top