ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌

ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌


న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ సోమవారం సాయంత్రం అయిదు గంటలకు ముగిసింది.  ఢిల్లీ పార్లమెంట్‌ హౌస్‌లో ఏర్పాటుచేసిన  పోలింగ్‌ కేంద్రంలో  ఎంపీలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు. తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, బీజేపీ అగ్రనేత మురళీమనోహర్‌ జోషి తదితరులు ఓటేశారు. అధికార, విపక్ష ఎంపీలు కూడా పార్లమెంట్‌ హౌస్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందే పలువురు ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పార్లమెంట్‌కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 20న ఎన్నికల కౌంటింగ్‌ జరగనుంది. 25న కొత్త రాస్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.కాగా 24న ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలం ముగియనుంది.



ఏపీలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. వెలగపూడిలోని అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఓటు వేశారు. బిజెపి ఎమ్మెల్యేలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీలో మొత్తం 174 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ రాయపాటి సాంబశివరావు ఓటు వేశారు.



అలాగే తెలంగాణలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ముసిగింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తొలి ఓటు వేయగా..  స్పీకర్‌ మధుసూదనాచారి రెండో ఓటు వేశారు. విపక్షనేత జానారెడ్డి మూడో ఓటు వేశారు. టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా బస్సుల్లో అసెంబ్లీకి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విపక్ష ఎమ్మెల్యేలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గీతారెడ్డి, ఎంఐఎం , టీడీపీ ఎమ్మెల్యేలు,  బిజెపి పక్షనేత కిషన్‌రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. తెలంగాణలో మొత్తం 117 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అయితే టిఆర్ఎస్‌కు చెందిన మనోహర్‌రెడ్డి, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌ అనారోగ్యం కారణంగా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top