‘ఏకీకృత’ రాజముద్ర


- టీచర్ల ఏకీకృత సర్వీసు నిబంధనల గెజిట్‌ జారీ

1998 నుంచి వర్తింపు

 

సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలకు సంబంధించి కేంద్ర హోం శాఖ శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరిస్తూ పంచాయతీరాజ్‌ టీచర్లను ప్రభుత్వోపాధ్యాయులతో పాటు ఒకే క్యాడర్‌గా నిర్ధారిస్తూ ఈ ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల గెజిటెడ్, నాన్‌ గెజిటెడ్‌ ఉపాధ్యాయులకు సంబంధించి మొత్తం నాలుగు గెజిట్లను విడుదల చేసింది. గెజిటెడ్‌ ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు విధానం 1998 నవంబరు 16 నుంచి అమలవుతుందని, నాన్‌ గెజిటెడ్‌ టీచర్ల ఏకీకృత సర్వీసు నిబంధనల విధానం 1998 నవంబరు 20 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది.

 

తెలంగాణ గెజిటెడ్‌ టీచర్లకు సంబంధించి...

తెలంగాణ గెజిటెడ్‌ టీచర్ల క్యాడర్‌ను 637(ఇ) గెజిట్‌ నోటిఫికేషన్‌లో నిర్ధారించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వోద్యోగులతో పాటు పంచాయ  తీరాజ్‌ విభాగానికి చెందిన గెజిటెడ్‌ ఉపాధ్యాయులను కూడా చేరుస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. వాటి సారాంశం ఏమిటంటే... ‘రాజ్యాంగంలోని 371డి అధికరణం పరిధిలోని 1, 2 నిబంధనలు దఖలు పరిచిన అధికారం మేరకు 1975 నాటి ఏపీ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ ఉత్తర్వులను రాష్ట్రపతి సవరిం చారు. నాటి ఉత్తర్వుల్లోని మూడో షెడ్యూల్లో క్రమసంఖ్య 23 తరువాత 23–ఏను చేర్చి, మండల విద్యాధికారి, ప్రభుత్వ, జడ్పీ ఉన్నత పాఠశాలల ప్రధానో పాధ్యాయులను ఇందులో పొందుపరిచారు. 26–ఏను చేర్చి, డైట్‌ సీనియర్‌ లెక్చరర్లను దీని పరిధిలో పొందుపరిచారు. 26–బీని చేర్చి, డైట్‌ లెక్చరర్లను దీని పరిధిలో పొందుపరిచారు. ఈ ఉత్తర్వులు 1998 నవంబరు 16 నుంచి వర్తిస్తా యి. వీటి అమలుకు వీలుగా గత ఉత్తర్వులను సవరించాల్సి ఉంటుంది. ఇది తెలంగాణ మొత్తానికి వర్తిస్తుంది’’.

 

తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ టీచర్లకు సంబంధించి...

తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ టీచర్లకు సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్‌ నెంబరు 639(ఇ)ని కేంద్ర హోం శాఖ విడుదల చేసింది. ‘‘1975 నాటి ఏపీ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ ఉత్తర్వుల్లోని పేరా 3లో రెండో ఉప పేరా తరువాత 2–ఏ పేరాను చేర్చాలి. ప్రతి జిల్లాలోని మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, ప్రభుత్వ పాఠశాలల్లోని నాన్‌ గెజిటెడ్‌ టీచర్లను ప్రత్యేక సమీకృత కేడర్‌గా ఆర్గనైజ్‌ చేస్తూ 2–ఏ పేరాలో పొందుపరచడం జరిగింది. ఈ సవరించిన ఉత్తర్వులు 1998 నవంబరు 20 నుంచి అమల్లోకి వస్తాయి. ఇందుకు వీలుగా పూర్వ జీవోలను సవరించాల్సి ఉంటుంది’’ అని పేర్కొంది. ఏపీ గెజిటెడ్‌ టీచర్ల కేడర్‌ను 636 (ఇ) నోటిఫికేషన్‌లో, నాన్‌ గెజిటెడ్‌ టీచర్ల కేడర్‌ను 638 (ఇ)లో కేంద్ర హోం శాఖ పొందుపరిచింది.

 

చరిత్రాత్మకం: వెంకయ్య

ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసులకు రాష్ట్రపతి ఆమోదాన్ని చరిత్రాత్మక ఘటనగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అభివర్ణించారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడ్డాక ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘తెలంగా ణ, ఏపీ ఉపాధ్యాయుల దీర్ఘకాల సమస్యకు ఇది పరిష్కారం. సంబంధిత ఫైలు పలు దశల్లో వేగంగా కదిలేందుకు సహకరించిన కేంద్ర హోం, న్యాయ శాఖలకు అభినందనలు. ఉపాధ్యాయుల 20 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతామన్న ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చాం’’ అని అందులో పేర్కొన్నారు. 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top