రెండు రైళ్లు ఢీ; 13 మంది మృతి

రెండు రైళ్లు ఢీ; 13 మంది మృతి


గోరఖ్‌పూర్ వద్ద బరౌణీను ఢీకొట్టిన కృషక్ ఎక్స్‌ప్రెస్

47 మందికి గాయాలు


 

గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ సమీపంలో మంగళవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. మదువాదీ నుంచి లక్నో వెళ్తున్న కృషక్ ఎక్స్‌ప్రెస్ గోరఖ్‌పూర్‌కు 7 కి.మీ. దూరంలోని నందనగర్ రైల్వే క్రాసింగ్ వద్ద రెడ్ సిగ్నల్‌ను దాటుకుంటూ వెళ్లి లూప్ లైన్ దాటుతున్న లక్నో-బరౌణీ ఎక్స్‌ప్రెస్‌ను పక్క నుంచి ఢీకొట్టింది. రాత్రి 11 గంటలకు జరిగిన ఈ దుర్ఘటనలో 13 మంది ప్రయాణికులు (11 మంది పురుషులు, ఇద్దరు స్త్రీలు) మృతిచెందగా మరో 47 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. ప్రమాద తీవ్రతకు బరౌణీ ఎక్స్‌ప్రెస్‌లోని 3 బోగీలు బాగా దెబ్బతిన్నాయి. బోగీల కింద చిక్కుకుపోవడంతో చాలా మంది కాళ్లు, చేతులు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ర్యాపి డ్ యాక్షన్ దళాలు, గోర్ఖా రెజిమెంట్, రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్య లు చేపట్టారు. క్షతగాత్రులను గోరఖ్‌పూర్‌లోని పలు ఆస్పత్రుల్లో చేర్చారు. ఈ ప్రమాదంపై రైల్వే భద్రతా కమిషనర్ పి.కె. బాజ్‌పాయ్ నేతృత్వంలో విచారణకు ఆదేశించిన రైల్వేశాఖ కృషక్ ఎక్స్‌ప్రెస్ లోకోపైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ ను సస్పెండ్ చేసింది. ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన రైల్వేమంత్రి సదానంద గౌడ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. లక్ష చొప్పున, స్వల్ప గాయాలైన వారికి రూ. 20 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియాప్రకటించారు. ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఘటనాస్థలిని పరిశీలించి ఆపై ఆస్పత్రుల్లోని క్షతగాత్రులను పరామర్శించారు.

 

ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని



రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశా రు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 50వేల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు ప్రభుత్వం తెలిపింది. యూ పీ సీఎం అఖిలేశ్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించా రు. కాగా, ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, దేశంలో పెరుగుతున్న రైలు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top