ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేల అరెస్టు

ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేల అరెస్టు


హత్యాయత్నం కేసులో ఒకరు.. దూషించినందుకు మరొకరు

 


 న్యూఢిల్లీ/చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ. ఢిల్లీలో అమానతుల్లా ఖాన్ అనే ఎమ్మెల్యే ఓ మహిళను వాహనంతో తొక్కి చంపేందుకు ప్రయత్నించిన కేసులో అరెస్టవగా.. వ్యక్తిని దూషించిన కేసులో మరో ఆప్ ఎమ్మెల్యేను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వివిధ కేసుల్లో అరెస్టయిన పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 11కు పెరిగింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఓ మహిళ..  ఆప్ ఎమ్మెల్యే, ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అమానతుల్లా ఖాన్ తనను హత్యచేసేందుకు ప్రయత్నించారని జూలై 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల తరచుగా విద్యుత్ కోతలు ఎదుర్కుంటున్నామని చెప్పి తిరిగి వస్తుండగా తనపై వాహనాన్ని ఎక్కించి చంపేందుకు ప్రయత్నించారన్నారు.



వాహనంలో ఎమ్మెల్యే కూడా ఉన్నారని మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. అక్కడే ఉన్న ఓ యువకుడు దీన్ని రాజకీయం చేస్తే తనను చంపేస్తానని బెదిరించాడని తెలిపారు. దీంతో కోర్టు ఆదేశాలతో ఆదివారం నాన్‌బెయిలబుల్ వారెంట్ కింద ఖాన్‌ను అరెస్టు చేశారు. దీనిపై ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘మోదీజీ మరో ఆప్ ఎమ్మెల్యేను అరెస్టు చేయించారు’ అని ట్వీట్ చేశారు.



 ఓ వర్గం వారిని దూషించినందుకు..

 మరోపక్క.. ఆప్ ఎమ్మెల్యే నరేశ్ యాదవ్‌ను ఆదివారం రాత్రి అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. సోమవారం అతణ్ని కోర్టుకు హాజరుపరుస్తామన్నారు. ఓ వర్గం వారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేయగా.. అతను ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ ప్రోద్బలంతోనే దూషించినట్లు తెలిపారన్నారు. దీని ఆధారంగానే ఆప్ ఎమ్మెల్యేను అరెస్టు చేసినట్లు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top