పంజాబ్‌లో త్రిముఖ పోరు

పంజాబ్‌లో త్రిముఖ పోరు - Sakshi


డ్రగ్స్, రైతుల సమస్యలు, నోట్లరద్దు చుట్టూ ఎన్నికల ప్రచారం

► ‘చివరి’ చాన్స్  ఇవ్వాలంటున్న సీఎం ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌

► కాంగ్రెస్‌ పునరుజ్జీవం కోసం శ్రమిస్తున్న కెప్టెన్  అమరీందర్‌




సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

పంజాబ్‌లోని 117 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఫిబ్రవరి 4న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎన్డీఏ (అకాలీదళ్‌–బీజేపీ కూటమి), పదేళ్లుగా ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ మధ్య తీవ్రమైన పోటీ ఉండగా.. ఢిల్లీలో అధికారాన్నందుకున్న ఆప్‌.. పంజాబ్‌లోనూ మేమున్నామంటోంది. దీంతో మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ప్రస్తుత సీఎం ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌తో అమరీందర్‌ సింగ్‌ (కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా నేడో, రేపో ప్రకటించనున్నారు) ముక్తసర్‌ జిల్లా లంబీ సీటులో ముఖాముఖి పోటీపడుతుండటంతో పంజాబ్‌ పోరు ఆసక్తికరంగా మారింది. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నవజోత్‌ సింగ్‌ తొలిసారిగా అసెంబ్లీ బరిలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.



వ్యతిరేకతనుంచి గట్టెక్కుతారా?

ఈ ఎన్నికలు అకాలీదళ్‌ కంటే బీజేపీకే చాలా కీలకం. నోట్లరద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో ప్రభావం చూపకపోతే దేశవ్యాప్తంగా మోదీ ప్రభావం తిరోగమనంలో పడుతుందనే విశ్లేషణల నేపథ్యంలో అధికార పార్టీ తీవ్రంగా కృషిచేస్తోంది. దీనికితోడు పదేళ్లుగా అధికారంలో ఉన్న ఈ కూటమిపై సహజమైన వ్యతిరేకతతోపాటు.. రాష్ట్రంలో డ్రగ్స్‌ మాఫియాను అరికట్టలేకపోతున్నారనే విపక్షాల విమర్శల ప్రభావం కనిపిస్తోంది. అటు, రైతాంగ సమస్యలపట్ల బాదల్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. సీఎం బాదల్‌ వయసుమళ్లినా.. తను చివరిసారిగా సీఎం కావాలనుకుంటున్నట్లు ప్రచారంలో చెబుతున్నారు.



అధికారం కోసం ఆప్‌ యత్నం

ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా పంజాబ్‌ ఎన్నికల్లో కీలకంగా మారనుంది. ఢిల్లీ విజయంతో సంచలనం సృష్టించిన ఆప్‌ పక్కనే ఉన్న పంజాబ్‌లోనూ అవే ఫలితాలు సాధిస్తామని భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఎక్కువగా దృష్టిపెడుతున్న కేజ్రీవాల్‌.. డ్రగ్స్‌ మాఫియాతో బాదల్‌ కుటుంబం కుమ్మక్కై రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపిస్తున్నారు. ఆప్‌ను గెలిపిస్తే డ్రగ్స్‌ను రాష్ట్రం నుంచి తరిమేయటంతోపాటు ఉపాధి కల్పన మెరుగుపరుస్తామని ప్రకటించారు.


డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై ఆప్‌ ఎంపీ భగవంత సింగ్‌ మాన్ పోటీ చేస్తున్నారు. కెనడాలో స్థిరపడిన దాదాపు 200 మంది పంజాబీలు.. సొంత రాష్ట్రానికి వచ్చి ఆప్‌ తరపున ప్రచారం చేస్తున్నారు. జనవరి 5న సీఎస్‌డీఎస్‌–ఏబీపీ సంస్థ విడుదల చేసిన సర్వేలో అకాలీ కూటమికి మెజారిటీ రాకు న్నా ఇతర పక్షాల కన్నా ఎక్కువసీట్లు గెలుచుకోవచ్చని తెలుస్తోంది. అయితే.. ఎన్డీఏ, కాంగ్రెస్‌ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని, ఆప్‌ పాత్ర పరిమితమేనని ఇండియాటుడే–యాక్సిస్‌ సర్వే అభిప్రాపడింది.



కాంగ్రెస్‌కు చావో, రేవో!

పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు కీలకం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఒక్కో రాష్ట్రాన్ని కోల్పో తూ వస్తున్న తరుణంలో పంజాబ్‌లో విజయం దక్కితే అది 2019 ఎన్నికలు సోనియా అండ్‌ టీమ్‌కు సంజీవనిలా మారుతుందనటంలో సందేహం లేదు. అందుకే కాంగ్రెస్‌ విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. మాజీ సీఎం, కెప్టెన్  అమరీందర్‌ సింగ్‌ అన్నీ తానై పార్టీని నడిపిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించే మార్చి11న ఆయనకు 75 ఏళ్లు నిండుతాయి. దీంతో ఫలితాలను కెప్టెన్ కు పుట్టినరోజు కానుకగా ఇవ్వాలని కాంగ్రెస్‌ శ్రేణులు శ్రమిస్తున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top