హమ్మయ్య.. పక్షులు బతికిపోయాయి!

హమ్మయ్య.. పక్షులు బతికిపోయాయి! - Sakshi


* ‘దీపావళి’నాడు తగ్గిన పక్షుల మరణాలు, గాయాల కేసులు

* గత ఏడాదికంటే 20% తగ్గిన నష్టం

* అవగాహన కార్యక్రమాలు చేపట్టిన జంతు ప్రేమికులు

* పెరిగిన టపాసుల ధరలూ కారణమే..


సాక్షి, ముంబై : నగరంలో ఈసారి దీపావళి సందర్భంగా గాయపడిన పక్షుల సంఖ్య తగ్గింది. గత ఏడాదితో పోల్చితే ఈ సారి ఈ కేసుల సంఖ్య 20 శాతం తక్కువగా నమోదయ్యిందని ఓ సామాజిక కార్యకర్త పేర్కొన్నారు. ప్రతిసారి దీపావళికి టపాసుల శబ్ధ ధాటికి చాలా పక్షులు గాయాలపాలు కాగా, మరికొన్ని మృత్యువాత పడుతుంటాయి. దీంతో పక్షి ప్రేమికులు ఈసారి నగరవాసుల్లో కొంత మేర అవగాహన కల్పించారు. అన్ని పండుగల కంటే దీపావళి నాడు జంతువులు, పక్షులు ఎక్కువగా ఇబ్బంది పడతాయని జంతు ప్రేమికులు పేర్కొన్నారు.



లెక్కలేనన్ని జంతువులు గాయాలపాలవుతాయన్నారు. టపాసులు కాల్చడంతో చాలా జంతువులు శబ్దధాటికి బయటికి పరుగులు తీస్తుంటాయని, ఈ క్రమంలో అవి వాహనాల కింద పడి గాయాలపాలు అవుతుంటాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కూడా తాము నగర వాసుల్లో అవగాహన కల్పించామన్నారు. చిన్నపిల్లలతో ఈ అంశమై మాట్లాడడమే కాకుండా పోలీస్‌స్టేషన్లను కూడా ఆశ్రయించామన్నారు. అంతేకాకుండా ఫేస్‌బుక్, వాట్సప్‌ల ద్వారా కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు.



ఎలాంటి ప్రమాదం జరిగినా లేదా తమ జంతువులు తప్పిపోయినా అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా తమకు ఫిర్యాదు అందజేయాలని నగరవాసులకు సూచించామన్నారు. ఇదిలా ఉండగా, టపాసుల ధరలు పెరిగిపోవడంతో ఈసారి నగరవాసులు ఎక్కువ స్థాయిలో టపాసులు కాల్చలేదని, దీంతో పక్షులు, జంతువులు చాలావరకు గాయాలబారినుంచి బయటపడ్డాయని వారు అభిప్రాయపడ్డారు. పరేల్‌లోని బాంబే సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ (బీఎస్‌పీసీఏ)కు చెందిన ప్రతినిధి ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈసారి గాయపడిన పక్షుల సంఖ్య గత ఏడాది కన్నా 25 శాతం తగ్గిందన్నారు. బీఎస్‌పీసీఏ ఆస్పత్రి ఇన్‌చార్జి డాక్టర్ జె.సి.కన్నా మాట్లాడుతూ.. దీపావళిని పురస్కరించుకొని ఆస్పత్రుల్లో చేరిన పక్షులు, జంతువులు కేసులు ఈసారి చాలా వరకు తగ్గాయన్నారు.



ముఖ్యంగా గాలి పటాలు ఎగురవేయడం ద్వారా చాలా పక్షులు తీవ్రంగా గాయపడుతుంటాయి. దీంతో తమ వద్దకు చికిత్స నిమిత్తం తీసుకు వస్తుంటారన్నారు. కాగా, ఈసారి  దీపావళి సందర్భంగా గాయపడిన 18 పక్షులను తమ వద్దకు చికిత్స కోసం తీసుకు వచ్చారన్నారు. ఒక్కోసారి కొంత మంది పిల్లలు శునకాలు, పిల్లులు, గొర్రెల తోకలకు టపాసులను కట్టి ఆడుకుంటారని తెలిపారు. ఇలాంటి వాటిల్లో గాయపడిన కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ విషయమై కూడా నగర వాసుల్లో అవగాహన కల్పించామన్నారు. టపాసుల ధరలు పెరగడంతో ఎకో ఫ్రెండ్లీ దీపావళి ఆవశ్యకత గురించి తెలియజేశామన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top