జనాభాకు తగ్గ రవాణా సవాలే

జనాభాకు తగ్గ రవాణా సవాలే - Sakshi


రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ

సాక్షి, బెంగళూరు: అందుబాటులోని ఆధునిక సాంకేతితకను సద్వినియోగం చేసుకుంటే దేశంలో రానున్న 10–15 ఏళ్లలో 12 నగరాల్లో మెట్రోరైలు సేవలు అందుబాటులోకి తీసుకురావచ్చని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తెలిపారు. శనివారం సాయంత్రం బెంగళూరులోని విధానసౌధలో జరిగిన కార్యక్రమంలో బెంగళూరు మెట్రో (నమ్మ మెట్రో)మొదటి దశ (42 కిలోమీటర్ల)ను జాతికి అంకితం చేశారు.


ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. పట్టణాల్లో ఏడాదికేడాది పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రవాణా వ్యవస్థను కల్పించడం ప్రభుత్వాల ముందున్న ప్రధానమైన సవాల్‌ అన్నారు. రెండో దశను కూడా కర్ణాటక ప్రభుత్వం చకచకా పూర్తి చేయాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.



రెండు క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరణ

న్యూఢిల్లీ: మరో రెండు క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తిరస్కరించారు.  మరో నెలలో రాష్ట్రపతి పదవి నుంచి తప్పుకోనున్న ప్రణబ్‌ మే నెల చివరి వారంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇంతవరకూ ఆయన తిరస్కరించిన క్షమాభిక్ష పిటిషన్లు 30కి చేరాయి. 2012లో ఇండోర్‌లో నాలుగేళ్ల చిన్నారిపై ముగ్గురు వ్యక్తుల అత్యాచారం, హత్య కేసుతో పాటు 2007 పుణేలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిపై టాక్సీడ్రైవర్, అతని స్నేహితుడు గ్యాంగ్‌రేప్‌ కేసుల్లో దోషులకు క్షమాభిక్ష నిరాకరించారు.


మరోవైపు ఏ క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్‌లో లేవని రాష్ట్రపతి భవన్‌ అధికారిక వైబ్‌సైట్‌లో పేర్కొంది. కాగా ఈ ఏడాది జనవరిలో బరా ఊచకోత కేసులో నలుగురి నిందితుల మరణశిక్షను రాష్ట్రపతి జీవిత ఖైదుగా మార్చిన సంగతి తెలిసిందే. ప్రణబ్‌ క్షమాభిక్ష నిరాకరించిన దోషుల్లో అజ్మల్‌ కసబ్, అఫ్జల్‌ గురు, వీరప్పన్‌ అనుచరులు సిమోన్, జ్ఞానప్రకాశ్, బిలవర్ధన్‌లు ఉన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top