రైలు చార్జీలు ఇక కాస్ట్లీ గురూ!

రైలు చార్జీలు ఇక కాస్ట్లీ గురూ!


రాబోయే కొన్ని నెలల్లో రైలు టికెట్ల ధరలు బాగానే పెరగనున్నాయి. చాలా కాలంగా పెండింగులో ఉన్న రైల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడమపే ఇందుకు కారణం. ఇక మీదట ఈ సంస్థే ప్రయాణికుల, సరుకు రవాణా చార్జీలు ఎంతెంత ఉండాలో నిర్ణయిస్తుంది. ప్రయాణికుల చార్జీలకు భారతదేశంలో భారీ ఎత్తున సబ్సిడీలు ఇస్తున్నారు. ఈ రంగం వల్ల ఏడాదికి సుమారు రూ. 30 వేల కోట్ల నష్టం వస్తోందని అంచనా. ఢిల్లీ నుంచి పట్నాకు 1166 కిలోమీటర్ల దూరం ఉంటే, జనరల్ టికెట్ కొనుక్కుని వెళ్లేవాళ్లు ఒక కిలో స్వీట్లకు పెట్టే ధర కంటే తక్కువ ధరతోనే టికెట్ తీసుకోవచ్చని అంటున్నారు.



దాంతో ఇప్పుడు రైల్వే శాఖలో సంస్కరణలకు మోదీ సర్కారు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే రైల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ సంస్థ మొత్తం ప్రయాణానికి అయ్యే ఖర్చు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని చార్జీలను నిర్ణయిస్తుంది. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది అతిపెద్ద సంస్కరణ అవుతుందని అంటున్నారు. ప్రభుత్వాలు మారినా కూడా ప్రైవేటు పెట్టుబడిదారుల విషయంలో విధానాలు మారకూడదని భావిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ సంస్థ 1989 నాటి రైల్వే చట్టం పరిధిలోనే పనిచేస్తుంది. దీని ఏర్పాటుకు రూ. 50 కోట్ల నిధులు కేటాయించారు. ఇందులో చైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు. వీళ్ల పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top