నేడు దేశవ్యాప్త సమ్మె

నేడు దేశవ్యాప్త సమ్మె


10 కార్మిక సంఘాల పిలుపు  మౌలిక సేవలపై ప్రభావం

 న్యూఢిల్లీ: కార్మిక చట్టాల్లో మార్పులను వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు నేడు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో నిత్యావసరాలతో పాటు రవాణా, బ్యాంకింగ్ తదితరాలపై ప్రభావం పడనుంది. 10 సంఘాలు సమ్మెలో పాల్గొంటుండగా, బీజేపీ అనుబంధసంస్థ బీఎంఎస్(భారతీయ మజ్దూర్ సంఘ్), నేషనల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సమ్మెలో పాల్గొనొద్దని నిర్ణయించాయి. బ్యాంకులు, బీమా కంపెనీలు తదితర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో 10 సంఘాలకు ఉమ్మడిగా 15 కోట్ల మంది సభ్యులున్నారని, రవాణా, విద్యుత్, గ్యాస్,  తదితరాల సరఫరాలో అంతరాయం కలగనుందని సంఘాల నేతలు తెలిపారు. అయితే, విద్యుత్, గ్యాస్ వంటి ప్రభుత్వరంగ సంస్థల కార్మికులు సమ్మెలో లేనందున వీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని బీఎంఎస్ పేర్కొంది.



 12 డిమాండ్లు..: కార్మిక చట్టాల్లో చేసిన సవరణలను ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవద్దనే తదితర 12 డిమాండ్లతో కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. డిమాండ్లపై ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఎలాంటి పరిష్కారం దొరకకపోవడంతో ఈనెల 2న సమ్మె చేపట్టాలని కార్మిక సంఘాలు నిర్ణయించడం తెలిసిందే. కార్మిక సంఘాల తరఫున ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి డీఎల్ సచ్‌దేవ్ మాట్లాడుతూ.. 'ప్రభుత్వ గుర్తింపు పొందిన 10 సంఘాలు బుధవారం సమ్మె చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బీఎంఎస్ శాఖలు కూడా సమ్మెలో పాల్గొంటాయి' అని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు మరికొంత సమయం ఇచ్చేందుకే సమ్మె నుంచి వైదొలగినట్లు బీఎంసీ, నేషనల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ తెలిపాయి. రోడ్డు రవాణా, భద్రత బిల్లును వ్యతిరేకిస్తూ ఆయా రాష్ట్రాల రవాణా సంస్థలతోపాటు బొగ్గు కార్మికులూ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించారు. వీరితోపాటు రిక్షా కార్మికులు, కూలీలు తదితర అసంఘటిత కార్మికులు సమ్మెలో పాలుపంచుకుంటారని ఏఐటీయూసీ నేత గురుదాస్ దాస్‌గుప్తా చెప్పారు. కాగా,  దేశ ప్రజల, కార్మికుల ప్రయోజనాల కోసం సమ్మెను విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. సమ్మె నుంచి బీఎంఎస్, నేషనల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్‌యూనియన్స్ వైదొలగాయని, మరో 2-4 సంఘాలు తటస్థంగా ఉన్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. మౌలిక అవసరాలపై సమ్మె ప్రభావం చూపబోదన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top