ఆ గ్రామంలో.. 400 జతల కవలలు

ఆ గ్రామంలో.. 400 జతల కవలలు


సాక్షి: మీ పాఠశాలలోనో, ఇంటి చుట్టుపక్కలో,  బంధువుల్లోనో ఎవరైనా కవల పిల్లలు ఉన్నారా..? ఒక వేళ ఉంటే వారిని అందరూ చాలా ప్రత్యేకంగా చూస్తారు కదా! కవలలు సాధారణంగా ఒకే  రకమైన పోలికలు కలిగి ఉంటారు. అందుకే వారికి ఆ ప్రత్యేకత. మనం కవలల్ని చూడటం చాలా అరుదు. ఎందుకంటే చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే కవల జననాలు ఉంటాయి. కానీ ఒక గ్రామంలో మాత్రం ఎక్కడ చూసినా కవలలే కనిపిస్తున్నారు. ఆ గ్రామం ఎక్కడ ఉందో, ఆ విశేషాలేమిటో ఈ రోజు తెలుసుకుందాం..!



ఎక్కడ ఉంది?

ఆ గ్రామం కవల పిల్లల కారణంగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించింది. రెండు వేల కుటుంబాలు నివసించే ఆ చిన్న ఊరిలో 400 జతల కవలలు ఉన్నారంటే ఆశ్చర్యం వేయక మానదు. ఆ గ్రామం కేరళలోని మలప్పురం జిల్లాలో ఉంది. పేరు ‘కొడివి’. ఎక్కడైనా వెయ్యి జననాల్లో ఆరు కవల జననాలు ఉండటం సహజం. కానీ ఈ గ్రామంలో మాత్రం ప్రతి 1000 జననాలకు 45 కవలలు ఉంటున్నారు. సున్నీ ముస్లింలు ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్నారు. మరో విశేషం ఏమంటే.. ఇక్కడి మహిళలకు పెళ్లిళ్లై సుదూర ప్రాంతాలకు వెళ్లినా వారికి కూడా కవలలు పుడుతున్నారు. ఇటీవలి కాలంలో వీటి సంఖ్య మరింత పెరిగింది. ఇక్కడ పదేళ్లలోపు పిల్లల్లో 80 జతల కవలలు ఉన్నారు.



ఇబ్బందులూ ఉంటాయ్!

ఇక్కడి స్కూల్ టీచర్లు కూడా కవల విద్యార్థులను గుర్తుపట్టలేక తికమక పడుతుంటారు. ఈ గ్రామంలోని కవలలు అందరూ ఒక సంఘం (టాకా)గా ఏర్పాడ్డారు. ఇందులో 600 మంది సభ్యులుగా చేరారు. 85 ఏళ్ల మహమ్మద్ హాజీ గ్రామంలోని కవలలందరిలో పెద్దవారు. కవలలు పుడితే ఒక పక్క ఆనందంగా ఉన్నా ఎన్నో ఇబ్బందులు కూడా ఉంటాయంటున్నారు ఈ ఊరి గ్రామస్తులు. ‘ఆర్థికంగా కుటుంబంపై భారం పెరుగుతుంది. ఇద్దరిని పెంచడం తల్లికి కూడా కష్టంగానే ఉంటుంది’... అంటున్నారు.



శాస్త్రవేత్తల అధ్యయనం:

గ్రామంలోని కవలలపై జాతీయ జన్యు శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేసింది. ఈ బృందంలో హైదరాబాద్‌లో ఉన్న ‘సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ’ నుంచి జీఆర్ చందక్ కూడా ఉన్నారు. కవలల ఆహారపు అలవాట్లు, వారసత్వం, వాతావరణం వంటి అంశాలను పరిశీలించారు. 14 వేల మంది నివసించే ఈ గ్రామంలో కవలలు అధికంగా ఎందుకు పుడుతున్నారో మాత్రం అంతుబట్టడం లేదు.



ఇతర వివరాలు:

గత దశాబ్దకాలంగా ఇక్కడ కవల జననాలు పెరిగాయని ఇక్కడి ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కవలలపై ఆసస్తి ఉన్న డా. కృష్ణన్ శ్రీబిజ రెండేళ్లుగా ఈ విషయంపైనే పరిశోధనలు చేస్తున్నారు. ఈ గ్రామంలో 18-20 ఏళ్ల వయసులో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అక్కడి మహిళలందరూ దాదాపు 5 అడుగుల పొడవు మాత్రమే ఉంటారు. 2008లో మొత్తం 300 మంది పుడితే వారిలో 15 జతల కవలలు ఉన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కవల పిల్లలు పుట్టడం చాలా అరుదు. కానీ ఇక్కడ మాత్రం ప్రపంచంలో కెల్లా అత్యధిక కవల జననాల రేటు నమోదవుతోంది. దాదాపు ప్రతి కుటుంబంలో కవలలు కనిపిస్తారు. యువత, మధ్య వయస్కులు, వృద్ధులు..అందరిలోనూ కవలలు కనిపిస్తారు.

 

ఇలాంటిదే మరో గ్రామం:

ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ జిల్లాలో ఉన్న ‘ఉమ్రీ’ గ్రామం కూడా కవల పిల్లల కారణంగా ప్రసిద్ధి చెందింది. ఆరువేల మంది నివసిస్తున్న ఈ గ్రామంలో 108 జతల కవలలు ఉన్నారు. వీరిని గుర్తుపట్టడానికి వీలులేనంతగా అచ్చుగుద్దినట్టు ఒకే విధంగా ఉంటారు. ఇక్కడి పది జననాల్లో ఒకటి కవలల ప్రసవం. ఇది ప్రపంచ రికార్డు.

 

ప్రత్యేకతలు..

కవలల్లో 22 శాతం మంది ఎడమ చేతి వాటం కలిగి ఉంటారు.

ప్రాంతాలను బట్టి కవల జననాల రేటులో వ్యత్యాసం ఉంటుంది.

వీరు ఏడు రకాలుగా ఉంటారు.

కవలలు ఒకే రోజు జన్మిస్తారనే నియమం ఏమీ లేదు. గరిష్టంగా 85 రోజుల వ్యవధిలో జన్మించిన కవలలు కూడా ఉన్నారు.

ఎంత సారూప్యత ఉన్నా వేలి ముద్రల్లో మాత్రం భేదాలుంటాయి.

కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా కవలలు జన్మించే అవకాశాలను పెంచుతాయని అధ్యయానాల్లో వెల్లడైంది.

కవల జననాల్లో నైజీరియా అగ్ర స్థానంలో, చైనా చివరి స్థానంలో ఉన్నాయి.

40 శాతం మంది కవలలు, సంభాషించుకునేందుకు తమదైన ప్రత్యేక భావజాలాన్ని ఉపయోగిస్తారట.

కవలలకు జన్మ నిచ్చిన తల్లి జీవిత కాలం మిగిలిన వారితో పోలిస్తే అధికంగా ఉంటుంది.

పొడవుగా ఉండే మహిళలకు కవలలు జన్మించే అవకాశాలు అధికంగా ఉంటాయి.

ఎక్కువగా తినే అలవాటు ఉండే వారికి కూడా కవల పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువే.

తల్లి కడుపులో ఉండగానే కవలలు సంభాషించుకోవడం ప్రారంభిస్తారట.

కేవలం అతి కొద్ది మంది కవలల్లో మాత్రమే ఒకరు ఏం చేస్తే రెండో వారికి అది  చేయాలనిపిస్తుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top