నేడు ఆర్జేడీ, జేడీయూ విలీన ప్రకటన!

నేడు ఆర్జేడీ, జేడీయూ విలీన ప్రకటన! - Sakshi

  • ఢిల్లీలో ‘జనతా పరివార్’ మహాధర్నా

  • ప్రధాని మోదీపై దాడే లక్ష్యం

  • న్యూఢిల్లీ: ఆరు ప్రాంతీయ పార్టీల విలీనంతో తిరిగి ఏర్పాటు చేయాలని యోచిస్తున్న ‘జనతా పరివార్’ తొలి విలీన ప్రకటన సోమవారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీలోని జంతర్ మం తర్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టనున్న మహాధర్నా వేదికగా బీహార్‌కు చెందిన లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, శరద్ యాదవ్ నేతృత్వర లోని జేడీయూలు ఓ ప్రకటన చేసే అవకాశముందని ఆయా పార్టీల వర్గాలు వెల్లడించాయి.



    వచ్చే ఏడాది బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీని సమర్థంగా ఎదుర్కొనేందుకు జేడీయూ, ఆర్జేడీలు విలీనం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అందుకే ఆర్జేడీ, జేడీయూలు విలీనమవ్వాలని భావిస్తున్నాయని పేర్కొంటున్నాయి. యూపీలో సమాజ్‌వాది పార్టీ, కర్ణాటకలో జేడీఎస్‌ల కలయికకు ఎన్నికల తొందరేమీ లేదు కాబట్టి కాస్త నిదానంగా పూర్తిస్థాయిలో జనతా పరివార్ ఏర్పాటు జరుగుతుందన్నాయి.  



    ‘బీజేపీ ఎన్నికల హామీలపై పోరు సల్పేందుకు జనతా పరివార్ ఏర్పాటు ఆవశ్యకం. ఇది శాశ్వత కూటమి. దీని ఏర్పాటు ఇప్పటికే ఆలస్యమైపోయింది’ అని లాలూ ఇటీవల అనడాన్ని బట్టి జనతా పరివార్ ఏర్పాటుపై నేతలు ఎంత తొందరపడుతున్నారనే విషయం అర్థమవుతోంది. ఇక, సోమవారం నాటి మహాధర్నాను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జేడీయూ, జేడీఎస్, ఐఎన్‌ఎల్‌డీ, ఎస్‌జేపీ, ఆర్జేడీ, ఎస్పీల అధినేతలు తమ శ్రేణులతో హాజరుకానున్నారు.



    సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీలు, ప్రధాని నరేంద్ర మోదీ పాలనపైనే నేతలు విమర్శలు సంధించనున్నారు. అదేవిధంగా నల్లధనంపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు గడిచినా నల్లధనాన్ని వెనక్కి తెప్పించడంలో ఆశించిన విధంగా ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఇప్పటికే ఆయా పార్టీల నేతలు విమర్శించిన నేపథ్యంలో సోమవారం నాటి మహాధర్నాలో ఈ అంశాన్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. యువతకు ఉపాధి కల్పన అంశాన్నీ ప్రస్తావించే అవకాశం లేకపోలేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top