పీఠం దక్కేది ఎవరికో..

పీఠం దక్కేది ఎవరికో.. - Sakshi


 నేడు కశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

శ్రీనగర్/రాంచీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జమ్మూ కశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. తర్వాత గంటలోనే ఫలితాల సరళి తెలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఐదు విడతలుగా నెలరోజుల పాటు ఈ ఎన్నికలు జరగడం  తెలిసిందే. కాగా, కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎలక్షన్ కమిషన్ అధికారి ఒకరు చెప్పారు.  87 సీట్లున్న జమ్మూ కశ్మీర్‌లో అధికారం చేజిక్కించుకోవడానికి చతుర్ముఖ పోటీ నెలకొంది. అధికార నేషనల్ కాన్ఫరెన్స్, ప్రతిపక్ష పీడీపీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ ప్రధానంగా పోటీపడ్డాయి. 821 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వేర్పాటువాదులు, మిలిటెంట్లు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చినా.. దానిని ప్రజలు ఏమాత్రం పట్టించుకోకుండా భారీగా ఎన్నికల్లో పాల్గొన్నారు.


కశ్మీర్ లోయను కైవసం చేసుకోవాలని ఈసారి బీజేపీ తీవ్రంగా ప్రయత్నించింది. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయితే చాలా ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏ పార్టీకి పూర్తి మెజారిటీరాదని తేల్చిచెప్పాయి. దీంతో ఎవరు ఎవరికి మద్దతిస్తారు. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎవరికీ సంపూర్ణ ఆధిక్యంరాని పక్షంలో కాంగ్రెస్ కీలకంగా మారుతుందని విశ్లేషకుల అంచనా. 81 స్థానాల జార్ఖండ్ అసెంబ్లీకి 1,136 మంది పోటీపడ్డారు. మావోయిస్టుల బెదిరింపులు ఉన్నా.. మొత్తంగా 66 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), బీజేపీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో పాటు మాజీ సీఎంలు అర్జున్ ముండా, మధుకోడా, బాబూలాల్ మరాండి పోటీలో ఉన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top