నేడు జీకేవీ పార్టీ పతాకావిష్కరణ

నేడు జీకేవీ పార్టీ పతాకావిష్కరణ


తిరుచ్చిలో 28న పార్టీ ప్రకటన

బహిరంగ సభ విజయవంతానికి భారీ సన్నాహాలు


 

 చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు కాంగ్రెస్‌తో విభేదించి వెలుపలకు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ నేడు (బుధవా రం) కొత్త పార్టీ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. 28న తిరుచ్చిరాపల్లిలో పార్టీపేరు ప్రకటనకు భారీ సభకు సన్నాహాలు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత జీకే మూపనార్ అధిష్టాన నిర్ణయాలను విబేధించి తమిళమానిల కాంగ్రెస్ (తమాకా)ను స్థాపించారు. కొన్నేళ్లపాటూ అప్రతిహతంగా సాగినప్పటికీ, మూపనార్ మరణం తరువాత ఆయన తనయుడు జీకే వాసన్ తమాకాను కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

 

 గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోగా, జీకే వాసన్ వర్గీయుడైన టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్‌పై నిందలు మోపారు. అప్పటి నుంచి పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న జీకే వాసన్ అవకాశం కోసం ఎదురుచూశారు. ఇటీవల టీఎన్‌సీసీలో సంస్థాగత సభ్యత్వ స్వీకరణ మొదలుకాగా, సభ్యత్వ కార్డులో మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్, జీకే మూపనార్ బొమ్మలు తొలగించాలని అధిష్టానం ఆదేశించింది. తన తండ్రికి, కాంగ్రెస్ పితామహుడైన కామరాజనాడార్‌కు అవమానం జరిగిందనే  భావనతో జీకేవాసన్, జ్ఞానదేశికన్ నెలక్రితం కాంగ్రెస్ నుంచి వైదొలిగారు. కొత్త పార్టీకి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.

 

 పార్టీపేరుపై ఉత్కంఠ

  తమిళనాడు ప్రజలకు చిరపరిచితమైన తమిళ మానిల కాంగ్రెస్‌ను పునరుద్ధరిస్తారా లేక కొత్త పార్టీని పెడతారా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జీకేవీ అనుచరులు రెండు అభిప్రాయాలను బలపరిచారు. తమాకా తమిళనాడు శాఖను కాంగ్రెస్‌లో విలీనం చేసినా పుదుచ్చేరి శాఖ మరో వ్యక్తి సారథ్యంలో కొనసాగడం జీకేవీని ఇరుకున పడేసింది. తమాకానే కావాలనుకుంటే పుదుచ్చేరి శాఖలో చేరి తమిళనాడుకు విస్తరించడం లేదా పుదుచ్చేరి శాఖను రద్దుచేయించడం.. ఈ రెండే మార్గాలని ఎన్నికల కమిషన్ జీకేవీకి సూచించింది. ఇంతకూ జీకే వాసన్ ఏ నిర్ణయం తీసుకున్నారో ఇప్పటివరకు వెల్లడించలేదు.

 

 నేడు పతాకావిష్కరణ

 ఈనెల 28వ తేదీన తిరుచ్చిలో పార్టీని ప్రకటిస్తున్న నేపథ్యంలో మంగళవారం చెన్నై మైలాపూర్‌లో కార్మికుల విభాగ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ సిద్ధాంతాలపై రూపొందించిన సీడీని జీకేవీ ఆవిష్కరించగా, టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ తొలికాపీని అందుకున్నారు. అనంతరం జీకే వాసన్ మాట్లాడుతూ, తమ అభిమానులంతా తమిళ మానిల కాంగ్రెస్‌నే కోరుకుంటున్నారని, అయితే ఎన్నికల కమిషన్ ఆమోదంతో పార్టీని ప్రకటించనున్నట్లు చెప్పారు. బుధవారం ఉదయం 10 గంటలకు చెన్నైలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. తిరుచ్చిలోని జీ కార్నర్ మైదానంలో పార్టీ ఆవిర్భావ బహిరంగ వేదిక నిర్మాణపు పనులు భారీ ఎత్తున సాగుతున్నాయి. పార్టీ నేతలు ఆశీనులయ్యేందుకు 20వేల కుర్చీలు సిద్ధం చేస్తున్నారు. 27వ తేదీన జీకేవాసన్ తిరుచ్చి చేరుకుంటున్నారు. 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో బహిరంగ సభను ప్రారంభించి రాత్రి 8 గంటలకు పార్టీ పేరును ప్రకటిస్తారు. పార్టీ ఆవిర్భావ వేడుకకు కనీసం 2 లక్షల మంది హాజరయ్యేలా చూడాలని లక్ష్యం పెట్టుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top