ఎంఐఎం ఎన్ని‘కలలు’


సాక్షి, ముంబై: తన పార్టీని మహారాష్ట్రలో వీలైనంత మేర విస్తరించేందుకు మజ్లిస్-ఎ-ఇత్తహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ప్రయత్నాలు తీవ్రం చేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పలు ప్రాంతాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది.  హైదరాబాద్‌కు చెందిన ఈ పార్టీ ఇప్పటికే మరాఠ్వాడాలోని ఎనిమిది జిల్లాల్లో కార్యాలయాలను ప్రారంభించి ఎన్నికల కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే తూర్పు ఔరంగాబాద్, సెంట్రల్ ఔరంగాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎంఐఎం నుంచి పోటీకి ఆసక్తి కనబరుస్తున్న అభ్యర్థుల బలాబలాలను మదింపు చేయనున్నట్టు తెలిసింది.



 సెప్టెంబరు మొదటివారంలో అభ్యర్థులను ఖరారు చేయనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఎన్సీపీకి చెందిన కొంద రు అసంతృప్తి నాయకులు ఎంఐఎంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వినికిడి. మరాఠ్వాడా, ముంబై, నాసిక్ జిల్లాలతోపాటు విదర్భ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని పార్టీ భావిస్తోంది. నాందేడ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 11 స్థానాలను ఎంఐంఎం గెలుచుకున్నప్పటికీ, సిల్లోడ్ మున్సిపాలిటీలో అంతగా విజయం సాధించలేకపోయింది. దీని తరువాత నిర్వహించిన లోకసభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నా, తాజా అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహరచన మొదలుపెట్టింది.



 మరాఠ్వాడలో 25 శాతం ముస్లింలు

 మరాఠ్వాడాలో దాదాపు 25 శాతం మంది ముస్లింలు ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మైనార్టీ ఓటర్ల సంఖ్య 30 నుంచి 40 శాతం వరకు ఉంది. ఎన్నికల సమయంలో ఇతర పార్టీలతోనూ పొత్తులు పెట్టుకునే విషయంపై కూడా ఎంఐఎం సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు సెంట్రల్ ఔరంగాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరోవైపు ఈ నియోజకవర్గంలో ఎన్సీపీకి చెందిన ఏడుగురు నాయకులు ఈసారి టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీరిలో టిక్కెట్ లభించని అభ్యర్థులు ఎంఐఎం నుంచి పోటీ  చేసేందుకు ఆస్కారం ఉంది.



 సంప్రదింపుల్లో ఉన్నారు..   -ఖురేషీ

 ఔరంగాబాద్ నుంచి పోటీ చేసేందుకు అనేక మంది ఆసక్తి బరుస్తున్నారని ఎంఐఎం జిల్లా అధ్యక్షులు జావేద్ ఖురేషీ తెలిపారు. ఎన్సీపీకి చెందిన పలువురు తమతో సంప్రదింపుల్లో ఉన్నారని చెప్పారు. అయితే ఔరంగాబాద్ టికెట్ ఎవరికి కేటాయించాలనే విషయంపై తుది నిర్ణయం పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీసుకుంటారని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top