అరవిందో ఆశ్రమానికి చెందిన మహిళల ఆత్మహత్య

అరవిందో ఆశ్రమం - Sakshi


 పుదుచ్చేరి :  పుదుచ్చేరి అరవిందో ఆశ్రమానికి చెందిన అయిదుగురు మహిళలు, వారి తల్లిదండ్రులు  గురువారం తెల్లవారుజామున కళాపేట గ్రామ సమీపంలో సముద్రంలో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు.  తల్లీ, ఇద్దరు కూతుళ్లు మృతి చెందారు. తండ్రీ,  ముగ్గురు కుమార్తెల పరిస్థితి విషమంగా ఉంది.  బీహార్ రాష్ట్రానికి చెందిన ఒకే కుటుంబంలోని అక్కాచెల్లెళ్లు అయిదుగురు జయశ్రీ (54), అరుణశ్రీ (50), రాజశ్రీ (45), నివేదిత (42), హేమలత (40)లు చాలా కాలం నుంచి ఈ ఆశ్రమంలో ఉంటున్నారు.  వారి తల్లిదండ్రులు గదాధర్ ప్రసాద్ (80), శాంతిదేవీ (70)లు పుదుచ్చేరిలోనే వేరుగా నివసిస్తున్నారు. ఆశ్రమంలో ఉంటున్న అక్కాచెల్లెళ్లలో కొందరిపై ఐదేళ్ల క్రితం ఆశ్రమ నిర్వాహకులు లైంగికవేధింపులకు పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు.



లైంగికవేధింపులపై  పుదుచ్చేరి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దాంతో వారు కోర్టు ద్వారా ఫిర్యాదు నమోదు చేయించారు. నిబంధనలకు విరుద్దగా పోలీసులకు ఫిర్యాదు చేసినందున ఆశ్రమాన్ని విడిచివెళ్లిపోవాలని నిర్వాహకులు హుకుం జారీచేశారు. ఆ తరువాత ఆ అక్కాచెల్లెళ్లు స్థానిక కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అన్ని చోట్ల ఆశ్రమానికి అనుకూలంగా తీర్పులు వచ్చాయి.  ఆ మహిళలు వారం రోజుల లోపల ఆశ్రమం విడిచి వెళ్లిపోవాలని సుప్రీం కోర్టు ఈ నెల 9న తీర్పు చెప్పింది. ఈ తీర్పును అనుసరించి బుధవారం వారిని బలవంతంగా ఆశ్రమం నుండి పంపించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో వారిలో ఒక మహిళ భవనం పైకి ఎక్కి తమను బలవంతంగా బయటకు పంపడానికి ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అయితే పోలీసులు  ఆ అక్కాచెల్లెళ్లకు నచ్చజెప్పి  వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.



ఈ పరిస్థితిని అవమానంగా భావించిన ఆ కుటుంబ సభ్యులు ఏడుగురు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గురువారం తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో నడుచుకుంటూ సముద్రంలోకి వెళ్లిపోయారు.  సమీపంలోని మత్య్సకారులు వారిని గమనించి రక్షించడానికి ప్రయత్నించారు. తండ్రి ప్రసాద్, కుమార్తెలు నివేదిత, జయశ్రీ, హేమలతలను రక్షించారు. వారిని ఒడ్డుకు తీసుకువచ్చి  ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.  కొన్నిగంటల  తరువాత తల్లి శాంతాదేవి, కుమార్తెలు అరుణశ్రీ, రాజశ్రీల మృతదేహాలు తండ్రాయన్పేట, చిన్న మొదలయార్చివాడి గ్రామాల వద్ద ఒడ్డుకు కొట్టుకువచ్చాయి.

**

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top