రోజా ప్రాణాలకు ముప్పు!

ఆర్కే సెల్వమణి


 భర్త సెల్వమణి ఆందోళన

 

 చెన్నై: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ రాజకీయాల కారణంగా తన భార్య రోజా ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె భర్త, సినీ దర్శకుడు ఆర్కే సెల్వమణి ఆందోళన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో ఇటీవల జరిగిన జాతరలో నియోజకవర్గ ఎమ్మెల్యే హోదాలో ఆర్కే రోజా పాల్గొన్నారు. దేవునికి హారతి ఇచ్చేందుకు రోజా వెళుతుండగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు అనుచరులు కొందరు ఆమెను అడ్డుకుని కత్తితో గాయపరిచారు. అంతేగాక ఆమె చేతిలోని హారతి పళ్లెంను తోసివేయడంతో కిందపడిపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దుందుడుకు చర్యలకు కలత చెందిన రోజా బైఠాయించి నిరసన తెలిపారు.



జాతరలో తొలి హారతి తనదే కావాలని రోజా పట్టుపట్టి దేవాలయాల్లో పార్టీ రాజకీయాలకు పాల్పడుతున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తూ రోజా దిష్టిబొమ్మను దహనం చేశారు. టీడీపీ చర్యలను నిరసిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించి  ముద్దు కృష్ణమనాయుడు దిష్టిబొమ్మను దహనం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే రోజా దిష్టిబొమ్మ దహనానికి అడ్డుచెప్పని పోలీసులు గాలి దిష్టిబొమ్మను మాత్రం అడ్డుకోవడం ద్వారా అధికార పార్టీ తొత్తులుగా మారారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ విమర్శించింది.



 ఈ నేపథ్యంలో రోజా భర్త సెల్వమణి గురువారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. దేవుడికిచ్చే హారతిలో మొదటిది, రెండోది అంటూ ఉండదన్నారు. భగవంతుడంటే ఎంతో భక్తిప్రపత్తులు కలిగిన రోజా హారతుల కోసం పాకులాడే స్వభావి కాదని ఆయన అన్నారు. జాతర సమయంలో తనచేతిపై కత్తిగాటు పడినందుకు కూడా ఆమె బాధపడలేదని, హారతి పళ్లెంను తోసివేయడంపైనే తీవ్రంగా కలత చెందారని ఆయన అన్నారు. రోజా ఎంతో ధైర్యశాలి అని, ఇటువంటి పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనగలరని, అయితే ఈ సమయంలో ఆమె ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తాను భయపడుతున్నట్లు సెల్వమణి చెప్పారు.

**

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top