దాడులు చేసేది వాళ్లే... సెక్యూరిటీ కల్పించేది వాళ్లే


న్యూఢిల్లీ: కర్ణాటకలోని మంగళూరులో షరాన్‌ పాంప్‌వెల్‌ అనే 40 ఏళ్ల యువకుడికి ‘ఈశ్వరీ మ్యాన్‌ పవర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌’ అనే కంపెనీ ఉంది. కావాల్సిన మాల్స్‌కు, దుకాణాలకు, వ్యాపారవేత్తలకు భద్రతా కల్పించడమే ఆయన కంపెనీ కర్తవ్యం. మంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆయన కంపెనీకి నగరంలోని సిటీ సెంటర్, ఫోరమ్‌ ఫిజా, బిగ్‌ బజార్‌ అనే పెద్ద మాళ్లతోపాటు అనేక అపార్ట్‌మెంట్లు, దుకాణాలకు సెక్యూరిటీ కంట్రాక్టులు ఉన్నాయి. ఇందులో పెద్ద విశేషమేముందని మనం అనుకోవచ్చు.



షరాన్‌ పాంప్‌వెల్‌ నేడు విశ్వహిందూ పరిషత్‌ అనుబంధ సంస్థయిన  ‘బజరంగ్‌ దళ్‌’ దక్షణ కర్ణాటక డివిజన్‌కు కన్వీనర్‌. ఆయన బజరంగ దళ్‌లో అంచెలంచెలుగా ఎలా ఎదుగుతూ వచ్చారో, వ్యాపార రంగంలోనూ అలాగే ఎదుగుతూ వచ్చారు. ఇందుకు ఆయన నిర్వహిస్తున్న విధులకు విడదీయలేని విరుద్ధమైన సంబంధం ఉండడమే కారణం. బజరంగ్‌ దళ్‌  కన్వీనర్‌గా మాల్స్‌ మీద, దుకాణాల మీద, ముఖ్యంగా ముస్లిం వ్యాపారులకు చెందన సంస్థల మీద దాడులు జరిపించేది షరానే. వాటికి సెక్యూరిటీ కల్పించేది ఆయనే. బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలను ముందుగా గొడవలకు పంపించి దాడులు  చేయించడం, దౌర్జన్యాలకు దిగడం, ఆ తర్వాత తన సంస్థ సెక్యూరిటీని తీసుకొంటే హిందూ సంస్థల నుంచి ఎలాంటి గొడవలు, దౌర్జన్యాలు జరగవని హామీ ఇవ్వడం, సెక్యూరిటీ కాంట్రాక్టులు కుదుర్చుకోవడం షరాన్‌కు అది నుంచి అబ్బిన విద్య.



ఆయన సెక్యూరిటీ సంస్థలో పనిచేసేది ఎక్కువ మంది బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలే. కొంత మంది ముస్లింలు కూడా ఉన్నారని షరానే తెలిపారు. ‘నేను 2005లో బజరంగ్‌ దళ్‌లో చేరాను. 2011లో మంగళూరు డివిజన్‌కు కన్వీనర్‌గా అయ్యాను. అప్పుడే నేను ఈశ్వరి మ్యాన్‌ పవర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ కంపెనీని ఏర్పాటు చేశాను. 2014లో దక్షిణ కర్ణాటక డివిజన్‌కు కన్వీనర్‌గా నియమితులయ్యాను. పదవితో పాటు నా వ్యాపారం విస్తరించింది. కేఎస్‌ రావు నగరంలోని సిటీ సెంటర్, పండేశ్వర్‌లోని ఫోరమ్‌ ఫిజా, లాల్‌ బాగ్‌ ఏరియాలోని బిగ్‌ బజార్‌కు సెక్యూరిటీ కాంట్రాక్టు నాదే’ అని షరాన్‌ తెలిపారు.



సిటీ సెంటర్, ఫోరమ్‌ ఫిజా మాల్స్‌లలో ముస్లిం వ్యాపారులకే ఎక్కువ షాపులు ఉన్నాయి. గతంలో ఏ గొడవలు జరిగినా బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలే వీటిపై దాడులు జరిపేవారు. ఇప్పుడు ఎక్కువ మంది ముస్లిం వ్యాపారులే తన క్లైంట్లుగా ఉన్నారని, దాంతో తన వ్యాపారం రెండింతలయిందని షరాన్‌ తెలిపారు. ‘ఎవరు దాడులు చేస్తారో, ఎవరు సెక్యూరిటీ కల్పిస్తారో మాకు తెలుసు. దాడులు జరిపించే వారికే సెక్యూరిటీ కాంట్రాక్ట్‌ ఇస్తే సేఫ్‌గదా! మరో సంస్థకు సెక్యురిటీ కాంట్రాక్ట్‌ ఇస్తే ఇంకా ఎక్కువ దాడులు జరగొచ్చు. మా వ్యాపారం సర్వనాశనం కావడానికి ఒక్క దాడి చాలదా! గతంలో ఇలాంటి దాడులను నిలువరించడంలో రాష్ట్ర పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు’ అని ఈశ్వరీ మ్యాన్‌ పవర్‌ సొల్యూషన్స్‌కు ఎందుకు సెక్యూరిటీ కాంట్రాక్ట్‌ ఇచ్చారని ప్రశ్నించగా సెటీ సెంటర్‌లోని ఓ ముస్లిం వ్యాపారస్థుడు సమాధానమిచ్చారు.



‘హిందుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికిగానీ, బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలకు జీతాలు ఇవ్వడానికి మా వద్ద ప్రత్యేక నిధులేమీ ఉండవు. పైగా కార్యకర్తలందరూ నిరుద్యోగ యువకులు. వారికి ఏదో ఉపాధి చూపించాలిగదా? అందుకే వారినే నేను ఎక్కువగా నా సెక్యూరిటీ సంస్థలోకి తీసుకుంటున్నాను. నా దొగ్గరికొచ్చి ఉద్యోగం అడిగిన కార్యకర్తలెవరికీ ఇంతవరకు నేను కాదనలేదు. నా దగ్గర ఎలా అయితే వారి సంఖ్య పెరుగుతుందో అలాగే వ్యాపారాన్ని విస్తరించాలి గదా! ఎంతో కష్టపడితేగానీ వ్యాపారం ఈ స్థాయికి రాలేదు’ అని షరాన్‌ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో బజరంగ దళ్‌కు ఉత్తర, దక్షిణ పేరిట రెండు విభాగాలున్నాయి. షరాన్‌ నాయకత్వంలోని దక్షిణ విభాగం అతి క్రీయాశీలకంగా ఉండగా, ఉత్తర విభాగం స్తబ్ధుగా ఉంది. ప్రతిచోట కొంత మంది నాయకులు ఇలా బజరంగ దళ్‌ను ఉపయోగించుకుంటున్నారని అనలేం. పోలీసు వ్యవస్థ బలహీనంగా ఉన్న కర్ణాటకలో ఇలా జరుగుతోంది.



(‘బజరంగ్‌ దళ్‌’ అంటే బలిష్టమైన దళమని అర్థం. అయోధ్య ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం కోసం 1984లో విశ్వహిందూ పరిషద్‌ ఈ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఢిల్లీకి చెందిన ప్రముఖ జర్నలిస్ట్‌ ధీరేంద్ర కే. ఝా పరిశోధనాత్మక జర్నలిజంలో భాగంగా ‘షాడో ఆర్మీస్‌: ఫింజ్‌ ఆర్గనైజేషన్స్‌ అండ్‌ ఫుట్‌ సోల్జర్స్‌ ఆఫ్‌ హిందుత్వ’ పేరిట రాసిన పుస్తకంలోని అంశాల ఆధారంగా ఈ వార్తా కథనం. ఈ పుస్తకం ఏప్రిల్‌ 28వ తేదీన మార్కెట్‌లోకి విడుదలవుతోంది).









 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top