మెట్రో కాదు.. మెట్రినో

మెట్రో కాదు.. మెట్రినో - Sakshi


తలపెకైత్తి చూస్తే.. గాల్లో జామ్‌జామ్ మంటూ దూసుకెళ్తున్న మినీ పాడ్లు.. ట్రాఫిక్ జామ్‌లు లేవు.. కాలుష్యం గోల లేదు.. డ్రైవర్ల అవసరమే లేదు.. అంతా ఆటోమెటిక్.. ఎక్కడ.. అమెరికానా.. ఇంగ్లండ్‌నా.. ఎక్కడో కాదు.. ఇక్కడే.. మన ఢిల్లీలోనే.. త్వరలో మన దేశ రాజధానిలో ఇలాంటి సీన్లు చాలా కామన్ కానున్నాయి.. మెట్రో చూసేశాం.. ఇక మెట్రినో చూడ్డానికి సిద్ధమైపోండి..

 

ఏమిటీ మెట్రినో..

ఇది డ్రైవర్ అవసరం లేని ప్రజా రవాణా వ్యవస్థ. బస్సులు, మెట్రో ఎలాగో.. ఇదీ అలాగే.. ఢిల్లీలో ట్రాఫిక్‌తోపాటు కాలుష్యమూ ఎక్కువ. వీటికి చెక్ పెట్టడానికి  కేంద్రం తెస్తున్నదే ఈ పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్(పీఆర్‌టీ) సిస్టం. ఢిల్లీలోని దౌలాకువా ప్రాంతం నుంచి హర్యానాలోని మనేసర్ వరకూ అంటే దాదాపు 70 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మించనున్నారు. తొలుత పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీ-గురుగ్రామ్ బోర్డర్ నుంచి సోహ్నా రోడ్ వరకూ 13 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. పైలట్ ప్రాజెక్టు కోసం రూ.850 కోట్లు అవుతుందని అంచనా. మొత్తం ప్రాజెక్టు పూర్తికి రూ.4 వేల కోట్లు అవుతుంది.

 

 ఎలా పనిచేస్తుంది?

 మెట్రినో కరెంటుతో పనిచేస్తుంది. సెక్యూరిటీ కెమెరాల ద్వారా దీని పనితీరును సమీక్షిస్తుంటారు. మెట్రినోలో మొత్తం 1,100 మినీ పాడ్లు ఉంటాయి. ఒకదాంట్లో ఐదుగురు ప్రయాణించవచ్చు. రోప్‌వేలాంటి దాని ఆధారంగా ఇది ప్రయాణిస్తుంది. పైనుంచి వెళ్లే ఇవి.. స్టేషన్ వచ్చేసరికి.. కిందకు దిగుతాయి. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.

 

 మరి టికెట్ రేటో..

 సాధారణ రవాణా వ్యవస్థల్లో ఎంత ధర ఉంటుందో దీనికీ అంతే ఉంటుందని చెబుతున్నారు. మెట్రోతో పోలిస్తే.. తక్కువ ఉండొచ్చని కూడా అంటున్నారు. ఎందుకంటే.. మెట్రో నిర్మాణం కోసం కిలోమీటరుకు రూ.250 కోట్ల దాకా ఖర్చయితే.. మెట్రినోలో కిలోమీటరుకు రూ.50-60 కోట్ల వరకూ ఖర్చవుతుంది. దీని వల్ల రేట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే మెట్రినో టెండర్ల ప్రక్రియ కూడా మొదలైపోయింది. మరో రెండు నెలల్లో పైలట్ ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభమవుతాయని కేంద్రమంత్రి గడ్కరీ ప్రకటించారు కూడా. సో.. బీ రెడీ ఫర్ మెట్రినో..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top