రోడ్లను మాకు వదిలేయండి..ప్లీజ్!

రోడ్లను మాకు వదిలేయండి..ప్లీజ్! - Sakshi


రాష్ట్ర ప్రభుత్వానికి బీఎంసీ లేఖ

* అనుమతి కోసం నిరీక్షణ

* ప్రస్తుతం ఎమ్మెమ్మార్డీయే, పీడబ్ల్యూడీ, ఎమ్మెస్సార్డీసీలూ భాగస్వాములే

* ఒకే గొడుగుకింద అయితే నిర్వహణ బాగుంటుందని బీఎంసీ వాదన

* ఆదాయం పోతుందని మిగతా సంస్థల ఆందోళన


సాక్షి, ముంబై : నగరంలోని అన్ని రోడ్ల నిర్వహణను తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బృహన్ ముంబై మున్పిపల్ కార్పొరేషన్ కోరుతోంది. ఈ మేరకు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం బీఎంసీ పంపించింది. నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు, బ్రిడ్జీల నిర్వహణను చూసుకుంటామని బీఎంసీ ఓ ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. ఒకే గొడుగు కింద వీటన్నింటిని నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చని బీఎంసీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారటీ (ఎమ్మెమ్మార్డీఏ), ప్రజా పనుల విభాగం (పీడబ్ల్యూడీ), మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎమ్మెస్సార్డీసీ) ఈ రోడ్ల నిర్వహణలో భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నాయి.



ఈ సందర్భంగా అడిషినల్ మున్సిపల్ కమిషనర్ ఎస్వీఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీఎంసీ గొడుగు కింద అన్ని బ్రిడ్జీల నిర్వహణ బాధ్యతను చేపట్టాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఒక్క సంస్థ ఆధ్వర్యంలో బ్రిడ్జిల నిర్వహణ చేపడితే సక్రమంగా నిర్వహించగలుగుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈస్టర్న్ ఫ్రీవే, శాంతాకృజ్-చెంబూర్ లింక్‌రోడ్డు ప్రస్తుతం ఎమ్మెమ్మార్డీఏ ఆధీనంలో ఉన్నాయి. శాంతాకృజ్‌లో ఉన్న ఫ్లై ఓవర్, వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఉన్న అంధేరి ఫ్లై ఓవర్ కాకుండా ఎన్నో నిర్మాణాలను ప్రస్తుతం పీడబ్ల్యూడి, ఎమ్మెస్సార్డీసీ నిర్వహిస్తున్నాయి.



కాగా, ఆగస్ట్‌లో అన్ని రోడ్లకు సంబంధించిన నిర్వహణ తామే చూసుకుంటామని బీఎంసీ ఓ ప్రతిపాదనను పంపించింది. మంచి ఫలితాలు ఇచ్చే విధంగా వీటి నిర్వహణ బాధ్యతను చూస్తామని బీఎంసీ పేర్కొంది. ఇదిలా ఉండగా, రోడ్ల నిర్వహణ నేపథ్యంలో ప్రకటనల ద్వారా ఆదాయం ఆర్జించవచ్చని చాలా ఏజెన్సీలు వీటిని తమ ఆధీనంలో ఉంచుకుంటున్నాయని, అవి ఏవీ తమ భాగస్వామ్యాలను వదులుకోవడానికి సిద్ధంగా లేవని బీఎంసీ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top