మతం పేరుతో ఘర్షణలొద్దు

మతం పేరుతో ఘర్షణలొద్దు - Sakshi

  • పరమత సహనం మన విధానం  

  • రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపు

  • న్యూఢిల్లీ: సమాజంలో సంఘర్షణలకు మతం కారణం కారాదని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పిలుపునిచ్చారు. మతాల మధ్య శాంతి, సహ నం, సౌభ్రాతృత్వ పరిఢవిల్లాలని ఆకాంక్షించా రు. సోమవారం నాటి 66వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగించారు. మతమనేది ఐక్యతను సాధించే సాధనమన్న మహాత్మాగాంధీ వ్యాఖ్యను ఉటంకిస్తూ.. మతం వివాద హేతువు కాకూడదని ప్రణబ్ స్పష్టం చేశారు.  



    పరమత సహనం మన విధానమని గుర్తుచేశారు. ఐకమత్యమే బలమని, ఆధిక్య భావన బలహీనత అని భారతీయ జ్ఞానం ఉద్భోదిస్తోందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. భారత్ నిలుపుకుంటూ వస్తున్న విలువలను కాపాడుకోవాల్సి ఉందన్నారు. కేంద్రంలో మోదీ సర్కారు కొలువుతీరిన తరువాత పలువురు బీజేపీ నేతలు, హిందూత్వ సంస్థల ప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ‘ప్రజాస్వామ్య పవిత్ర గ్రంథం మన రాజ్యాంగం. భిన్నత్వానికి ప్రతీకగా నిలిచిన భారతదేశ సామాజిక, ఆర్థిక పరివర్తనకు అది దిక్సూచిగా నిలిచింది’ అని ప్రణబ్ తన ప్రసంగంలో అభివర్ణించారు.

     

    ఉగ్రవాదాన్ని ఉపేక్షించం: రాజకీయ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలు కొన్నిసార్లు మన సంప్రదాయ విలువలకు వ్యతిరేకంగా పరిణమిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. చట్టం ముందు అన్ని మతాలు, అన్ని విశ్వాసాలు సమానమనే విధానానికి కట్టుబడి ఉండడం భారత్ బలమని స్పష్టం చేశారు. ప్రపంచంలో మతోన్మాద హింస పెచ్చరిల్లుతున్న సమయంలో.. విశ్వాసానికి, రాజనీతికి మధ్య ఉన్న సంబంధానికి మనమిచ్చిన నిర్వచనం భారత్‌ను బలమైన శక్తిగా నిలిపిందని వివరించారు. పాకిస్తాన్ చర్యలను పరోక్షంగా విమర్శిస్తూ.. ‘దేశాల మధ్య ఘర్షణల్తో సరిహద్దులు రుధిర దారులవుతున్నాయి. ఉగ్రవాదం సరిహద్దులు దాటి విస్తరిస్తోంది.



    శాంతి, అహింస, పొరుగుదేశాలతో సఖ్యత భారత విదేశాంగ విధానంలో కీలకమైనవి. అయితే, మన అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నించే శత్రువుల పట్ల అలక్ష్యంగా ఉండబోం’ అని ప్రణబ్ తేల్చి చెప్పారు. భారతీయులకు వ్యతిరేకంగా యుద్ధం చేసే శక్తులను ఓడించే శక్తిసామర్ధ్యాలు భారత్‌కు ఉన్నాయన్నారు. ఆర్థికరంగంలో 2015 సంవత్సరం ఆశావహంగా ప్రారంభమైందని ప్రణబ్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల్లో 5% మించి వృద్ధి రేటు నమోదవడం శుభసూచకమన్నారు.

     

    మహిళల భద్రత మన బాధ్యత: అత్యాచారాలు, హత్యలు, వేధింపులు, కిడ్నాప్‌లు, వరకట్న హత్యలు.. సమాజంలో మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత భారతీయులందరిపై ఉందన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top