విభజన సమస్యలకు చర్చలతో పరిష్కారం

విభజన సమస్యలకు చర్చలతో పరిష్కారం - Sakshi

  • గవర్నర్ నరసింహన్ వ్యాఖ్య

  •  హైకోర్టు విభజనలో ఎలాంటి గొడవా లేదు..

  •  విభజన చట్టంలో ఉన్నమేరకు నడచుకుంటాం

  •  రెండు రాష్ట్రాలూ అభివృద్ధిపథంలో సాగుతున్నాయి

  •  కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ.. రాష్ట్రపతితోనూ సమావేశం

  • సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని వివాదాస్పద అంశాలు, సమస్యలకు చర్చల ద్వారా పరిష్కారం లభించేలా చూస్తామని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఢిల్లీ వచ్చిన గవర్నర్ నరసింహన్ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల పనితీరు, రాజకీయ పరిస్థితులపై నివేదిక అందచేసినట్టు సమాచారం.



    సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోనూ ఆయన సమావేశమయ్యారు. రాజ్‌నాథ్‌తో భేటీ అనంతరం తనను కలసిన విలేకరులతో గవర్నర్ మాట్లాడుతూ ఈ భేటీ సాధారణమేనని, విశేషమేమీ లేదని చెప్పారు. నివేదిక సమర్పించిన విషయమై అడగ్గా.. ‘‘నివేదిక ఇస్తున్నట్టు మీరే రాశారు. మీ దగ్గరే నివేదిక ఉంటుంది. మీరే అన్నీ రాస్తారు. మీకే తెలిసి ఉండాలి’ అంటూ ఆయన చమత్కరించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో శాంతిభద్రతల అంశాన్ని ఏపీ సీఎస్ లేవనెత్తిన విషయమై ప్రశ్నించగా.. ‘‘ఆ సమావేశానికి నేను వెళ్లలేదు. అలాంటిదేమైనా ఉంటే హోంమంత్రితో చర్చిస్తాం’’ అని నరసింహన్ చెప్పారు.



    విభజన చట్టంలోని 5వ షెడ్యూల్‌సహా ఇతర అంశాలపై చాలా వివాదాలున్నాయని అడగ్గా.. ‘‘అన్నీ మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం. దానిలో పెద్ద సమస్యలేదు. హైకోర్టు విభజన విషయంలోనూ ఎలాంటి గొడవా లేదు. విభజన చట్టంలో ఉన్నమేరకు నడచుకుంటాం’’ అని గవర్నర్ బదులిచ్చారు. ఏపీ, తెలంగాణకు సంబంధించి కేంద్ర హోంమంత్రి తనకు ఎలాంటి దిశానిర్దేశం చేయలేదని నరసింహన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.



    రెండు రాష్ట్రాల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళం చోటుచేసుకోవడంపై కేంద్రానికి నివేదిక ఇస్తున్నారా? అని అడగ్గా.. ‘‘హౌస్‌లో స్పీకర్ సుప్రీం కదా.. నిర్ణయాలు తీసుకునేది ఆయనే. దానికి మేం ఏం చేయలేం’’ అని నరసింహన్ బదులిచ్చారు. రెండు రాష్ట్రాల్లోనూ శాంతి భద్రతల సమస్యల్లేవని గవర్నర్ చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ప్రగతి బాగుందని, అభివృద్ధిపథంలో ముందుకు సాగుతున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగి ఏడాది ముగిసేనాటికి.. క్షేత్రస్థాయి నుంచి రెండు రాష్ట్రాలూ మంచి ఫలితాలు సాధిస్తాయని నమ్మకముందని చెప్పారు.

     

    నేడు మోదీ, సదానంద గౌడతో గవర్నర్ భేటీ



    ఇదిలా ఉండగా గవర్నర్ నరసింహన్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడలతో మంగళవారం వేర్వేరుగా భేటీ అవనున్నారు. సదానంద గౌడతో గవర్నర్ మంగళవారం ఉదయం సమావేశమై హైకోర్టు విభజనపై చర్చించనున్నట్టు సమాచారం. సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నారు. అనంతరం గవర్నర్ హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top