ఆ లాయర్లపై 'బార్' ఆగ్రహం!


న్యూఢిల్లీ: బీబీసీ ప్రసారం చేసిన 'నిర్భయ' (ఇండియాస్ డాటర్) లఘు చిత్రంలో రేపిస్టుల  న్యాయవాదులు చేసిన వ్యాఖ్యలను బార్‌కౌన్సిల్ సీరియస్‌గా తీసుకుంది. దోషుల తరఫున వాదించిన ఇద్దరు లాయర్ల వ్యాఖ్యలపై విచారణ జరిపించాలన్న అభిప్రాయం బార్‌కౌన్సిల్ వ్యక్తం చేసింది. ప్రాథమికంగా వారు చేసిన వ్యాఖ్యలు వృత్తిరీత్యా అనుచితమైనవని బార్‌కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు మన్న కుమార్ మిశ్రా ఎన్డీటీవీతో అన్నారు. వారి వ్యాఖ్యలపై విచారణ జరుపుతామని తప్పు చేశారని తేలితే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. కొందరు న్యాయవాదులు ఆ ఇద్దరు డిఫెన్స్ లాయర్ల లెసైన్సులను సస్పెండ్ చేయాలని కోరుతున్నారన్నారు. వారిని కఠినంగా శిక్షించాలంటూ సామాజిక వెబ్‌సైట్లలో వందల పోస్టులు వచ్చాయని వ్యాఖ్యానించారు.


2012 డిసెంబర్ 16న ఢిల్లీలో వైద్య విద్యార్థినిని సామూహిక అత్యాచారం చేసిన దోషుల తరపున ఎంఎల్ శర్మ, ఏకే సింగ్‌లు వాదిం చారు. భారతీయ సంస్కృతిలో మహిళకు స్థానమే లేదని కూడా న్యాయవాది శర్మ ఓ దశలో వ్యాఖ్యానించారు. సామాజిక స్పృహ లేకుండా చేసిన ఈ వ్యాఖ్యలను ఏ విధంగానూ సమర్థించలేమని, ఇలాంటి ఆలోచనా విధానం ఉన్న వ్యక్తులు న్యాయవాదులుగా ఉండటం  నేరాన్ని మించిన తప్పని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి అన్నారు.  డిఫెన్స్ లాయర్ శర్మ మాత్రం తన వ్యాఖ్యలను లఘుచిత్రంలో వక్రీకరించారన్నారు. పది రోజు ల పాటు తనను ఇంటర్వ్యూ చేసిన చిత్ర రూపకర్తలు తన మాటల్లో ఒక లైను మాత్రమే ప్రసారం చేశారని అన్నారు. మరో డిఫెన్స్ లాయర్ ఏకేసింగ్ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.

 

నిషేధాన్ని ఎత్తివేయండి: ఎడిటర్‌‌స గిల్డ్

'భారత పుత్రి(ఇండియాస్ డాటర్)' డాక్యుమెంటరీ ప్రసారం, ప్రచురణపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని భారత ఎడిటర్స్ గిల్డ్ శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. భారత ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కాదని బీబీసీ ఆ డాక్యుమెంటరీని భారత్ మినహా పలు దేశాల్లో ప్రసారం చేసిన విషయం తెలిసిందే. బాధిత స్త్రీ కుటుంబం అనుభవించిన క్షోభ, ప్రదర్శించిన తెగువ, వివేచన, పురోగామి దృక్పథాన్ని ఆ డాక్యుమెంటరీ అద్భుతంగా చూపిందని.. అలాంటి డాక్యుమెంటరీని నిషేధించడం సరికాదని ఎడిటర్స్ గిల్డ్ పేర్కొంది. అంతేకాకుండా, ఆ ఘటనలో దోషి అయిన ముకేశ్ సింగే కాకుండా, చదువుకున్నవారు, న్యాయవాదులు.. మహిళలపై వ్యక్తం చేసిన సిగ్గులేని వైఖరిని తేటతెల్లం చేసిందని గిల్డ్ పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top