21న ముహూర్తం?

21న ముహూర్తం?


విలీనం దిశగా అన్నాడీఎంకే అడుగులు

ఎడపాడి, పన్నీర్‌ శిబిరాల్లో కొనసాగుతున్న మంతనాలు

సీనియర్‌ నేతలతో పన్నీరుకు చిక్కులు




అన్నాడీఎంకే విలీనం కథ క్‌లైమాక్స్‌కు చేరుకుంది. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం వర్గాలు ఏకమయ్యేందుకు ఈనెల 21వ తేదీని ముహూర్తంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో మంచివార్త వింటారని శనివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో పన్నీర్‌ సెల్వం అన్నారు. అలాగే ఎడపాడి వర్గ అధికార ప్రతినిధి ధీరన్‌ సైతం అదే విషయాన్ని మీడియాకు తెలిపారు.



సాక్షి ప్రతినిధి, చెన్నై:  పళని, పన్నీర్‌ శిబిరాల విలీనం నేడో రేపు ఖరారయ్యే అకాశముంది. ఎడపాడి, పన్నీర్‌సెల్వం, దినకరన్‌లతో మూడు ముక్కలు, ఆరు చెక్కలుగా మారిన అన్నాడీఎంకే వర్గ విభేదాల కారణంగా ప్రజల్లో పలుకుబడి, ప్రతిష్టను కోల్పోయింది. ఎంజీఆర్‌ స్థాపించిన పార్టీ, రెండాకుల చిహ్నం ఎన్నికల కమిషన్‌ చేతుల్లో చిక్కిపోయింది. విలీనమైతేనే కేంద్రప్రభుత్వం నుంచి సహకారం లభిస్తుందని ప్రధాని మోదీ సైతం అల్టిమేటం ఇచ్చారు. పార్టీ లేదు, చిహ్నం లేదు, ప్రధాని తోడ్పాటు లేదు, పార్టీపై ప్రజల్లో విలువ కూడా అడుగంటి పోతున్న తరుణంలో విలీనం కావడం మినహా గత్యంతరం లేదనే వాస్తవాన్ని ఇరువర్గాలు గ్రహించాయి.



ఇప్పటికే సిద్ధమైనా..

పదవులపై పట్టుపట్టకుండా విలీనం కావాలని ఇరువర్గాలకు ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరికలు వంటి ఆదేశాలు జారీచేశారు. ఆలస్యమైతే దినకరన్‌ వల్ల కొత్త సమస్యలు తలెత్తగలవని ఆందోళన చెందిన ఎడపాడి, పన్నీర్‌ వర్గాలు శుక్రవారం ఒకేసారి విలీనానికి సిద్ధమయ్యాయి. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సుదీర్ఘంగా సమావేశమయ్యాయి. పన్నీర్‌ వర్గం పెట్టిన షరతులను 90 శాతం వరకు ఎడపాడి వర్గం ఆమోదించింది. చర్చలు కొలిక్కివచ్చి ఎడపాడి, పన్నీర్‌ వర్గాలు అమ్మ సమాధి వద్ద ఏకమై సాయంత్రం 7 గంటల తరువాత అధికారికంగా ప్రకటిస్తారని అందరూ ఆశించారు. అయితే అందరి ఆశలను తల్లకిందులు చేస్తూ రాత్రి 10 గంటల సమయంలో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.



అన్ని విధాలా మనకు న్యాయం

‘విలీనం వల్ల అన్ని విధాలా మనకు న్యాయం జరుగుతుంది, ఇందుకు నేను హామీ’ అంటూ పన్నీర్‌సెల్వం తన వర్గానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలు కాని మాజీ మంత్రులు నత్తం విశ్వనాథన్, కేపీ మునుస్వామి మంత్రి పదవులు కావాలని కోరారు. ఉప ఎన్నికల ద్వారా తమ గెలుపు కోసం రాజీనామా చేసేందుకు కొందరు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని కూడా వారు పన్నీర్‌పై ఒత్తిడి తెచ్చారు. ప్రధానంగా సీనియర్‌ నేతలు పాండియరాజన్, కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్, ఎంపీ మైత్రేయన్, ముగ్గురు ఎమ్మెల్యేలు ఇంకా అనేక డిమాండ్లు పన్నీర్‌ ముందు పెట్టడంతో ఆవన్నీ ఇప్పుడు కాదని నిరాకరించారు.



చర్చల్లో పాల్గొన్న నేతలంతా పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకుని రావడంతో వారికి నచ్చజెప్పడం పన్నీర్‌ వల్లకాక పోవడం, నేతల మొండిపట్టుతో విలీనంలో ప్రతిష్టంభన ఏర్పడింది. కొందరు నేతలు వెళ్లిపోయిన అనంతరం కూడా శనివారం తెల్ల వారుజాము 3 గంటల వరకు పన్నీర్‌సెల్వం నేతలో చర్చలు జరిపారు. శనివారం సైతం ఎడపాడి, పన్నీర్‌ వర్గాలు వేర్వేరుగా చర్చల్లో మునిగితేలాయి. ఒకటి రెండు రోజుల్లో ఒక మంచి వార్త వింటారని, విలీనం ఖాయమని పన్నీర్‌సెల్వం, ఎడపాడి వర్గ అధికార ప్రతినిధి ధీరన్‌ శనివారం మీడియాకు చెప్పారు. శుక్రవారం నాటి చర్చలకు కొనసాగింపుగా శనివారం సైతం ఇరువర్గాలు సమావేశంకాగా, ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈనెల 21వ తేదీన ఇరువర్గాలు విలీనంపై ప్రకటన చేస్తారని అంచనా.  



పదవుల కోసం పన్నీర్‌ వర్గం పట్టు

చర్చల ప్రారంభ దశలోనే విలీనం ద్వారా తమకు పార్టీ, ప్రభుత్వంలో పదవులు కావాలని పన్నీర్‌  వర్గం పట్టుబట్టడం ప్రారంభించారు. పన్నీర్‌సెల్వంకు పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ప్రజాపనులు లేదా హోంశాఖ శాఖలతో డిప్యూటీ సీఎం పదవి, చెమ్మలై, పాండియరాజన్‌లకు మంత్రి పదవులు ఖాయమని ఎడపాడి వర్గం సమాచారం ఇచ్చింది. పన్నీర్‌ కోరుతున్న ఆర్థిక మంత్రిత్వ శాఖను ఇచ్చేందుకు ఎడపాడి వర్గం నిరాకరించింది. ఎమ్మెల్యేలు కాని వారు సైతం మంత్రి పదవుల కోసం పట్టుపట్టారు. అంతేగాక తమ వర్గానికి కేటాయించే పదవులు ఏమిటో ఇప్పుడే లిఖితపూర్వకంగా తెలియజేయాలని పన్నీర్‌ వర్గ నేతలు ఎడపాడి వర్గాన్ని పట్టుబట్టారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top