ఏడేళ్ల కిందటే కాలం చెల్లింది!

ఏడేళ్ల కిందటే కాలం చెల్లింది!


గల్లంతైన ఏఎన్32 విమానానికి ఈ నెలలోనే మూడుసార్లు మరమ్మతులు

- కాలం చెల్లిన విమానాన్ని వాడటం వల్లే ఈ దుస్థితి అంటూ విమర్శలు

- ఆచూకీ లభించే అవకాశం 50% మాత్రమేనంటున్న అధికార వర్గాలు

 

 సాక్షి ప్రతినిధి, చెన్నై : అదృశ్యమైన భారత వాయుసేన విమానం ఏఎన్32కు అనేకమార్లు మరమ్మతులు జరిగాయని, ఆ విమానం జీవిత కాలం ఏడేళ్ల కిందటే చెల్లిపోయిందని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. కాలం చెల్లిన విమానాన్ని అధికారులు నిర్లక్ష్య ధోరణితో  వాడడం వల్లే అది ప్రమాదానికి గురైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో విమానం ఆచూకీ కోసం మూడు రోజులుగా జరుగుతున్న గాలింపు చర్యల వల్ల ఫలితం లేకపోగా.. ఆచూకీ లభించే అవకాశం 50 శాతం మాత్రమే ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 1984లో రష్యా నుంచి కొన్న ఈ విమానం 32 ఏళ్లుగా సేవలందిస్తోంది. వైమానిక దళానికి చెందిన దేశ రక్షణ పరంగా అవసరమైన వస్తువులను, జవాన్లను రక్షణ స్థావరాలకు చేరవేసేందుకు దీన్ని వినియోగిస్తున్నారు.



కొండ ప్రాంతాల అవసరాలకు ఎక్కువసార్లు  వినియోగించుకున్నారు. ఏఎన్32 రకం విమానాలను 25 ఏళ్లు లేదా 20 వేల గంటలపాటు ఆకాశంలో ప్రయాణం,  15 వేల సార్లు ల్యాండ్ కావడం వరకే పరిమితం చేయాల్సి ఉందని.. ఈ మూడింటిలో ఏది ముందుగా పూర్తయినా దానిని కాలం చెల్లిన విమానంగా పరిగణించి పక్కన పెట్టేయాల్సి ఉందని సంబంధిత వర్గాలు వివరిస్తున్నాయి. సంవత్సరాల లెక్కన చూసినా.. గల్లంతైన విమానానికి ఏడేళ్ల కిందటే కాలం చెల్లినట్లుగా నిర్ధారించవచ్చునని అంటున్నారు. అదీగాక గల్లంతైన విమానం గత 32 ఏళ్లలో అనేకమార్లు మరమ్మతులకు గురైందని ఏఐఎఫ్ వర్గాల కథనం. ఈ నెలలోనే 2, 7, 14 తేదీల్లో ఆయిల్ లీక్, వ్యర్థ పదార్థాల లీక్ సంభవించిందని.. మూడుసార్లు మరమ్మతులు చేశారని సమాచారం.



మరోవైపు.. అదృశ్యమైన విమానం కోసం మూడు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. ఆ విమానానికి కంట్రోల్ రూం నుంచి సంబంధాలు తెగిపోగానే.. చెన్నైకి 151 నాటికల్ మైళ్ల దూరంలో 23 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు ఎడమవైపు తిరిగేటప్పుడు భూమివైపు దూసుకుపోయి ఉండొచ్చని  అనుమానిస్తున్నారు. ఈ అంచనాల ఆధారంగా గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మొత్తం 13 కోస్ట్‌గార్డ్ నౌకలు, 6 సముద్రతీర ప్రాంత గస్తీ దళాల నౌకలు, 2 వాయుసేన విమానాలు, మరో 8 విమానాలు, 5 హెలికాప్టర్లు, ఒక జలాంతర్గామి గాలిస్తున్నాయి. గత ఏడాది జూన్‌లో అదృశ్యమైన కోస్టు గార్డు  విమాన శకలాలను, మృతుల అవశేషాలను వెలికి తీసిన ఒలింపిక్ సంస్థ జలాంతర్గామి సేవలను ఈ విమాన ఆచూకీ కోసం వాడుకునే అవకాశం ఉంది. అయినా విమానం ఆచూకీ లభించే అవకాశాలు 50 శాతమేని అధికార వర్గాలు అంటున్నాయి.

 

 ఉపగ్రహ చిత్రాలను కోరాం: నేవీ

 విమానం కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని వెల్లడి

 

 చెన్నై/విశాఖపట్నం: గల్లంతైన భారత వాయుసేన విమానం ఆచూకీ కనుగొనేందుకు ఉపగ్రహంతో పరిశీలన(శాటిలైట్ ఇమేజరీ) చేపట్టాలని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని (ఇస్రో) నౌకాదళం కోరింది. గత శుక్రవారం చెన్నై సమీపంలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి 29 మంది సిబ్బందితో పోర్ట్ బ్లెయిర్‌లోని సైనిక స్థావరానికి బయల్దేరిన ఏఎన్32 విమానం కొద్దిసేపటికే అదృశ్యమవడం తెలిసిందే.  ఆచూకీ కనిపెట్టేందుకు వాయుసేన, నౌకాదళ, తీర భద్రతా దళాలు బంగాళాఖాతంలో చేపట్టిన భారీ గాలింపు ఆపరేషన్ ఆదివారం మూడో రోజూ కొనసాగింది. అయినా ఫలితం లభించలేదు. దీంతో విమానంతో పాటు గల్లంతైన సిబ్బంది కుటుంబాల్లో ఆందోళన పెరిగిపోతోంది. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో విశాఖలోని ఎన్‌ఏడీకి చెందిన 8 మంది సిబ్బంది ఉండడం విదితమే. ‘‘గాలింపునకు ప్రతికూల వాతావరణం పెద్ద సవాలుగా మారింది. అయినా 24 గంటల పాటూ గాలింపు కొనసాగిస్తున్నాం.



అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ వినియోగించుకుంటున్నాం. సముద్రమంతా జల్లెడపట్టి గాలిస్తున్నాం.. అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం.. శాటిలైట్ ఇమేజరీ సమాచారం కూడా కోరాం’ అని తూర్పు నౌకాదళ చీఫ్ వైస్ అడ్మిరల్ హరిశ్చంద్రసింగ్ బిస్త్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం విశాఖపట్నంలోని పాటి నాగేంద్ర కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. గల్లంతయిన ఉద్యోగుల కోసం చేయని ప్రయత్నమంటూ లేదని, గాలింపుకోసం జలాంతర్గాములు, నౌకలు, విమానాలు, హెలికాప్టర్లతో పాటు శాటిలైట్, రాడార్లను వినియోగిస్తున్నామని చెప్పారు. ‘‘అక్కడ సముద్ర జలాల లోతు 3,500 మీటర్ల వరకూ ఉంది. కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ. లోతు పెరిగే కొద్దీ సవాళ్లు కూడా పెరుగుతాయి. వాతావరణం కల్లోలంగా ఉంది.. వర్షం పడుతూ ఉంది’’ అని వివరించారు. విమానంలో ప్రయాణిస్తూ గల్లంతైన 29 మంది కుటుంబాలకూ.. గాలింపుపై ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తున్నట్లు తెలిపారు. కాగా విమానం అదృశ్యం గురించి వాయుసేన అధికారులు  తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top