పాక్‌ సైన్యం వద్ద కత్తులు, కెమెరాలు

శ్రీనగర్‌లో సీఆర్‌పీఎఫ్‌ బృందంపై దాడి సందర్భంగా అప్రమత్తమైన భద్రతా బలగాలు - Sakshi

- సైనికుల మృతదేహాలు ఛిద్రం చేయడానికి పాక్‌ కుట్ర

కెమెరా డేటాను విశ్లేషిస్తున్న సైన్యం

- శ్రీనగర్‌లో సీఆర్పీఎఫ్‌పై ఉగ్రవాదుల దాడి, ఎస్సై మృతి  

 

జమ్మూ : ఇద్దరు భారత జవాన్లను గురువారం చంపిన పాక్‌ బోర్డర్‌ యాక్షన్‌ టీం(బ్యాట్‌) సభ్యులు ప్రత్యేకమైన కత్తితో పాటు తలకు పెట్టుకునే కెమెరాతో వచ్చినట్లు భారత సైన్యం గుర్తించింది. సైనికుల శరీరాలను వేగంగా ఛిద్రం చేయడానికి ఈ కత్తిని వాడతారని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. దాడిని చిత్రీకరించడానికి కెమెరాను బ్యాట్‌ సభ్యులు వాడారని పేర్కొన్నారు. ఈ కెమెరాలు పాక్‌లోని ఆర్మీ కేంద్రాలకు వీడియోను ప్రత్యక్ష ప్రసారం చేశాయా..లేదా అన్నది విచారణలోనే తేలుతుందని చెప్పారు. ప్రస్తుతం ఈ కెమెరాలోని డేటాను విశ్లేషిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత సైన్యం జరిపిన ఎదురు కాల్పుల్లో హతమైన ఓ బ్యాట్‌ సభ్యుడి నుంచి కత్తి, కెమెరా, ఏకే–47 తుపాకీ, 3 మ్యాగజైన్లు, రెండు గ్రనేడ్లు, మందుగుండు సామగ్రి లభ్యమవడం పాక్‌ దుర్బుద్ధిని సూచిస్తోందని విమర్శించారు. పాక్‌ సైన్యంలోని ప్రత్యేక బలగాలు, ఉగ్రవాదుల కలయికతో బ్యాట్‌ ఏర్పాటైంది. 

 

ఉగ్రదాడిలో సీఆర్పీఎఫ్‌ ఎస్సై మృతి

శ్రీనగర్‌లోని పన్‌థా చౌక్‌ సమీపంలో ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్‌ వాహనంపై కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ ఎస్సై సహీబ్‌ శుక్లా మృతిచెందగా..కానిస్టేబుల్‌ డ్రైవర్‌ నిస్సార్‌ అహ్మ ద్‌ గాయపడ్డారు. దాడి సమాచారం తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించాయి. మరో వైపు భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్‌ మరోసారి ఉల్లంఘించింది. పూంచ్‌ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ(ఎల్‌వోసీ) వెంబడి ఉన్న భారత ఆర్మీ పోస్టులపై ఆటోమేటిక్‌ ఆయుధాలు, మోర్టార్లతో పాక్‌ సైన్యం భారీగా దాడులకు తెగబడింది. భారత బలగాలు పాక్‌ దాడిని  తిప్పికొట్టినట్లు రక్షణ శాఖ ప్రతినిధి  తెలిపారు. 

 

కశ్మీర్‌ డీఎస్పీ హత్యపై సిట్‌ ఏర్పాటు

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ డీఎస్పీ మహమ్మద్‌ అయూబ్‌ పండిత్‌ హత్యపై త్వరితగతిన విచారణ జరిపేందుకు రాష్ట్ర పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌)ను ఏర్పాటు చేశారు. ఈ కేసుకు సంబంధించి 12 మంది అనుమానితుల్లో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్‌ చేశామని డీజీపీ ఎస్‌పీ వైద్‌ తెలిపారు. వీరిలో ఇద్దరు పండిత్‌ ఆత్మరక్షణ కోసం జరిపినట్లు భావిస్తున్న కాల్పుల్లో గాయపడినవారని వెల్లడించారు. అయూబ్‌ పండిత్‌ శుక్రవారం శ్రీనగర్‌లోని జామియా మసీదు వద్ద భద్రతను సమీక్షిస్తుండగా కొందరు యువకులు ఆయనను తీవ్రంగా కొట్టి చంపడం తెలిసిందే. కాగా, దాడి సమయంలో హురియత్‌ కాన్ఫరెన్స్‌ నేత మీర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూక్‌ మసీదులోనే ఉన్నారన్న వార్తలు వచ్చాయి. ఈ అంశంపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు చెప్పారు. స్థానిక ఎస్పీని బదిలీ చేశారు.  
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top