తెలుగు విద్యార్ధులపై దాడులు

తెలుగు విద్యార్ధులపై దాడులు

సాక్షి, హైదరాబాద్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో బీటెక్ చదువుతున్న తెలుగు విద్యార్థులపై గురువారం నుంచి వరుస దాడులు జరుగుతున్నాయి. హాస్టల్ మెస్‌లో జరిగిన చిన్న ఉదంతం చినికిచినికి గాలి వానగా మారి విద్యార్థుల మధ్య ఘర్షణలకు దారితీసింది. స్థానిక విద్యార్థులు, తెలుగు విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు సృష్టించింది. గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 20 మంది విద్యార్థులు అక్కడి నిట్‌లో క్షణ క్షణం భయంభయంగా గడుపుతున్నారు. 

 

 చికెన్ తెచ్చిన వివాదం...!

 మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఐదేళ్ల క్రితం నిట్‌ను ప్రారంభించారు. అక్కడి టక్యాల్‌పట్, లాంగోల్‌లో ఉన్న రెండు క్యాంపస్‌ల్లో పలువురు తెలుగు విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, విశాఖపట్నం, వైఎస్సార్ జిల్లాలకు చెందిన విద్యార్థులు బీటెక్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. కొత్తగా నిర్మించిన లాంగోల్ క్యాంపస్‌లో బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులతోపాటు ద్వితీయ సంవత్సరం మెకానికల్, సివిల్ బ్రాంచ్‌లకు చెందిన వారిని తరలించారు. గురువారం రాత్రి హాస్టల్ మెస్‌లో స్థానిక సీనియర్ విద్యార్థులు, జూనియర్లైన తెలుగు విద్యార్థుల మధ్య జరిగిన ఓ ఘటన ఘర్షణకు దారి తీసింది. ఓ సీనియర్ విద్యార్థి క్యూలో నిలుచున్న జూనియర్లను కాదని నేరుగా చికెన్ వడ్డిస్తున్న చోటుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీన్ని ఓ జూనియర్ తెలుగు విద్యార్థి అడ్డుకోవడంతో వివాదం రేగింది. దీన్ని మనసులో పెట్టుకున్న సీనియర్ విద్యార్థులు శుక్రవారం సాయంత్రం క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన తెలుగు విద్యార్థులను రోడ్డుపై అడ్డుకుని స్థానికులతో కలిసి చితకబాదారు. అయితే తరువాత కొందరు తెలుగు విద్యార్థులు సీనియర్ల వద్దకు వెళ్లి కలసిమెలసి ఉందామని కోరినా వినకుండా మరోసారి దాడికి దిగి సెల్‌ఫోన్లను లాక్కున్నారు. 

 

 కేంద్ర హోంశాఖకు బీహార్ ఫిర్యాదు

 బాధితుల్లో కొందరు బీహార్ విద్యార్థులు ఉండటంతో విషయం అక్కడి మీడియాకు చేరింది. శనివారం బీహార్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగడంతో అక్కడి ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబీసింగ్‌తోపాటు పోలీసు ఉన్నతాధికారులు శనివారం నిట్ క్యాంపస్‌ను సందర్శించారు. తెలుగు విద్యార్థులను కలిసి వారి భద్రతకు భరోసా ఇచ్చారు. కొందరి సెల్‌ఫోన్లను తిరిగి ఇప్పించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు నిట్ క్యాంపస్‌కు సీఆర్‌పీఎఫ్ బలగాలను తరలించాలని మణిపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే స్వయంగా సీఎం వచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదని తెలుగు విద్యార్థులు వాపోతున్నారు. శనివారం అర్థరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు స్థానికులతోపాటు అక్కడి విద్యార్థులు క్యాంపస్‌లోకి చొరబడి బీభత్సం సృష్టించారని చెబుతున్నారు. తలుపులు, కిటికీలపై రాళ్లు, కర్రలతో దాడులకు దిగటంతో తెల్లవారే వరకు బాత్రూమ్‌ల్లో భయంభయంగా గడిపామని తెలిపారు. తక్షణం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. యాజమాన్యంతో పాటు పోలీసులు సైతం స్థానిక విద్యార్థులకు వత్తాసు పలికారని ఆరోపిస్తున్నారు.  కొందరు బాధిత విద్యార్థులు ఫోన్ ద్వారా అక్కడి పరిస్థితిని ‘సాక్షి’కి వివరించారు. 

 

 రక్షణ లేదు... తీసుకువెళ్లండి

 ‘ఇంఫాల్ నిట్‌లో మాకు రక్షణ లేదు. సాక్షాత్తు మణిపూర్ ముఖ్యమంత్రి వచ్చి భరోసా ఇచ్చినా ఒరిగిందేమీ లేదు. మాపై దాడులు ఇంకా ఎక్కువయ్యాయి. లాంగోల్ క్యాంపస్‌లో తెలుగు విద్యార్థులు బికుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రభుత్వం స్పందించి మమ్మల్ని తరలించాలి’

 - పరమేశ్వర్

 పరిస్థితిని సమీక్షిస్తున్నాం

 ‘మణిపూర్ పోలీసు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. తెలుగు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరాం. క్యాంపస్‌లో పోలీసు పికెట్ ఏర్పాటు చేశామని, ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని వారు చెప్పారు. పరిస్థితిని సమీక్షిస్తున్నాం’ 

 - ఆర్పీ ఠాకూర్, అదనపు డీజీ (శాంతిభద్రతలు), ఏపీ.

 

 మణిపూర్ అధికారులకు కంభంపాటి ఫోన్

 సాక్షి, న్యూఢిల్లీ: మణిపూర్‌లోని ఎన్‌ఐటీ క్యాంపస్‌లో ఘర్షణల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను రక్షించాలని స్థానిక అధికారులను కోరినట్లు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు తెలిపారు. తెలుగు విద్యార్థుల గాయపడినట్లు సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు మణిపూర్ అధికారులతో మాట్లాడినట్టు తెలిపారు.  

 

 హైదరాబాద్ అందరిదీ

 పెట్టుబడులు పెట్టండి: వెంకయ్య

 ప్రపంచంలోని అన్ని పరిశ్రమలు హైదరాబాద్‌వైపు చూస్తున్నాయని, వాటిని ఆకర్షించే శక్తి భాగ్యనగరానికి ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి  వెంకయ్యనాయుడు అన్నారు. ఈ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ హైదరాబాదీలేనని, దీనిపై అందరికీ సమాన హక్కులుఉన్నాయని చెప్పారు. ఎవరైనా పెట్టుబడులు నిస్సంకోచంగా పెట్టవచ్చని సూచించారు.
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top