మహారాష్ట్రలో తెలంగాణ సర్వే..!


 సాక్షి ముంబైః మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని 14 గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సరిహద్దులో ఉన్న ఈ గ్రామాలవాసులకు ఎన్నో ఏళ్లుగా ఇరు రాష్ట్రాల సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈ గ్రామాల సరిహద్దులపై మహారాష్ట్ర-ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం కొనసాగింది. దీనిపై 1997లో సుప్రీంకోర్టు తీర్పును ప్రకటించింది.



ఈ మేరకు జీవితి తాలుకాలోని పరమడోలి, తాండా, ముకాదమగూడా, కోడా, లెండిజాలా, మహారాజగూడ, శంకర్‌లోధి, అంతాపూర్, ఇందిరానగర్, పద్మావతి, యెసాపూర్, పలస్‌గూడ, భోలాపటార్, లెండిగూడ మొదలగు గ్రామాలు మహారాష్ట్రకు చెందుతాయని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఇప్పటి వరకు ఇక్కడి గ్రామాల ప్రజలు అటు మహారాష్ట్ర, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సంక్షేమ పథకాలను ఉపయోగించుకుంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడి గ్రామాల్లో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తారురోడ్లు వేశాయి.



 మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన తారు రోడ్లు కానరాకుండాపోగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన తారు రోడ్డు మాత్రం ఇప్పటికీ వినియోగంలో ఉంది. దీంతోపాటు  విద్యుత్ సరఫరా, నీటి సరఫరా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేస్తోంది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాల ప్రజలను నిర్లక్ష్యం చేయడంతో కొత్తగా అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు సంక్షేమ పథకాలను అందించేందుకు సిద్ధమయింది. ఇందులో భాగంగా ఈ నెల 19న తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను ఈ గ్రామాల్లో కూడా నిర్వహించింది. దీనిపై మహారాష్ట్ర అధికారికంగా స్పందించలేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top