చెన్నైలో తెలంగాణ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కిడ్నాప్

చెన్నైలో తెలంగాణ  సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కిడ్నాప్ - Sakshi


కోటి రూపాయలు డిమాండ్.. నలుగురు కిడ్నాపర్ల అరెస్టు



 టీనగర్(చెన్నై): చెన్నైలో తెలంగాణాకు చెందిన ఐటీ ఇంజనీర్‌ను దుండగులు కిడ్నాప్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేశారు. పోలీసులు పక్కా వ్యూహంతో నలుగురు కిడ్నాపర్లను అరెస్టు చేసి బాధితుడిని విడిపించారు. తెలంగాణ లోని ఖమ్మం జిల్లా సీతారాంపురం ప్రాంతానికి చెందిన దేవరాజ్ కుమారుడు ప్రేమ్‌కుమార్(28) చెన్నై నావలూరు హెచ్‌సీఎల్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తున్నారు. బుధవారం రాత్రి విధులకు వెళ్లి గురువారం తెల్లవారుజామున ఇంటికి వచ్చే క్రమంలో అటువైపు బైక్‌పై వెళుతున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగారు. అతనితోపాటు మరొకరు బైక్ ఎక్కారు.



వెనుక కూర్చున్న వ్యక్తి ప్రేమ్‌కుమార్‌కు మత్తుమందున్న కర్చీఫ్ పెట్టడంతో మత్తులోకి జారుకున్నారు. అక్కడి నుంచి కారులో వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. గురువారం ఉదయం... ప్రేమ్‌కుమార్ రూమ్‌లో ఉంటున్న సందీప్‌కి, తల్లి అరుణకు కిడ్నాపర్లు ఫోన్ చేసి... కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రేమ్‌కుమార్ తల్లిదండ్రులు గురువారం సాయంత్రం చెన్నై చేరుకుని కేళంబాక్కం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మరోసారి ఫోన్ చేసిన కిడ్నాపర్లు అరుణను రూ.10 లక్షలు తీసుకుని ఓఎంఆర్ రోడ్డులోని ఓ ప్రదేశానికి రావాలని చెప్పారు.



అరుణ రూ.10 లక్షల నగదుతో రాత్రి సెమ్మంజేరి ప్రాంతానికి వెళ్లగా... ఆమెను పోలీసులు రహస్యంగా వెంబడించారు. అక్కడ హెల్మెట్ ధరించిన యువకుడు అరుణ వద్ద ఉన్న నగదు బ్యాగ్‌ను లాక్కునేందుకు ప్రయత్నించాడు. అతన్ని పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేశారు. విచారించగా... తయ్యూర్‌లోని అపార్ట్‌మెంట్ గదిలో ప్రేమ్‌కుమార్‌ను బంధించినట్టు తెలిపాడు. శుక్రవారం వేకువజామున రెండు గంటల సమయంలో ప్రేమ్‌కుమార్‌ను పోలీసులు విడిపించారు. దీంతో సంబంధం ఉన్న తయ్యూర్ పెరియమానగర్‌కు చెందిన పార్తిబన్(23), జయశీలన్(28), కేళంబాక్కం బాలాజీ(27), అరక్కోణం వివేక్ రాజ్(27)ను అరెస్టు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top