హస్తినలో తొలి మహిళా డ్రైవర్.. తెలంగాణ బిడ్డ

హస్తినలో తొలి మహిళా డ్రైవర్.. తెలంగాణ బిడ్డ


న్యూఢిల్లీ: మేము సైతం అంటూ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారనడానికి తాజా ఉదాహరణ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ)కి తొలి మహిళా డ్రైవర్ ఎంపిక. దేశ రాజధాని నగరానికి తొలి మహిళా  డ్రైవర్ను అందించిన ఘనత తెలంగాణ దక్కించుకుంది. రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల వి. సరిత ఆ అవకాశాన్ని కొట్టేశారు. ఉత్సాహవంతులైన మహిళా డ్రైవర్లు కావాలన్న ప్రభుత్వ పత్రికా ప్రకటనకు ఏడుగురు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఒక్క సరిత మాత్రమే మెడకల్గా ఫిట్గా ఉన్నారని డీటీసీ మెడికల్ బోర్డు పరీక్షల్లో తేలింది. దీంతో 28 రోజుల శిక్షణ తరువాత, తొలి మహిళా డ్రైవర్గా సరోజినినగర్ డిపో లో ఆమె నియమితులయ్యారు. సో...తెలంగాణ ఆడబిడ్డ ఇకనుంచి ఢిల్లీ రోడ్లమీద డీటీసీ బస్సును పరుగులు పెట్టించనున్నారనన్నమాట.


నల్గొండ జిల్లాకు చెందిన పేదరైతు కుటుంబంలో  పుట్టిన సరితను మగపిల్లలు లేకపోవడంతో తండ్రి  ఆమెను అబ్బాయి లాగా పెంచారట.....తన హెయిర్ స్టయిల్, తన డ్రెస్సింగ్ స్టయిల్ అంతా   నాన్న ఛాయిస్సే అంటున్న సరిత   మహిళలు సాధించలేనిది ఏదీ లేదని  చెప్పాలన్నదే తన ఉద్దేశ్యమని చాలా ఆత్మ విశ్వాసంతో చెబుతున్నారు. ఇక్కడ బస్సు నడపటం కత్తిమీద సామే అయినప్పటికీ నల్లొండలో ఆటోను, హైదరాబాద్లో కాలేజీ మినీ బస్సు నడిపిన అనుభవం   బాగా ఉపయోగపడుతోందంటున్నారు.

డ్రైవింగ్లో  సరితకు శిక్షణ ఇచ్చిన పర్వేష్ శర్మ అయితే ఆమె డ్రైవింగ్ స్కిల్స్ చూసి  ముచ్చటపడుతున్నారు. భవిష్యత్తుల్లో చాలా మంచి  డ్రైవర్ అవుతుందంటూ కితాబులిచ్చారు. మొదట్లో మహిళలకు  ట్రైనింగ్ అంటే  కొంచెం భయపడ్డా...ఢిల్లీలాంటి నగరాల్లో  డ్రైవింగ్  వారి వల్ల  కానే కాదు అనుకున్నా...కానీ సరిత  చాలా తొందరగా నేర్చుకున్నారంటూ ప్రశంసల్లో ముంచెత్తారు.



తమ నిర్ణయం మరింతమంది మహిళలను డ్రైవింగ్ వృత్తిలోకి రావడానికి ఉత్సాహపరుస్తుందని భావిస్తున్నామని ఢిల్లీ ప్రభుత్వం అంటోంది. కొత్త రంగాల్లో మహిళలను ఎంకరేజ్ చేయడంలో తమ  ప్రభుత్వం ముందుంటుందనీ, ఇది ప్రారంభం మాత్రమేనని ఢిల్లీ  రవాణామంత్రి గోపాల్ రాయ్ అన్నారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top