వడ్డన వద్దేవద్దు!

వడ్డన వద్దేవద్దు! - Sakshi


సాక్షి, చెన్నై: విద్యుత్ చార్జీల వడ్డన పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. వడ్డన వద్దే వద్దన్న నినాదాన్ని ప్రజలు అందుకున్నారు. చెన్నైలో శుక్రవారం జరిగిన అభిప్రాయ సేకరణ లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత బయలు దేరడంతో తదుపరి తిరునల్వేలి వేదికగా ప్రజాభిప్రాయ సేకరణ చేయూలని . అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చా క విద్యుత్ రంగ సంస్థల బలోపేతమే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. దీన్ని ఎత్తి చూపుతూ ఓ మారు చార్జీలను వడ్డించిం ది. అయినా, విద్యుత్ సంస్థలు నష్టాల్లోనే ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటిస్తోంది. అలాగే, రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభాన్ని పూర్తి స్థాయిలో ఎదుర్కొనేదెప్పుడోనన్నది ప్రశ్నగానే మిగిలిపోయి. ఈ నేపథ్యంలో మళ్లీ చార్జీల వడ్డనే లక్ష్యంగా కసరత్తుల్లో పడ్డారు. ఇటీవల జయలలిత సీఎంగా ఉన్న సమయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో చార్జీల వడ్డన నిర్ణయాన్ని సమీక్షించి నిర్ణయాలు తీసుకున్నారు.

 

 వడ్డనకు కార్యాచరణ : ప్రతి ఏటా రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నేతృత్వంలో   విద్యుత్ రంగ సంస్థల్లో లాభ నష్టాలను సమీక్షించడం ఆనవాయితీ. 2014-15లో రూ.39,818 కోట్ల మేరకు విద్యుత్ సంస్థలపై వెచ్చించాల్సి ఉంది. అయితే ప్రస్తుత చార్జీల తీరును బట్టి రూ.32,964 కోట్లు మాత్రమే లభిస్తుందని అంచనా వేశారు. దీంతో ఆ లోటును పుడ్చుకోవడం లక్ష్యంగా చార్జీల వడ్డనకు నిర్ణయాలు తీసుకున్నారు. చార్జీల్ని పెంచిన పక్షంలో మరో  రూ.6,805 కోట్లు లభించగలదని అంచనా వేశారు. ఈ మేరకు పారిశ్రామిక వాడలకు ఒక యూనిట్‌కు రూ.5.50 నుంచి రూ.7.22కు, ప్రభుత్వ పరిధిలోని విద్యాసంస్థలకు యూనిట్ రూ.4.50 నుంచి రూ.7.22, ప్రై వేటు విద్యాసంస్థలకు రూ.5.50 నుంచి  7.22కు పెంచాలని ప్రతిపాదనను సిద్ధం చేశారు.

 

 అలాగే వాణిజ్య, వ్యాపార సంస్థలకు రూ.7.00 నుంచి రూ.8.05 , తాత్కాలిక వినియోగానికి రూ.9.50 నుంచి రూ.11గా నిర్ణయించినట్లు సమాచారం. ఇక, గృహ వినియోగంపై రూ. 2.60 నుంచి రూ.3, గుడిసెలకు రూ.1 నుంచి రూ.1.20గా వడ్డీంచేందుకు కార్యాచరణను సిద్ధం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ప్రజల నుంచి ఎక్కడ వ్యతిరేకత బయలు దేరుతుందోనన్న విషయాన్ని ప్రభుత్వం పసిగట్టింది. చార్జీల వడ్డనకు ముందుగా ఓ మారు ప్రజాభిప్రాయానికి సిద్ధం అయింది. అన్ని వర్గాల అభిప్రాయాల మేరకు తుది నిర్ణయం తీసుకోవాలని కోసం ఆయా డివిజన్లలో ప్రజాభిప్రాయానికి శ్రీకారం చుట్టింది.  వద్దే..వద్దు : విద్యుత్ రెగ్యులటరీ కమిషన్ చైర్మన్ అక్షయ్ కుమార్, సభ్యులు నాగ స్వామి, రాజగోపాల్ నేతృత్వంలో ప్రజాభిప్రాయ సేకరణకు నిర్ణయించారు.

 

 ఆ మేరకు శుక్రవారం చెన్నై బ్రాడ్ వేలోని రాజా అన్నామలై మండ్రంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. పేద, మధ్య తరగతి వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాల ప్రతినిధులు, వర్తకులు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, ఇలా అన్ని వర్గాల వారు ఈ అభిప్రాయ సేకరణకు హాజరయ్యారు. ప్రభుత్వం చార్జీల వడ్డనకు సిద్ధం అవుతోందన్న వివరాల్ని, చార్జీల పెంపు అనివార్యం గురించి అక్షయ్ కుమార్ వివరించారు. అయితే, చార్జీల వడ్డనకు ముక్త కంఠంతో అన్ని వర్గాల వారు వ్యతిరేకత వ్యక్తం చేశారు. పేద, మధ్య తరగతి వర్గాలు ఇప్పటికే కష్టాల్లో ఉన్నారని, మరింత భారం వేయొద్దని నినదించారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేని, అనేక గ్రామాలు కోతలతో అంధకారంలో మునగాల్సిన పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేస్తూ, చార్జీలను వడ్డించొద్దని సూచించారు. అనంతరం ఒక్కో సంస్థ, సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ, చార్జీల వడ్డన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, చార్జీల వడ్డన వద్దే వద్దంటూ తమ అభిప్రాయాన్ని నమోదు చేయించారు.

 

 చిన్న తరహా విడి భాగాల తయారీ సంస్థల సంఘం నాయకుడు మాణిక్య రావు మాట్లాడుతూ, ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ పథకాలు సక్రమంగా ప్రజల దరి చేరలేదని వివరిస్తూ, చార్జీల వడ్డన ప్రయత్నాన్ని మానుకుంటే మంచిదన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకుడు గోపాల కృష్ణన్ మాట్లాడుతూ, ఆకాశాన్ని అంటుతున్న ధరలు ఇప్పటికే ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో ప్రజల నెత్తిన మరింత భారం వేయడం భ్యావం కాదని హితవు పలికారు. ప్రజల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని పెంపు నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒక వేళ పెంపు అనివార్యమైనప్పుడు ఇటీవల కర్ణాటక తరహాలో అత్యంత తక్కువగా చార్జీల్ని పెంచాలని, లేని పక్షంలో పెంపు నిర్ణయాన్ని వీడాలని డిమాండ్ చేశారు. చెన్నైలో జరిగిన సమావేశంలో మెజారిటీ శాతం మంది వడ్డన వద్దే వద్దు అని స్పష్టం చేయడంతో తదుపరి 28న తిరునల్వేలి వేదికగా, 31న ఈరోడ్ వేదికగా ఈ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది.



 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top