హైకోర్టు తీర్పుపై స్టే కుదరదు!

హైకోర్టు తీర్పుపై స్టే కుదరదు! - Sakshi


కేంద్రం అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీం

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ నియామకాలు, బదిలీలపై లెఫ్ట్‌నెంట్ గవర్నర్(ఎల్జీ)కే అధికారాలున్నాయంటూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ‘సందేహాస్పదం’గా ఉందన్న ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్టే విధించాలన్న కేంద్రం అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.  హైకోర్టు వ్యాఖ్యలను  ‘చెల్లుబాటుపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయని ప్రాథమిక వ్యాఖ్యలు’గానే పరిగణించాలంది. ఢిల్లీ ప్రభుత్వ అవినీతి నిరోధక విభాగం అధికార పరిధికి సంబంధించి మే 25న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కేంద్రం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు పరిశీలనకు స్వీకరించింది. దీనిపై 3 వారాల్లోగా స్పందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఆ స్పందనను పరిశీలించాక కేంద్రం కోరిన స్టేపై నిర్ణయం తీసుకుంటామంది.


కేంద్ర నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ ఆప్ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ నోటిఫికేషన్ సందేహాస్పదంగా ఉందన్న ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలతో ప్రభావితం కాకుండా.. ఈ పిటిషన్‌పై స్వతంత్రంగా విచారణ జరపాలని ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. ఢిల్లీ ఎల్జీ తన విచక్షణాధికారం మేరకు వ్యవహరించడం కుదరదన్న ఢిల్లీ హైకోర్టు అభిప్రాయాలను సవాలు చేస్తూ కేంద్ర హోం శాఖ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌ను విచారించిన   కోర్టు దీనిపై ఆరు వారాల్లోగా స్పందించాలని ఆప్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.



నోటిఫికేషన్‌ను రద్దు చేయని ఢిల్లీ హైకోర్టు

ఆప్ పరిపాలనాధికారాలను కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని లేదా స్టే విధించాలన్న ఆప్ ప్రభుత్వ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. అయితే, కీలక స్థానాల్లో సీనియర్ అధికారులను నియమించడానికి సంబంధించిన ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని  ఎల్జీకి సూచించింది. కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అధికారులపై ఢిల్లీ ప్రభుత్వ ఏసీబీ చర్యలు తీసుకోవడాన్ని నిరోధిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలన్న ఆప్ ప్రభుత్వ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా 9 మంది సీనియర్ అధికారులను బదిలీ చేయాలన్న ఆప్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించాలని ఎల్జీకి సూచించింది. ఆప్ పిటిషన్‌పై స్పందించాలని కేంద్రానికి నోటీసు ఇచ్చింది. కాగా, ఢిల్లీ ప్రభుత్వ పాలనను పరోక్షంగా తమ చేతుల్లోకి తీసుకోవాలన్న ఆలోచన తమకు లేదని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top