‘దేశద్రోహం’లో విద్యార్థి నేత అరెస్ట్

‘దేశద్రోహం’లో విద్యార్థి నేత అరెస్ట్ - Sakshi


మరో 8 మంది విద్యార్థులను బహిష్కరించిన జేఎన్‌యూ

♦ జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ అరెస్ట్  

♦ ఉగ్ర లింకులున్నాయని పోలీసుల అభియోగం

♦ అరెస్ట్‌పై విద్యార్థులు, అధ్యాపకుల నిరసన

♦ దేశ వ్యతిరేక ప్రదర్శనలను సహించం: కేంద్రం

 

 న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్‌ను దేశద్రోహం కేసులో ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పార్లమెంటుపై దాడి కేసు దోషి అఫ్జల్‌గురు ఉరితీతను తప్పుబడుతూ గత మంగళవారం జేఎన్‌యూ క్యాంపస్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించటంపై బీజేపీ ఎంపీ మహేశ్‌గిరి, ఏబీవీపీ ఫిర్యాదులతో పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ నిరసన కార్యక్రమానికి సంబంధించి జేఎన్‌యూ పాలకవర్గం మరో ఎనిమిది వంది విద్యార్థులను వర్సిటీ నుంచి డిబార్ చేసింది.



 ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి

 విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్‌తో పాటు.. ఒమర్ ఖలీద్, అనంత్‌ప్రకాశ్, రామనాగ, అశుతోశ్, అనిర్బన్ అనే మరో ఐదుగురు విద్యార్థులకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని పోలీసులు ఆరోపించారు. కన్హయ్యను శుక్రవారం స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. కుమార్ సహా మరికొందరు విద్యార్థులు దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లు చూపే వీడియోను జడ్జి ఎదుట ప్రదర్శించారు. అయితే ఈ వాదనను కన్హయ్య తోసిపుచ్చారు. తాను దేశ వ్యతిరేక నినాదాలు చేయలేదన్నారు. అనంతరం కోర్టు.. అతడిని మూడు రోజుల కస్టోడియల్ విచారణకు అనుమతించింది. కాగా, అఫ్జల్‌గురు ఉరితీతకు నిరసనగా కార్యక్రమం నిర్వహించడంపై జేఎన్‌యూ 8 మంది విద్యార్థులను తరగతుల నుంచి బహిష్కరించింది.  ఆ విద్యార్థులు హాస్టళ్లలో కొనసాగించేందుకు అనుమతిస్తున్నామంది.

 ఎమర్జెన్సీనితలపిస్తోంది:కాంగ్రెస్

 కన్హయ్య అరెస్ట్‌ను నిరసిస్తూ వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు వీసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. విద్యార్థులను ఉగ్రవాదులతో పోలుస్తూ పోలీసులు సాధారణ దుస్తుల్లో క్యాంపస్‌లో దాడులు చేసి అరెస్టు చేసిన తీరును తప్పుపట్టారు. జరుగుతున్న పరిణామాలు ఎమర్జెన్సీ తరహా పరిస్థితులను తలపిస్తున్నాయని కాంగ్రెస్ నేత కపిల్‌సిబల్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. జేఎన్‌యూ తమ దారికి రానందువల్లనే ఆ వర్సిటీని మోదీ సర్కారు, ఏబీవీపీలు బెదిరిస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ విమర్శించారు.  

 భరతమాతకు అవమానాన్ని

 దేశం సహించదు: స్మృతి, రాజ్‌నాథ్

 అఫ్జల్‌గురు ఉరితీతను నిరసిస్తూ జేఎన్‌యూ క్యాంపస్‌లో జరిగిన ప్రదర్శనను కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతిఇరానీ శుక్రవారం తీవ్రంగా ఖండించారు. భరతమాతకు అవమానాన్ని దేశం సహించబోదని పేర్కొన్నారు. జేఎన్‌యూ క్యాంపస్‌లో ఘటనకు బాధ్యులైన వారిపై అత్యంత కఠిన చర్యలు తప్పవని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హెచ్చరించారు. దేశ వ్యతిరేక నినాదాలు చేయడం, దేశ ఐక్యత, సమగ్రతను ప్రశ్నించాలనుకునే వారిని ఉపేక్షించబోమన్నారు. జేఎన్‌యూ ఉదంతంపై తీవ్రంగా దృష్టి సారించాల్సి ఉందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్ అభిప్రాయపడ్డారు. కాగా అఫ్జల్ ఉరితీతను నిరసిస్తూ జేఎన్‌యూలో జరిగిన ప్రదర్శనను తప్పుపడుతూ ఏబీవీపీ సభ్యులు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ర్యాలీ నిర్వహించారు.

 గిలానీపై దేశద్రోహం కేసు... పార్లమెంటుపై దాడి కేసులో నిర్దోషిగా బయటపడిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ లెక్చరర్ ఎ.ఎస్.ఆర్.గిలానీపై ఢిల్లీ పోలీసులు శుక్రవారం దేశద్రోహం, కుట్ర కేసులు నమోదు చేశారు. ఢిల్లీలోని ప్రెస్ క్లబ్‌లో ఆయన నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వారు అఫ్జల్‌గురును కీర్తిస్తూ నినాదాలు చేసినందుకు గిలానీతోపాటు గుర్తుతెలియని వ్యక్తులపై ఈ కేసులు నమోదు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top