నియామకాలు కొనసాగించండి

నియామకాలు కొనసాగించండి - Sakshi


- సివిల్ జడ్జి పోస్టుల కేసులో సుప్రీంకోర్టు ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్ :  జూనియర్, సీనియర్ సివిల్ జడ్జిల నియామక ప్రక్రియను కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే హైకోర్టు విభజన అనంతరం కేంద్రం సూచనల మేరకు ఇరు రాష్ట్రాల మధ్య నిష్పత్తి ప్రకారం కేటాయింపులు ఉంటాయని, అప్పటి వరకు నియామకాలు ఆపాల్సిన అవసరం లేదని గురువారం ధర్మాసనం స్పష్టం చేసింది.


జూనియర్, సీనియర్ సివిల్ జడ్జిల నియామకాలను కేవలం ఏపీ, తెలంగాణ కోణంలోనే చూడకూడదని, నియామక ప్రక్రియ ఆగిపోవడంతో ఎన్నో సమస్యలు వస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది. హైకోర్టు విభజన కాకుండా జూనియర్, సీనియర్ సివిల్ జడ్జిల నియామక ప్రక్రియ చేపట్టవద్దంటూ తెలంగాణ ప్రభుత్వం, పలువురు న్యాయవాదులు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు,  జస్టిస్ అరుణ్‌మిశ్రా, జస్టిస్ ఏకే సిక్రిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది.

 

న్యాయ వ్యవస్థలో ఖాళీలు ఉండడం శ్రేయస్కరం కాదని ధర్మాసనం పేర్కొంది. దేశవ్యాప్తంగా చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, కింది కోర్టుల్లో కేసులు నిలిచిపోవడం సరికాదని అభిప్రాయపడింది. హైకోర్టు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణ, ఏపీలకు ఎన్ని పోస్టులు వస్తాయో తెలియకుండా నియామకాలు ఎలా చేపడతారని తెలంగాణ ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ముకుల్‌రోహత్గి అభ్యంతరం వ్యక్తం చేశారు. అది ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన నోటిఫికేషన్ అని పేర్కొన్న ధర్మాసనం, దాని ప్రకారం పదోన్నతులు, బదిలీలు, నియామకాలు చేపట్టాల్సిందిగా తెలిపింది. హైకోర్టు విభజన అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేసింది.

 

హైకోర్టులో విచారణ నేటికి వాయిదా

జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. గురువారం ఇదే అంశంపై దాఖలైన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు విచారించిన నేపథ్యంలో, దాని ఫలితం తెలుసుకుని, తరువాత ఈ వ్యాజ్యాన్ని విచారిస్తామని ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top