మీ ఓట్లు ఏమయ్యాయి.. పొత్తెందుకో తెలుసు: ఒవైసీ

మీ ఓట్లు ఏమయ్యాయి.. పొత్తెందుకో తెలుసు: ఒవైసీ - Sakshi


లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్ పరిస్థితి ఫ్రెషర్‌ కుక్కర్‌లో ఉన్నట్లే ఉందని ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సమాజ్‌ వాది పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రజలకు ఫ్రెషర్‌ కుక్కర్లు ఇస్తామని వాగ్ధానం చేసిన నేపథ్యంలో దానిని ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన పీటీఐతో మాట్లాడిన సందర్భంగా సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్‌ పార్టీల పొత్తును ఎండగట్టారు. వారి తప్పిదాలను, బలహీనతలు కప్పి పుచ్చుకునేందుకు ఆ రెండు పార్టీలో ఓ చోటచేరాయని, అదంతా కూడా ఓ వివాదాల గుంపు అని ఆరోపించారు.



ఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీల ఓట్లు ఏమయ్యాయని, ఆ బలహీనతను బయటపడకుండా చూసుకునేందుకే ఏకం అయ్యాయని అన్నారు. కాంగ్రెస్‌ 105 స్థానాల్లో పోటీ చేస్తుంటే అందులో 20మంది వరకు కూడా ఎస్పీకి చెందినవారే ఉన్నారని తెలిపారు. నిజంగా ముస్లిం ఓట్లర్లపట్ల ఎస్పీ, కాంగ్రెస్‌ కూటమికి సానుభూతే ఉంటే 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క ముస్లిం కూడా ఎందుకు గెలిపించలేకపోయారని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన హామీల అమలులో ఎస్పీ విఫలమైందని చెప్పారు. యూపీ ప్రజలకు 2012 ఎన్నికల మేనిఫెస్టో గుర్తుందని, 2013 ముజఫర్‌నగర్‌ దాడులు, ఆ సమయంలో చేసిన హామీలు గుర్తున్నాయని అన్నారు. ముస్లింలకు రిజర్వేషన్‌ తెస్తామని హామీ ఏమైందని, అఖిలేశ్‌ దీనిపై కనీసం కమిటీ వేశారా అని ప్రశ్నించారు.



2002లో నరేంద్రమోదీ ప్రభుత్వం సమయంలో జరిగిన గుజరాత్‌ అల్లర్లే ప్రజలు ఇప్పటి వరకు మర్చిపోలేదని, అలాంటిది 2013లో అఖిలేశ్‌ పరిపాలనలో జరిగిన ముజఫర్‌నగర్‌ అల్లర్లు మాత్రం ఎలా మర్చిపోతారని ప్రశ్నించారు. దాడులు జరిగి మూడేళ్లయినా నిందితులపై చర్య తీసుకునే ఒక్క ఫైలు కూడా ఎందుకు ముందుకెళ్లలేదని నిలదీశారు. ముస్లింలకు వారు చేసింది ఏమీ లేదని ఇప్పటి వరకు ఒక్క ఉర్దూ పాఠశాలను కూడా వారు తెరిపించలేదని అన్నారు. ప్రధాని పనితీరుకు, అఖిలేశ్‌ పాలనకు కచ్చితంగా తగిన తీర్పునిస్తారని చెప్పారు. మోదీ, అఖిలేశ్‌ నినాదం ఒక్కటేనని అది కూడా అభివృద్ధి అని కాకపోతే అది మాత్రం ఎక్కడా కనిపించలేదని దుయ్యబట్టారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top