సోనియా విందు.. పసందేనా?

సోనియా విందు.. పసందేనా? - Sakshi


రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసంలో శుక్రవారం జరిగిన ప్రతిపక్షాల విందు సమావేశం హఠాత్తుగా తన వ్యూహాన్ని మార్చుకుంది. రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడానికి బదులు, పాలకపక్ష బీజేపీకి వ్యతిరేకంగా తామంతా ఏకమయ్యామనే సందేశం ఇచ్చింది. రాష్ట్రపతి అభ్యర్థిపై ప్రతిపక్షాల అభిప్రాయాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదంటూ బంతిని ప్రభుత్వ కోర్టులోకి నెట్టింది. రాష్ట్రపతి అభ్యర్థికి ప్రతిపాదిత పేర్లను తమ ముందుంచితే తమ అభిప్రాయం చెబుతామని, ప్రభుత్వం ఎంపిక చేసిన అభ్యర్థి పేరు తమకు నచ్చకపోతే రాజ్యాంగానికి కట్టుబడి పనిచేసే అభ్యర్థిని తాము నిలబెడతామని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గులామ్‌ నబీ ఆజాద్‌ తెలిపారు.



ఈ సమావేశానికి ఉత్తరప్రదేశ్‌లో ప్రత్యర్థులైన సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీ, పశ్చిమ బెంగాల్లో రాజకీయ ప్రత్యర్థులైన తృణమూల్‌ కాంగ్రెస్, వామపక్షాలు హాజరుకావడం విశేషం కాగా, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్‌ యాదవ్, బీఎస్పీ నాయకురాలు మాయావతి, సమాజ్‌వాది పార్టీకి చెందిన యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్, జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు ఒమర్‌ అబ్దుల్లా లాంటి నాయకులు వచ్చారు. తరచు ప్రతిపక్షాల ఐక్యత గురించి మాట్లాడే బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ రాకపోవడం ఒక్కటే కాస్త ప్రతికూలాంశం. అయితే ఆ పార్టీ తరఫున సీనియర్‌ నాయకుదు శరద్‌ యాదవ్‌ హాజరయ్యారు.



2019 సార్వత్రిక ఎన్నికల వరకు తమ ఐక్యతను నిలబెట్టుకోవాలని ఆశిస్తున్న ప్రతిపక్ష పార్టీలు చెన్నైలో జూన్‌ 3న కరుణానిధి 93వ పుట్టిన రోజు సందర్భంగా మరోసారి కలవాలని నిర్ణయించాయి. ఆ తర్వాత ఆగస్టులో తాను పట్నాలో ఏర్పాటుచేసే భారీసభకు హాజరు కావాలని లాలు ప్రసాద్‌ యాదవ్‌ ఆహ్వానించారు. వీరు కేవలం సమావేశాలకే పరిమితమైతే ఆశించిన లక్ష్యం నెరవేరదు. మోదీ ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వాటిపై క్షేత్రస్థాయి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలి. భావ వ్యక్తీకరణలో దిట్టయిన మోదీని ఎదుర్కోవడం, ఆయనతో పోటీ పడే సమర్థుడిని ఎన్నుకోవడం కూడా అంత ఈజీ కాదు. ఒకవేళ ఎన్నుకున్నా వాళల వెంట కలసికట్టుగా నడవడంలో ప్రతిపక్షాలు  చిత్తశుద్ధితో కలసిరావాలి.



అదే జరిగితే 2004లో ప్రతిపక్షాలను యూపీఏ వేదికపైకి తీసుకొచ్చి పదేళ్లపాటు అధికారం సాగించిన చరిత్ర పునరావృతం అయ్యే అవకాశం కొంతవరకు ఉంటుంది. లేదంటే ‘వో కహతే ఇందిరా హఠావో, మై కహతీ హు గరీబీ హఠావో’ నినాదంతో ఇందిరాగాంధీ తిప్పి ప్రతిపక్షాన్ని మట్టి కరిపించిన అనుభవం చవిచూడాల్సి వస్తుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top