సోనియా అహంభావి!: నట్వర్

సోనియా అహంభావి!: నట్వర్ - Sakshi


న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యవహార శైలిని ఆ పార్టీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి నట్వర్‌సింగ్ తాను రాసిన ఆత్మకథ ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్: యాన్ ఆటోబయోగ్రఫీ’లో తూర్పారబట్టారు. సోనియాను నిరంతరం అనుమానించే వ్యక్తి గా, అహంభావిగా అభివర్ణించారు. కఠిన పదజాలంతో దుయ్యట్టారు. తన భర్త రాజీవ్‌గాంధీ హత్య కేసు విచారణ నత్తనడకన సాగుతోందన్న కోపంతో నాటి ప్రధాని పి.వి. నరసింహారావును దూరం పెట్టారని పేర్కొన్నారు. భారత్‌లో ఆమె అడుగుపెట్టినప్పటి నుంచీ రాజ వైభోగాన్ని అందుకున్నారన్నారు.



అలాగే సోనియా కుమారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపైనా, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పైనా పుస్తకంలో విమర్శలు గుప్పించారు. రాహుల్ మంచివాడైనప్పటికీ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా పనిచేయాలన్న చిత్తశుద్ధి ఆయనలో లేదని విమర్శించారు. పదేళ్లు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ పాలనలో తన ముద్రను వేయలేకపోయారన్నారు. బోఫోర్స్ కుంభకోణం వివాదం, షా బానో కేసు, రామజన్మభూమి అంశాలు, డార్జిలింగ్‌లో ఆందోళన విషయంలో రాజీవ్ గాంధీ సరిగ్గా వ్యవహరించలేకపోయారన్నారు.



తాను పేర్కొన్న అంశాలపై సోనియామండిపడటంపట్ల నట్వర్‌సింగ్ శుక్రవారం స్పందిస్తూ పుస్తకంలోని ఏదో విషయంపై కలత చెందడం వల్లే ఆమె అలా ప్రతిస్పందించి ఉండొచ్చన్నారు. నిజాలు రాసినందుకు 50 మంది కాంగ్రెస్ నేతలు తనను అభినందించారని చెప్పారు. గాంధీ కుటుంబం సారథ్యం లేకపోతే కాంగ్రెస్ ఐదు గ్రూపులుగా చీలిపోతుందని నట్వర్ చెప్పారు. పార్టీని సోనియా గత 15 ఏళ్లుగా ఏకతాటిపై నిలుపుతూ వస్తున్నారన్నారు. పుస్తకంలోని అంశాల్లోని నిజానిజాలను తెలిపేందుకు స్వయంగా పుస్తకం రాస్తానంటూ సోనియా పేర్కొనడాన్ని నట్వర్ స్వాగతించారు.

 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top