'మైసూర్‌పాక్'ను బహిష్కరించండి!

'మైసూర్‌పాక్'ను బహిష్కరించండి! - Sakshi

'మైసూర్‌ పాక్‌ను' మైసూర్‌ ఇండియా అని పేరు మార్చేవరకు తినకండి, దాన్ని బహిష్కరించండి! అదొక్కటేనా... హైదరాబాద్‌లోని కరాచీ బేకరీని, ఇతర బేకరీల్లో దొరికే కరాచీ బిస్కట్లను, కరాచీ హల్వా, పెషావరీ బిర్యానీ, లాహోరీ నమక్, ముల్తానీ మిట్టీ,  సింధీ కఢీ (గ్రేవీ డిష్‌) లను బహిష్కరించండి... పక్వాన్‌ (వంటకాలు) అనే పేరును కూడా ఇంద్వాన్ అని మార్చండి...'' భారత్, పాక్‌ మధ్య సాంస్కృతిక, వాణిజ్య యుద్ధం మొదలైన నేపథ్యంలో సామాజిక వెబ్‌సైట్లలో వెల్లువెత్తుతున్న సరదా కామెంట్లు ఇవీ. పాక్‌లో భారతీయ సినిమాల ప్రదర్శనను నిలిపివేయగా, పాక్‌ కళాకారులను, చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని భారత్‌లో డిమాండ్లు వెల్లువెత్తుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పాక్‌ కళాకారులు ఫవాద్‌ ఖాన్, మొహిర్‌ ఖాన్‌లు నటించిన బాలీవుడ్‌ సినిమాలను బహిష్కరించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన పిలుపునిచ్చింది. 

 

తాను ఎంతో దేశభక్తి కలవాడినని, తాను ఇటీవల నిర్మించిన 'ఏ దిల్‌ హై ముష్కిల్‌' చిత్రాన్ని విడుదలకు అనుమతించాలని, భవిష్యత్తులో పాక్‌ ఆర్టిస్టులను తన సినిమాల్లో తీసుకోను గాక తీసుకోనంటూ దర్శక, నిర్మాత కరణ్ జోహర్‌ సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలసుకొని మొరపెట్టుకున్న విషయమూ తెల్సిందే. 

 

మైసూర్‌పాక్‌.. నాలుగో కృష్ణరాజ్‌ వడయార్‌ తన మైసూర్‌ ప్యాలెస్‌లో మొట్టమొదటి సారిగా ఈ స్వీట్‌ను తయారు చేయడం వల్లన దీనికి మైసూర్‌ నగరం పేరుతో మైసూర్‌పాక్‌ అని పేరు వచ్చింది. పాక్‌ అంటే కన్నడ భాషలో తీపి మిశ్రమం లేదా పాకం అని అర్థం. కరాచీ బేకరీ.. సింధు నుంచి హైదరాబాద్‌కు వలసవచ్చిన ఖాన్‌చంద్‌ రమ్నాని హైదరాబాద్‌లో ఈ బేకరీని ఏర్పాటు చేశారు. సింధు రాజధాని నగరమైన కరాచీ పేరును బేకరీకి పెట్టుకున్నారు. 

 

ఇదంతా బాగానే ఉందిగానీ పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌ నగరంలో వందేళ్ల క్రితం ఏర్పాటు చేసిన 'బాంబే బేకరీ'ని మనమే మూసేద్దామా? పాక్‌ ప్రజలనే మూసేయమని కోరదామా? ఎటూ అక్కడివాళ్లు బాలీవుడ్ సినిమాలను నిషేధించారు కాబట్టి, రేపో మాపో వాళ్లకు ఇలాంటి ఆలోచనలు వచ్చినా తప్పు లేదేమో!
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top