‘భద్రత’కు లేదు భరోసా..

‘భద్రత’కు లేదు భరోసా..


 సాక్షి, ముంబై: 26/11 ఘటన జరిగి బుధవారంతో ఆరేళ్లు పూర్తవుతున్నాయి. ఆ ఘటన తాలూకు జ్ఞాపకాలు ముంబైవాసులను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ముంబైలో అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



ముంబైకర్లు ఇప్పటికీ తాము పూర్తి భద్రత కలిగి ఉన్నామనే భావనకు రాలేకపోతున్నారు. పాక్ ప్రేరేపిత ముష్కరులు పదిమంది 2008 నవంబర్ 26వ తేదీన ముంబైలో జరిపిన మారణహోమంలో 166 మంది మృత్యువాత పడగా మరో 300 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఎన్‌ఎస్‌జీ కమాండోలు, పోలీసులు, ఇతర రక్ష క దళాలు కలిసి 9 మంది ముష్కరులను హతమార్చగా అజ్మల్ కసబ్ అనే ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడ్డాడు.



ఆ తర్వాత అతడిని యెరవాడ జైల్లో 2012లో ఉరితీశారు. అయితే ముష్కరుల ఘటన నేపథ్యంలో ముంబైలో తిరిగి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాయి. నగరవ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, ప్రత్యేక భద్రతా దళం ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ ఇప్పటికీ వాటిని సంపూర్ణంగా అమలు చేయకపోవడం గమనార్హం.  



 పేరు ఘనం.. కాంట్రాక్ట్ వేతనం ..

 ముష్కరుల దాడి అనంతరం జాతీయ భద్రత దళం (ఎన్‌ఎస్‌జి) మాదిరిగానే మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర భద్రత దళాన్ని 2010 ఏప్రిల్‌లో ప్రారంభించింది. 250 మందితో మొదలైన ఈ దళంలో ఇప్పుడు 2,500 మంది కమాండోలు ఉన్నారు. వీరికి ప్రత్యేక పోలీసు అధికారులుగా గుర్తిస్తున్నారు. ముంబైలోని మెట్రో, మోనో మార్గాలోని అన్ని రైల్వేస్టేషన్లు, మహాలక్ష్మి మందిరం, ఓఎన్‌జిసి, ఐఐటి-పవాయి, సెబీ కార్యాలయాలు, జెఎన్‌పిటిలతోపాటు రాష్ట్రం లోని ప్రముఖ సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించి వాటివద్ద ఈ దళానికి చెందిన కమాండోలను మోహరిస్తున్నారు.



అయితే వీరికి మౌలిక సదుపాయాల కల్పనలో గాని, ఆయుధాల విషయంలో గాని ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీరికి పాత ఆయుధాలు అప్పగించడంతో అత్యాధునిక ఆయుధాలతో దాడులకు దిగే ముష్కరులను ఎలా ఎదుర్కొంటారనేది ప్రశ్నగా మారిం ది. అలాగే ప్రత్యేక పోలీసు అధికారులు హోదా ఇచ్చిన వీరికి స్థాయికి తగ్గట్టుగా ఏవి లభించడంలేదు. ముఖ్యంగా  దళంలోని కమాండోలకు లభించేగౌరవ వేతనం రూ. 10,400 మినహా ఎలాంటి అలవెన్స్ (బత్తాలు) ఇవ్వడంలేదని తెలిసింది. వీరందరూ ఇప్పటికీ 11 నెలల కంట్రాక్ట్‌పైనే పనిచేస్తున్నారని తెలిసింది. మరోవైపు అధికారులకు మాత్రం కనీస వేతనం రూ. 50 వేల వరకు అందిస్తున్నారు.



 ప్రభుత్వ సంస్థా లేదా ప్రైవేటా...?

 మహారాష్ట్ర భద్రత దళం ప్రభుత్వ సంస్థనా లేదా ప్రైవేట్ సంస్థనా అనేది స్పష్టం కావడంలేదు. భర్తీ మాత్రం పోలీసుల భర్తీ ప్రక్రియ మాదిరిగానే నిర్వహిస్తున్నారు. కాని వీరిని కంట్రాక్ట్ కార్మికులుగా పరిగణిస్తున్నారు. దీంతో ఈ కమాండోలలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అసలు మేము ప్రభుత్వ ఉద్యోగులమా..? లేదా ప్రైవేట్ ఉద్యోగులమా అనేది తెలియడంలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగంలో చేరాలంటూ అనేక మంచి ఉద్యోగాలను వదిలి వస్తే ఇక్కడ సరైన సదుపాయాలు లేకుండా తాము పనిచేయాల్సి వస్తోందని ఓ కమాండో తెలిపారు.



 సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఏదీ..

 ఘటన అనంతరంలో నగరంలోని అన్ని ముఖ్య కూడళ్లతోపాటు వివిధ సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేయాలని 2008లోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‌తో 6 వేల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదన అమలులో మాత్రం నత్తనడక నడుస్తోంది. ఈ ఆరేళ్ల కాలంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వీటిని అమర్చారు. మరోవైపు వీటి ఏర్పాటుకు ప్రస్తుతం సుమారు రూ.1,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. దీంతో ప్రభుత్వం వీటి ఏర్పాటుపై మీనమేషాలు లెక్కిస్తోంది.



 సామాన్యుల్లో సన్నగిల్లుతున్న నమ్మకం..

 నగర భద్రతపై సామాన్య పౌరులు భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం తాము అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నామని.. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తే ఉగ్రవాద దాడుల నుంచి నగరవాసులను సురక్షితంగా కాపాడగలుగుతామని అంటున్నారు. ముఖ్యంగా ఎవరైనా.. ఎక్కడైనా.. అపరిచితులు అనుమానంగా సంచరిస్తున్నట్లు కనిపించినా..లేదా రైళ్లు, బస్సులు, ఇతర ప్రయాణ వాహనాల్లో ఎవరైనా బ్యాగులు, బాక్సులు వంటివి వదిలేసి వెళ్లిపోయినట్లు అనిపించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్లకు సమాచారమివ్వాలని వారు కోరుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top