కళ్లకు కట్టిన శక్తి, సంస్కృతి


  • అగ్రరాజ్యాధినేత సమక్షంలో అబ్బురంగా గణతంత్ర దినోత్సవ కవాతు

  • రిపబ్లిక్ డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒబామా

  • సైనిక శక్తిని, భిన్న సంస్కృతులను ప్రదర్శించిన భారత్

  • రెండు గంటల పరేడ్‌ను వీక్షించిన ఒబామా దంపతులు

  • న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా అధినేత ముఖ్య అతిథిగా పాల్గొని అబ్బురంగా వీక్షిస్తుండగా.. భారతదేశం 66వ గణతంత్ర దినోత్సవంలో తన సైనిక పాటవాన్ని, సుసంపన్నమైన భిన్న సంస్కృతుల సమ్మేళనాన్ని కళ్లు చెదిరే రీతిలో ఆవిష్కరించింది. కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్ల మధ్య దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సోమవారం గణతంత్ర వేడుకల కవాతు కన్నులపండుగగా సాగింది. ఒకవైపు సన్నగా కురుస్తున్న వర్షం, మరోవైపు మంచు మేఘా లు ఆవరించివున్న ఆకాశం.. ఇవేవీ రాజ్‌పథ్‌లో రిపబ్లిక్ పరేడ్‌ను వీక్షించేందుకు వచ్చే వేలాది జనాల ఉత్సాహాన్ని చల్లార్చలేకపోయాయి.

    ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తొలి అమెరికా అధ్యక్షుడి గా బరాక్ ఒబామా చరిత్ర సృష్టించారు. సాధారణం గా ముఖ్యఅతిథిని రాష్ట్రపతి తన వాహనంలో వెంట తీసుకురావటం సంప్రదాయం. ఈ సంప్రదాయానికి విరుద్ధంగా.. ఒబామా అత్యంత భద్రతాపూరితమైన తన సొంత వాహనం ‘ది బీస్ట్’లోనే రాజ్‌పథ్‌లోని వేదిక వద్దకు వచ్చారు.  

     

    ఒబామా, మోదీ మాటామంతీ: ముదురు నల్ల రంగు సూటు ధరించిన ఒబామా.. ప్రధాన వేదికపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్లాస్ ఎన్‌క్లోజర్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సరసన, ప్రధాని నరేంద్రమోదీ పక్కనే ఆశీనులయ్యారు. రాష్ట్రపతికి మరోవైపు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ఆ పక్కన ఒబామా సతీమణి మిషెల్, ఆమెపక్కన అన్సారీ సతీమణి, రక్షణమంత్రి పారికర్, ఇతర ముఖ్యులు ఆశీనులయ్యారు. మోదీ వర్ణశోభితమైన బంధేజ్ సాఫా (రాజస్థానీ తలపాగా) ధరించి ఆకర్షణీయంగా కనిపించా రు. స్వల్పంగా జల్లులు పడుతుండటంతో ఒబామా కొద్ది సేపు తన గొడుగు చేతపట్టుకుని కనిపించారు.



    వాన జల్లులతో తడిసిన పరేడ్ మార్గంలో రెండు గంటల పాటు కొనసాగిన అద్భుత ప్రదర్శనను ఒబామా ఆద్యంతం ఆసక్తికరంగా వీక్షించారు. పరేడ్‌లోని ప్రదర్శనల విశేషాలను ముఖ్యఅతిథికి మోదీ వివరిస్తుండగా.. ఒబామా కూడా ఆయనతో ముచ్చటిస్తూ కనిపించారు. ప్రదర్శనలోని పలు అంశాల పట్ల ఒబామా అభినందనపూర్వకంగా తల ఊపారు.. బీఎస్‌ఎఫ్ జవాన్లుమోటార్ సైకిళ్లపై చేసిన విన్యాసాలకు బొటన వేలు పెకైత్తి చూపుతూ అభినందనలు తెలిపారు. మిషెల్  చిన్నారుల నృత్య ప్రదర్శనలను నవ్వుతూ తిలకించారు.

     

    జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రణబ్



    గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత జాతీయ పతాకాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన, సంప్రదాయబద్ధమైన 21 గన్ సెల్యూట్ (గాలిలోకి తుపాకులు పేల్చి చేసే వందనం) జరిగాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసి న వేదికపై ఉన్న భారత సర్వసైన్యాధ్యక్షుడైన రాష్ట్రపతికి.. జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (ఢిల్లీ) లెఫ్టినెంట్ సుబ్రతోమిత్రా నేతృత్వంలో సైనిక, పోలీసు బలగా లు.. లయబద్ధమైన సైనిక సంగీతంతో పదం కలుపుతూ కవాతు (మార్చ్ ఫాస్ట్) చేస్తూ సైనిక వందనం సమర్పించాయి. బీఎస్‌ఎఫ్, అస్సామ్ రైఫిల్స్, కోస్ట్ గార్డ్, సీఆర్‌పీఎఫ్, ఇండో-టిబెటన్ బోర్డర్ ఫోర్స్, సీఐఎస్‌ఎఫ్,సశస్త్ర సీమాబల్, ఆర్‌పీఎఫ్, ఢిల్లీ పోలీస్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ు మార్చ్ ఫాస్ట్ నిర్వహించాయి.

     

    అబ్బురపరచిన ఆయుధ సంపత్తి...



    గణతంత్ర దినోత్సవ కవాతులో తొలిసారిగా ఈ ఏడాది త్రివిధ దళాల నుంచి అన్నీ మహిళా యూనిట్లే పాల్గొనటం విశేషం. సైనిక ఆయుధ సంపత్తిలో.. ఇటీవలే సమకూర్చుకున్న దీర్ఘశ్రేణి సముద్ర నిఘాకు వినియోగించే, జలాంతర్గాములను పేల్చివేసే సామర్థ్యం గల పీ-81 యుద్ధ విమానం, దీర్ఘశ్రేణి అత్యాధునిక మిగ్-29కే యుద్ధవిమానాలను తొలిసారిగా ప్రదర్శించారు. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల ఆకాశ్ మధ్యశ్రేణి క్షిపణి, వెపన్ లొకేటింగ్ రాడార్‌ల ప్రదర్శన ఆకర్షించాయి. లేజర్ గెడైడ్ మిసైల్ సామర్థ్యమున్న టి-90 భీష్మ యుద్ధ ట్యాంకు, బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థకు చెందిన మొబైల్ అటానమస్ లాంచర్, శాటిలైట్ టెర్మినల్ (రాడ్‌శాట్) తదితర ఆయుధ సంపత్తి భారత సైనిక పాటవాన్ని చాటిచెప్పాయి. వైమానిక,నౌకాదళాలు కూడా తమ ఆయుధ సంపత్తిని ప్రదర్శించాయి.

    దుర్భేద్యమైన కోటగా దేశ రాజధాని...



    అమెరికా సీక్రెట్ సర్వీస్ భద్రతా జాగ్రత్తల దృష్ట్యా ఆ దేశాధ్యక్షుడు ఒక బహిరంగ వేదిక నుంచి దాదాపు రెండు గంటల పాటు ఒక కార్యక్రమాన్ని వీక్షించటం అసాధారణమైన విషయం. అగ్రరాజ్యాధినేత కోసం చేపట్టిన భూతలం నుంచి గగనతలం వరకూ చేపట్టిన భద్రతా చర్యలు రాజధాని నగరాన్ని దుర్భేద్యమైన కోటగా మార్చివేశాయి. ఏడు వలయాలతో భద్రతను చేపట్టారు. పరేడ్ మార్గం పొడవునా అన్ని భవనాలు, ఎత్తయిన కట్టడాలపైనా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) స్నైపర్లను మోహరించారు.

     

    మోదీ మూడు కలలు



    ప్రధాని నరేంద్రమోదీ కలల పథకాలు మూడు సోమవారం రిపబ్లిక్ పరేడ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. జనధన్ యోజన, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛభారత్ పథకాలకు సంబంధించి ప్రత్యేక శకటాలను పరేడ్‌లో ప్రదర్శించారు.  వివిధ పాఠశాలల బాలబాలికలతో పరిశుభ్రతకు సంబంధించిన నృత్య ప్రదర్శనను స్వచ్ఛభారత్ శకటంపై ప్రదర్శించారు. అదే విధంగా కేంద్ర పారిశ్రామిక ఉత్పాదక శాఖ యంత్ర చక్రాలతో రూపొందించిన అతి పెద్ద సింహం నమూనా పరేడ్‌లో ప్రత్యేకంగా కనిపించింది. అదే విధంగా అత్యధిక ప్రజాదరణ పొందిన జనధన్ యోజన పథకానికి కూడా శకటం ప్రదర్శించారు. వీటితో పాటు బేటీ బచావో, బేటీ పఢావో, ఆయుష్ శకటాలు కూడా ఆహూతులను ఆకట్టుకున్నాయి.

    భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ



    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాల నుంచి శకటాలను, వివిధ రంగాల్లో సాధించిన విజయాలు, ప్రభుత్వ లక్ష్యాలను ప్రతిబింబిస్తూ మరో 9 శకటాలను ప్రదర్శించారు. దేశంలో తయారీ పరిశ్రమను, ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారాన్ని ప్రతిబింబిస్తూ కూడా ఒక శకటాన్ని ప్రదర్శించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ గిరిజనుల నృత్యరీతులు, సంప్రదాయ సంగీతం, పాఠశాలల విద్యార్థినుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. చివర్లో భారత వాయుసేన ఫ్లైపాస్ట్‌లో హెలికాప్టర్లు, యుద్ధవిమానాలతో చేసిన విన్యాసాలు అతిథులు, వీక్షకులను అబ్బురపరచాయి. పరేడ్ ముగింపులో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో పొగలు విరజిమ్ముతూ వాయుసేన విమానాలు నింగిలో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించటం ఆకట్టుకుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top