కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి


సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని వివిధ కార్పొరేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్‌చేస్తూ బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఎన్‌టీయూఐ, కచరా వాహతుక్ శ్రామిక్ మంచ్, సర్వశ్రామిక్ మంచ్ ఆధ్వర్యంలో రాణిబాగ్ నుంచి ఆజాద్‌మైదాన్ వరకు జరిగింది. ఇందులో నవీముంబై, షోలాపూర్, పుణే, నాసిక్, నాగపూర్ తదితర కార్పొరేషన్లకు చెందిన దాదాపు ఐదు వేలకుపైగా పారిశుద్ధ్య కార్మికులు, ఇతర శాఖలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులు పాల్గొన్నారు.



 బీఎంసీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే కార్మికులను పర్మినెంట్ చేయాలని ఇండస్ట్రియల్ కోర్టు ఆదేశించింది. ఇదే తరహాలో మిగతా కార్పొరేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే జీవోలను తీసుకురావడం అయోమయానికి గురిచేసిందని ఆరోపించారు. వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పనికితగ్గ వేతనం ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతరేక విధానాలను రద్దు చేయాలని, కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులను నియమించడం మానుకోవాలని నినాదాలు చేశారు. ఈ ర్యాలీకి రిలయన్స్ ఎనర్జీ కార్మిక సంఘం, తెలంగాణ సంఘీభావ వేదిక మద్దతు పలికాయి. ర్యాలీలో ఎన్టీయూఐ అధ్యక్షుడు వాసుదేవన్, బలరాం, సైదులు, వెంకటేశ్, దుర్గేశ్ అక్కనపెల్లి, గుండే శంకర్, సత్తన్న, భారీ సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.   





 బీఎంసీలో పర్మినెంట్ కానున్న ‘పారిశుద్ధ్య’ కొలువులు

 అనేక సంవత్సరాలుగా మహానగర పాలక సంస్థ (బీఎంసీ)లో పారిశుద్ధ్యం లాంటి అత్యవసర శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని పరిశ్రమల (ఇండస్ట్రియల్) కోర్టు ఆదేశించింది. అంతేగాక వారు విధుల్లో చేరినప్పటి నుంచి చెల్లించాల్సిన వివిధ భత్యాలు (పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగా) చెల్లించాలని సూచించింది. ఈ నిర్ణయంతో బీఎంసీలో వివిధ అత్యవసర శాఖల్లో పనిచేస్తున్న 2,700 మంది కాంట్రాక్టు కార్మికులకు ఊరట లభించింది.



తమను పర్మినెంట్ చేయాలని కొన్నేళ్లుగా కాంట్రాక్ట్ కార్మికులు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. బీఎంసీలోని అనేక శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిలో కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగానే విధులు నిర్వహిస్తున్నారు. కాని కాంట్రాక్టు కార్మికులు కావడంతో బీఎంసీ వీరిని పట్టించుకోవడం లేదు. దీంతో పారిశుద్ధ్య  శాఖ కార్మిక సంఘం నాయకులు కోర్టును ఆశ్రయించారు. పారిశుద్ధ్య శాఖ లాంటి అత్యవసర శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులను నియమించరాదని కోర్టు హెచ్చరించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top