బీజేపీతో జట్టు కట్టేది లేదు: శివసేన

బీజేపీతో జట్టు కట్టేది లేదు: శివసేన - Sakshi


ముంబై: శివసేన బలం మరి కాస్త పెరిగింది. గురువారం ప్రకటించిన బృహన్ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) ఫలితాల్లో బీజేపీ, శివసేన పోటాపోటీగా సీట్లు గెలుపొందిన విషయం విదితమే. శివసేన 84, బీజేపీ 82 సీట్లు గెలుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులకు డిమాండ్‌ పెరిగింది. విఖ్రోలీ, డిండోషి స్థానాల నుంచి విజయం సాధించిన ఇండిపెండెంట్లు స్నేహల్‌ మోరే, తులసీరాం షిండే శుక్రవారం శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరేను కలిసి మద్దతు ప్రకటించారు. దీంతో శివసేన బలం 86 కు పెరిగింది. ఇదిలా ఉండగా, ఇండిపెండెంట్‌గా గెలిచిన రహ్‌బార్‌ ఖాన్‌తోపాటు మరో ఇద్దరు తమ పక్షానికి మద్దతు ప్రకటించనున్నారని బీజేపీ నేతలు అంటున్నారు.



ఈ నేపథ్యంలో శివసేన నేత మనోహర్‌ జోషి మాట్లాడుతూ.. తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కమలనాథులతో జట్టు కట్టబోదని స్పష్టం చేశారు. తమదే ముంబై పీఠమని దీమా ప్రకటించారు. అలాగే, 31 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్‌ కూడా తాము బీజేపీ, శివసేనలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్టు ఇవ్వలేమని ప్రకటించింది. సైద్ధాంతిక పరంగా తీవ్రంగా విబేధాలున్న ఆ పార్టీలకు తాము దూరంగా ఉంటామని ఆ పార్టీ ముంబై నగర అధ్యక్షుడు సంజయ్‌ నిరుపమ్‌ ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉండాలనే ప్రజల తీర్పును గౌరవిస్తామని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top