న్యూక్లియర్ ప్రాజెక్టుపై మా వైఖరి సుస్పష్టం

న్యూక్లియర్ ప్రాజెక్టుపై మా వైఖరి సుస్పష్టం


సాక్షి, ముంబై: వివాదాస్పద జైతాపూర్ న్యూక్లియర్ విద్యుత్ ప్రాజెక్టు విషయంపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం ఆయన శనివారం కొంకణ్ పర్యటనకు బయలుదేరారు. గణపతి పులే దేవాలయంలో పూజలు నిర్వహించిన ఆయన తన పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంకణ్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పారు.



 ముఖ్యంగా జైతాపూర్ విద్యుత్ ప్రాజెక్టు విషయంపై ప్రజలకు మద్దతుగా నిలుస్తామని మరోసారి ఉద్ధవ్ ఠాక్రే హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టును రద్దుచేస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఎన్నికల ప్రచార సభల్లో స్థానిక రైతులకు, ప్రజలకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తాము ప్రతిపక్షంలో ఉన్నా ప్రాజెక్టు విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. గత కాంగ్రెస్, ఎన్సీపీ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం జైతాపూర్‌లోని మాడ్బన్ ప్రాంతంలో 1000 మెగావాట్ల సామర్థ్యం గల న్యూక్లియర్ ప్రాజెక్టు నిర్మించాలని సంకల్పించింది.



 అందుకు స్థలసేకరణ, ఇతర అధ్యయనం పనులు పూర్తిచేసింది. కాని ఈ ప్రాజెక్టు వల్ల తాము చాలా నష్టపోతామని అప్పట్లో అక్కడి రైతులు, ప్రజలు వ్యతిరేకిస్తూ అనేక ఆందోళనలు నిర్వహించారు. కొన్నిసార్లు ఈ ఆందోళన హింసాత్మకంగా కూడా మారింది. వీరికి శివసేన అండగా నిలవడంతో రాజకీయంగా ఈ ఆందోళన మరింత రాజుకుంది. ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనను రద్దు చేయాలని శివసేన నాయకులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. దీంతో గ్రామపంచాయతీ, జిల్లా పరిషత్ తదితర స్థానిక సంస్థల ఎన్నికల్లోనేకాక లోకసభ, శాసన సభ ఎన్నికల్లో కూడా శివసేనకు ఇక్కడ మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో కొంకణ్ ప్రజలకు ఇచ్చిన మాటపై శివసేన కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top