భారీగా ముట్టజెప్పాల్సిందే

భారీగా ముట్టజెప్పాల్సిందే - Sakshi


ఖరీదైన గడియారాలు.. వస్తువులు..

సెన్సార్ సీఈఓకు ముడుపులు ముట్టజెప్పిన బడా నిర్మాతలు


 

న్యూఢిల్లీ: లఘుచిత్రానికైతే 15 వేలు.. భారీ చిత్రానికైతే ఒక లక్ష నుంచి అయిదు లక్షల దాకా.. ఆయన గారికి ముట్టజెప్తే కానీ.. వెండి తెరపైకి వచ్చే సమస్య లేదు. డబ్బులు కాకపోతే వస్తువులు..రోలెక్స్ లాంటి ఖరీదైన గడియారాలు.. ఖరీదైన వస్తువులతో ఆయనను సంతృప్తి పరిస్తే తప్ప సినిమా బాక్సుల్లోంచి బయటకు రాదు. సెన్సార్ బోర్డు సీఈఓ రాకేశ్‌కుమార్ బాగోతమిది. బాలీవుడ్‌లో సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ కోసం ఇండస్ట్రీలో బడా నిర్మాతలంతా సీఈఓ రాకేశ్ కుమార్‌కు భారీగానే తాయిలాలు సమర్పించుకున్నారని సీబీఐ పేర్కొంది. రాకేశ్‌కుమార్‌ను సోమవారం అరెస్టు చేసిన సీబీఐ ఆయన ఇంట్లోంచి 33 ఖరీదైన గడియారాలు,ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంది. వీటిలో రోలెక్స్, రాడో లాంటి బ్రాండ్లు కూడా ఉన్నాయి. ఒక సినిమాను మూడు నాలుగు రోజుల్లో స్క్రీనింగ్ చేయటానికి రాకేశ్‌కుమార్ సుమారు లక్షన్నర రూపాయలు డిమాండ్ చేసేవారని, వారం రోజుల వరకు స్క్రీనింగ్ చేస్తే పాతిక వేలు, లఘు చిత్రానికైతే 15 వేలు వసూలు చేస్తారని సీబీఐ మంగళవారం కోర్టుకు తెలియజేసింది. గత రెండు నెలలుగా సెన్సార్‌బోర్డు సలహా మండలి సభ్యుడు సర్వేశ్ జైస్వాల్ కుమార్ తరపున సొమ్ములు తీసుకునేవాడని కూడా తెలిపింది.



ఈయన్ను కూడా సీబీఐ అరెస్టు చేసింది. సెన్సార్ బోర్డుకు చెందిన మరో ప్రతినిధి కృష్ణ పల్లి స్పీడ్ మనీ ద్వారా 18 నుంచి 25 లక్షల రూపాయలు వసూలు చేసి పెట్టాడని తెలిపింది.  చివరి నిమిషం వరకూ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆలస్యం చేసి, నిర్మాతల్లో లేనిపోని ఆందోళనలు సృష్టించి, ఎంతో కొంత ముట్టజెప్పిన తరువాతే సర్టిఫికేట్ ఇస్తున్నారని సీబీఐ అధికారి ఒకరు చెప్పారు. కాగా రాకేశ్‌కుమార్‌ను కేంద్ర సమాచార ప్రసార శాఖ సస్పెండ్ చేసింది. చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా సీఈఓ శ్రవణ్ కుమార్‌కు సెన్సార్ బోర్డు సీఈఓ బాధ్యతలను అదనంగా అప్పజెప్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top