మోదీ.. రోడ్లు కాదు.. మీవాళ్ల నోర్లు శుభ్రం చేయ్

మోదీ.. రోడ్లు కాదు.. మీవాళ్ల నోర్లు శుభ్రం చేయ్ - Sakshi


న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీపై శివసేన పార్టీ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టింది. అతి ముఖ్యమైన విషయాల్లో కూడా సొంత పార్టీ నేతలు అవాకులు చెవాకులు పేలుతుంటే స్పందించకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించింది. పొగాకు వాడకంపై బీజేపీ ఎంపీ దిలీప్గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం శివసేన పార్టీ తన అధికారిక పత్రిక సామ్నాలో ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు ఎక్కుపెట్టింది.



రోడ్లు, వీధులపై ఉన్న చెత్త చెదారాన్ని ఊడ్చిపారేసేందుకు తాను చీపురు పట్టానని నరేంద్రమోదీ చెప్తున్నారు.. కానీ గబ్బుమాటలతో కంపుకొడుతున్న తన సొంత పార్టీ నేతల నోర్లు ఎవరు శుభ్రం చేస్తారని ప్రశ్నించింది.  పొగాకు వినియోగంవల్ల క్యాన్సర్ రాదనే కొత్త విషయాన్ని ఆవిష్కరించిన ఎంపీ దిలీప్కు ఖచ్చితంగా నోబెల్ బహుమతి అందించాలని, ఆయన డాక్టర్ కాకపోయినా ఆ అవార్డు ఇవ్వాల్సిన అవసరం మనకుందని ఎద్దేవా చేసింది. అంత గొప్ప ఆవిష్కరణ చేసి పొగాకును వ్యతిరేకించేవారందరి దిమ్మతిరిగిపోయేలా చేశారని హేళన చేసింది.



ముంబైలోని టాటా ఆస్పత్రిలో 100 మంది క్యాన్సర్ పేషేంట్లు ఉండగా వారిలో 60 నుంచి 65 మంది పొగాకు వల్ల క్యాన్సర్ బారిన పడ్డవారున్నారని చెప్పారు. పొగాకుపై వైద్యులు ఇంతగా ఆందోళన చెందుతుంటే గాంధీ మాత్రం విస్తృతంగా పొగాకు ఉత్పత్తులపై ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిచాలని డిమాండ్ చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top