మళ్లీ అఫ్జల్ గురు ప్రకంపనలు!

మళ్లీ అఫ్జల్ గురు ప్రకంపనలు! - Sakshi


న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌ లాల్ నెహ్రూ జాతీయ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో ఉగ్రవాది అఫ్జల్‌గురుకు అనుకూలంగా నినాదాలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ను పోలీసులు అరెస్టు చేయడం.. వివాదం నెలకొంది. దేశద్రోహం ఆరోపణలపై కన్నయ్యను పోలీసులు అరెస్టు చేశారు.



దేశద్రోహి అఫ్జల్‌ గురుకు అనుకూలంగా కార్యక్రమం నిర్వహించి.. జాతి వ్యతిరేక నినాదాలు చేశారంటూ ఈ వ్యవహారంపై బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ గత కొన్ని రోజులుగా ఆందోళన నిర్వహిస్తోంది. పార్లమెంట్‌పై దాడికి పురికొల్పి, పలువురిని బలిగొన్న ఉగ్రవాదికి అనుకూలంగా యూనివర్సిటీలో కార్యక్రమాలు చేపట్టడం దారుణమని ఏబీవీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. విశ్వవిద్యాలయంలో ఇలాంటి కార్యక్రమాలు సాఫీగా సాగిపోతున్నా... అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. దేశంలో జాతి వ్యతిరేక కార్యకలాపాలను తమ ప్రభుత్వం  ఎట్టి పరిస్థితుల్లో సహించబోదని, జెఎన్‌యూ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్టు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ తెలిపారు. ఈ వ్యవహారంపై కేంద్ర హెచ్చార్డీ మంత్రి స్మృతి ఇరానీ కూడా త్రీవంగా స్పందించారు. ఈ నేపథ్యంలో జేఎన్‌యూ విద్యార్థి నేత అరెస్టు కావడం, వర్సిటీ హాస్టల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిచండం చోటుచేసుకున్నాయి.



అసలేం జరిగింది!

ఈ నెల 9న జేఎన్‌యూలో ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం జరిగింది. అందులో అఫ్జల్‌గురుకు అనుకూలంగా నినాదాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. అఫ్జల్‌గురును పొగుడుతూ, దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. యూనివర్సిటీ మాజీ అధ్యాపకుడు కూడా అఫ్జల్‌గురును ప్రశంసిస్తూ నినాదాలు చేసినట్లు సమాచారం. ఈ ఉదంతమే ఇప్పుడు కలకలం రేపుతోంది. దేశద్రోహికి మద్ధతు పలికినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు శుక్రవారం ఇండియా గేటు వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఈ వ్యవహారంలో కన్నయ్య కుమార్,  సహా పలువురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మాజీ అధ్యాపకుడు ఎస్‌ఏఆర్‌ గిలానీపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కేంద్రమంత్రి కిరణ్ రిజీజూ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. దేశంలో ఉంటూ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం దారుణమని రిజీజు మండిపడ్డారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top