ఆమెకు ఇక తోడెవరు?

ఆమెకు ఇక తోడెవరు?

అమ్మ అధికారంలో ఉన్నా.. జైల్లో ఉన్నా.. చివరకు ఆస్పత్రిలో అచేతన స్థితిలో ఉన్నా కూడా నిరంతరం ఆమె వెన్నంటి ఉన్న ఏకైక వ్యక్తి.. శశికళా నటరాజన్. జయలలితకు ఏకైక స్నేహితురాలు. ప్రపంచంలో ఎవరినీ అస్సలు నమ్మని జయలలిత... దాదాపు నిరంతరం నమ్మిన ఏకైక వ్యక్తి శశికళే. మధ్యలో కొన్నాళ్లు ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి దూరమైనా, అనతికాలంలోనే మళ్లీ దగ్గరయ్యారు. వీళ్లిద్దరిది విడదీయలేని బంధం. వాస్తవానికి ఇద్దరూ ఎప్పటినుంచి కలిశారన్న విషయం తెలియదు గానీ, తొలిసారిప్రపంచానికి తెలిసింది మాత్రం 1991లోనే. 

 

మొదట్లో శశికళ వీడియో క్యాసెట్ల దుకాణం నడిపేవారు. ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయలలిత ఆ పార్టీకి ప్రచార కార్యదర్శిగా ఉన్నారు. పార్టీ ప్రచార క్యాసెట్లను శశికళ తీసుకొచ్చి జయలలితకు ఇచ్చేవారు. అప్పుడే ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. కలెక్టర్ చంద్రలేఖ.. జయలలితకు శశికళను పరిచయం చేశారు. అయితే ఒక పట్టాన ఎవరినీ నమ్మని జయలలిత.. ఈ శశికళను మాత్రం ఎలా నమ్మారన్నది అంతుపట్టని విషయం. శశికళ సాధారణంగా అవతలి వాళ్లు మాట్లాడుతుంటే మౌనంగా వింటారే తప్ప మధ్యలో కల్పించుకోరు. అలాగే ప్రచారవ్యూహాలు రచించడంలో కూడా దిట్ట అంటారు. 

 

1991లో తొలిసారిగా జయ ముఖ్యమంత్రి అయ్యారు. పోయెస్‌గార్డెన్‌లో శశికళ బంధువుల పెత్తనం పెరిగింది. శశికళ అన్న కుమారుడు సుధాకరన్‌ను జయ దత్తత తీసుకున్నారు. 1996లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయ అరెస్టుకాగా, ఆమెతో పాటూ శశికళ కూడా అరెస్టయ్యారు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినా టాన్సీ కుంభకోణం వివాదాల్లో చిక్కుకుని ఉన్నందున జయ సీఎం కాలేకపోయారు. అపుడు పన్నీర్‌సెల్వంను తాత్కాలిక ముఖ్యమంత్రిగా పీఠంపై కూర్చోబెట్టింది శశికళే. ఎందుకంటే, ఆయన ఈమెకు కూడా విధేయుడు. ఆ తర్వాత.. 2002లో జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయ్యారు. అప్పట్లో శశిని సీఎం చేయాలనుకున్నా.. వీలుపడలేదు. తర్వాత జయలలిత నిర్దోషిగా బయటపడుతూనే శశికళకు పార్టీలో ప్రాథమిక సభ్యత్వం ఇచ్చారు. పార్టీలో కీలక స్థానం కట్టబెట్టారు. 2011 ఎన్నికల్లో శశికళ ప్రాబల్యం బాగా పెరిగింది. చాలాకాలం ఇద్దరూ ఒకే రకమైన చీరలు కట్టుకునేవారు, ఒకే రకమైన ఆభరణాలు ధరించేవారు. చెప్పులు కూడా ఒకే రకంగా ఉండేవి. ఇద్దరూ అచ్చం కవలపిల్లల్లాగే కనిపించేవాళ్లు. 

 

2011 డిసెంబర్ 19న శశికళా నటరాజన్‌ను పార్టీ నుంచే కాకుండా, తన నివాసం పోయెస్ గార్డెన్ నుంచి కూడా జయలలిత బయటకు పంపేశారు. కానీ ఆ విభేదాలు ఎన్నాళ్లో లేవు. నాలుగు నెలల్లోపే ఇద్దరూ మళ్లీ దగ్గరయ్యారు. ఎంతగానంటే.. చివరకు చెన్నై అపోలో ఆస్పత్రిలో వీవీఐపీలు, కేంద్ర మంత్రులు సైతం జయలలిత ఎలా ఉన్నారో చూడలేకపోయినా, శశికళ మాత్రం ఆమె పక్కనే ఉన్నారు. చిట్ట చివరి నిమిషం వరకు సైతం ఆమె తోడుగానే నిలిచారు. ఇప్పుడు జయ లేని లోటును శశికళకు ఎవరు తీరుస్తారో!
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top