షీనా హత్య కేసులో కీలక మలుపు


ముంబై: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు దర్యాప్తులో కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, షీనా హత్యలో పాలుపంచుకున్నట్లు షీనా తల్లి, ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా మాజీ భర్త సంజీవ్ ఖన్నా శుక్రవారం పోలీసు విచారణలో అంగీకరించారు. దీంతో మాజీ భర్త ఖన్నా, డ్రైవర్ రాయ్‌ల సహకారంతో షీనాను సొంత తల్లి ఇంద్రాణినే హత్య చేసిందన్న వాదనకు బలం చేకూరింది. కోల్‌కతా నుంచి తీసుకువచ్చిన ఖన్నాను, ఇంద్రాణిని, ఆమె డ్రైవర్ శ్యామ్ రాయ్‌ని ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా సమక్షంలో ఖార్ పోలీస్ స్టేషన్‌లో ఒకేసారి, ఒకే దగ్గర విచారించారు.



అనంతరం, తమ విచారణలో ఖన్నా నేరాన్ని అంగీకరించాడని రాకేశ్ మారియా తెలిపారు. విచారణలో గువాహటి నుంచి తీసుకువచ్చిన ఇంద్రాణి కుమారుడు, షీనా సోదరుడు మైఖేల్ బోరా కూడా అక్కడే ఉన్నారు. కాగా, షీనా బోరా అస్తిపంజర శకలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని శనివారం డీఎన్‌ఏ పరీక్షలకు పంపిస్తామని మారియా తెలిపారు. షీనా పాస్‌పోర్ట్‌ను డెహ్రాడూన్‌లో స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.



పాస్‌పోర్ట్ లభించడంతో షీనా అమెరికా వెళ్లిందన్న కథనంపై అనుమానాలు ప్రారంభమయ్యాయి. మైఖేల్ చెప్పిన ఆంశాలపై కూడా దృష్టి పెట్టామని మారియా చెప్పారు. అంతకుముందు, నిందితులు ముగ్గురిని పోలీసులు రాయ్‌గఢ్ అడవిలో షీనా మృతదేహాన్ని తగలబెట్టిన ప్రాంతానికి తీసుకెళ్లారు.

 

నాటకీయ పరిణామాలు.. షీనా హత్యకేసు దర్యాప్తులో శుక్రవారం ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు జరిగాయి. కోల్‌కతాలో అరెస్ట్ చేసిన  ఖన్నాను శుక్రవారం ఉదయం ముంబై కోర్టులో పోలీసులు హాజరుపర్చారు.స్థానిక బాంద్రా కోర్టు ఆగస్ట్ 31 వరకు పోలీస్ కస్టడీకి పంపించింది. ఐపీసీ 364(అపహరణ), 302(హత్య), 201(సాక్ష్యాల నాశనం)  సెక్షన్ల కింద కేసు పెట్టి కోర్టులో హాజరుపర్చారు. షీనా హత్యలో ఖన్నాది క్రియాశీల పాత్రని,  పూర్తి వివరాలు రాబట్టేందుకు విచారించాన్న వాదనతో ఏకీభవించిన కోర్టు ఖన్నాను పోలీసు కస్టడీకి పంపించింది.



ఇంద్రాణి, ఖన్నా, ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ రాయ్.. 2012 ఏప్రిల్ 24న షీనాకు ముంబైలో ఒక హోటల్ గదిలో మద్యం తాగించి, కార్లో తీసుకెళ్తూ గొంతు నులిమి చంపారని,  రాయ్‌గఢ్ జిల్లాలోని పెన్ పట్టణ శివార్లలోని అడవిలో మృతదేహంపై పెట్రోల్ పోసి తగలపెట్టారని పోలీసులు కోర్టుకు తెలిపారు. కాగా, షీనా సోదరుడు, ఇంద్రాణి కుమారుడు మైఖేల్‌ను కూడా పోలీసులు గువాహటి నుంచి ముంబై తీసుకువచ్చారు. తన సోదరి హత్యకు సంబంధించి తనవద్ద కీలక ఆధారాలున్నాయని  మైఖేల్ చెప్పడంతో ఆయనను గురువారం గువాహటిలో విచారించిన ముంబై పోలీసులు, తదుపరి విచారణ కోసం శుక్రవారం ముంబై తీసుకువచ్చారు.



తన సోదరికి న్యాయం జరగాలని, అందుకు అవసరమైన పూర్తి సహకారం పోలీసులకు అందిస్తానని మైఖేల్ పేర్కొన్నారు. ఇంద్రాణి ప్రస్తుత భర్త స్టార్ మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియాను, ఆయన సోదరుడు గౌతమ్‌ను పోలీసులు విచారించారు. మారియా సమక్షంలో పీటర్‌ను ఖార్ పోలీస్ స్టేషన్లో 10 నిమిషాలు ప్రశ్నించి వదిలేశారు. షీనాతో సాన్నిహిత్యంపై పీటర్ కుమారుడు రాహుల్‌ను  ప్రశ్నించడం తెలిసిందే.



ప్రస్తుత భర్త పీటర్  కుమారుడు రాహుల్, తన కూతురు షీనా ల సాన్నిహిత్యాన్ని తట్టుకోలేక ఇంద్రాణి ఈ హత్యకు పాల్పడిందా? ఇందులో ఆర్థిక కోణమేదైనా ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, తాము చేసిన నేరాన్ని గుర్తు చేసేలా.. ‘నీ టీనేజ్ పిల్లలను గొంతు నులిమి చంపి ఉండకపోతే.. మనవళ్లు బహుమతిగా లభించేవారు’ అనే అర్థం వచ్చేలా 2014లో ఖన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వ్యాఖ్యకు ఇంద్రాణి లైక్ కొడ్తూ స్పందించడం గమనార్హం. ‘నువ్వెవరినైనా మోసం చేశావంటే దానర్థం.. ఆ వ్యక్తి తెలివితక్కువవాడని కాదు.. నిన్ను నీ అర్హతకు మించి విశ్వసించాడని అర్థం’ అనే మరో కామెంట్‌ను కూడా గత  ఏడాది ఖన్నా పోస్ట్ చేశాడు.

 

ఇంద్రాణిని కలవనివ్వడం లేదు!

షీనా బోరా హత్య కేసు దర్యాప్తునకు ఉపయోగపడే అవకాశమున్న మరో ఆధారాన్ని పోలీసులు సంపాదించారు. 2012 ఏప్రిల్‌లో షీనా హత్యానంతరం, షీనాకు చెందిన ఎముకల ముక్కలను పరీక్షల నిమిత్తం పెన్ పోలీసులు 2012, మే నెలలో ముంబైలోని జేజే ఆసుపత్రికి పంపించారు. ఆ శాంపిల్స్‌ను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆ ఎముక ముక్కలను పరీక్షించి, వాటితో వయసు, స్త్రీయా లేక పురుషుడా, మృతికి కారణాలు.. మొదలైన వాటిని నిర్ధారించలేమంటూ 2013లోనే నివేదిక పంపించామని జేజే ఆసుపత్రి డీన్ టీపీ లహానే వెల్లడించారు. కాగా, ఇంద్రాణితో ఆమె లాయర్లను పోలీసులు కలుసుకోనివ్వడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై ముంబైలోని మరో కోర్టు విచారణ జరిపింది. నిందితుల హక్కులపై సుప్రీంకోర్టు మార్గనిర్దేశాల ప్రకారం వ్యవహరించాలని పోలీసులను ఆదేశించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top