సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష

ముంబైలో బుధవారం సెషన్స్ కోర్టు తీర్పు వెలువడిన అనంతరం  విచార వదనంతో కోర్టు నుంచి వెళుతున్న సల్మాన్ ఖాన్


‘హిట్ అండ్ రన్’ కేసులో శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు

 

{పమాద సమయంలో సల్మాన్ తాగి కారు నడిపాడని స్పష్టం చేసిన కోర్టు

డ్రైవర్ కారు నడిపాడన్న వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం

శిక్ష ఖరారు కాగానే కోర్టు హాల్లోనే కన్నీటి పర్యంతమైన బాలీవుడ్ స్టార్

హైకోర్టును ఆశ్రయించిన సల్మాన్; ఈ నెల 8 వరకు బెయిల్ మంజూరు


 

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ! 2002 నాటి హిట్ అండ్ రన్ కేసులో ఆయన దోషేనని ముంబై సెషన్స్ కోర్టు తేల్చింది. ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. మద్యం మత్తులో కారు నడిపి ఒకరి మరణానికి కారణమయ్యాడని సల్మాన్‌పై నమోదైన అభియోగాలు రుజువయ్యాయని పేర్కొంది. ప్రమాద సమయంలో కారు నడుపుతోంది తన డ్రైవర్ అశోక్‌సింగ్ అన్న సల్మాన్ వాదనను న్యాయస్థానం అంగీకరించలేదు. కోర్టు తీర్పుతో సల్మాన్ న్యాయస్థానం హాల్లోనే కన్నీటిపర్యంతమయ్యాడు. తీర్పు వెలువడగానే సల్మాన్ లాయర్లు హైకోర్టును ఆశ్రయించడంతో.. ఆయనకు రెండ్రోజుల ఊరట లభించింది. తీర్పు సమగ్ర కాపీని నిందితుడికి ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతూ మే 8 వరకు సల్మాన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

 

 ముంబై: ‘హిట్ అండ్ రన్’ కేసులో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్(49)కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ముంబై సెషన్స్ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. 2002లో ముంబైలోని సబర్బన్ బాంద్రా ప్రాంతంలో పేవ్‌మెంట్‌పై పడుకున్న వారిపైకి తన వాహనంతో దూసుకెళ్లి ఒకరి మృతికి కారణమైన కేసులో సల్మాన్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించి సల్మాన్‌పై నమోదు చేసిన అభియోగాలన్నీ రుజువయ్యాయని స్పష్టం చేసింది. సెషన్స్ కోర్టు తీర్పు వెలువడిన తక్షణమే హైకోర్టును ఆశ్రయించడంతో.. బొంబాయి హైకోర్టు సల్మాన్‌కు మే 8 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాంతో ఆయనకు వెంటనే జైలుకెళ్లాల్సిన పరిస్థితి తప్పింది.

 

కోర్టు హాల్లో.. దేశమంతా ఆసక్తిగా గమనిస్తున్న ఈ కేసు తీర్పు బుధవారం ఉదయం 11.15 గంటలకు వెలువరించనుండటంతో దక్షిణ ముంబైలోని ఫోర్ట్ ప్రాంతంలో ఉన్న కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తీర్పు వెలువడనున్న కోర్టులోని రూం నంబర్ 52 మీడియా, పోలీసులు, న్యాయవాదులతో కిక్కిరిసిపోయింది. భారీగా తరలివచ్చిన సల్మాన్ అభిమానులంతా కోర్టు లోపలికి అనుమతి లేకపోవడంతో బయటే ఉండిపోయారు.జడ్జి రావడానికి కొద్ది నిమిషాల ముందు లైట్ బ్లూ జీన్స్, వైట్ షర్ట్‌లో సల్మాన్ కోర్టు హాల్లోకి వచ్చారు.

 

తీర్పు ఏంటి?



సెషన్స్ కోర్టు జడ్జి డీడబ్ల్యూ దేశ్‌పాండే తీర్పును వెలువరిస్తూ.. ‘మీపై నమోదైన ఆరోపణలన్నీ రుజువయ్యాయి. ప్రమాదకరంగా డ్రైవ్‌చేసి ఒక వ్యక్తి మరణానికి మీరు కారణమయ్యారని కోర్టు విశ్వసిస్తోంది. ప్రమాద సమయంలో ప్రమాదానికి కారణమైన వాహనాన్ని మీరే డ్రైవ్ చేస్తున్నారని, అప్పుడు మీరు మద్యం మత్తులో ఉన్నారని, ఆ సమయానికి మీకు డ్రైవింగ్ లెసైన్సూ లేదని కోర్టు నమ్ముతోంది. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి.. ప్రమాదంలో కాకుండా, ప్రమాదం అనంతరం వాహనాన్ని క్రేన్‌తో పైకి లేపుతుండగా, అది ప్రమాదవశాత్తూ కిందపడటంతో చనిపోయాడన్న డిఫెన్స్ వాదనను మేం అంగీకరించడం లేదు. ప్రమాద సమయంలో వాహనాన్ని డ్రైవ్ చేస్తోంది మీ డ్రైవర్ అశోక్ సింగ్ అన్న వాదన నూ తోసిపుచ్చుతున్నాం. తీర్పుపై మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు.

 

సల్మాన్ స్పందన



‘ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేస్తోంది నేను కాదు. ఈ విషయాన్నే మరోసారి మీకు స్పష్టం చేయాలనుకుంటున్నా. ఏదేమైనా, మీ తీర్పును గౌరవిస్తున్నా. ఆమోదిస్తున్నా. నా తరఫున నా లాయర్ మాట్లాడతారు’



తీర్పును వింటున్నంతసేపు ఉద్వేగాన్ని, కన్నీళ్లను ఆపుకునేందుకు సల్మాన్ విఫలయత్నం చేశారు. ఆ సమయంలో సల్మాన్ పక్కన సల్మాన్‌తో పాటు ఆయన సోదరులు అర్బాజ్ ఖాన్, సొహైల్ ఖాన్, చెల్లెళ్లు అర్పిత, అల్వీరా, ప్రైవేట్ బాడీగార్డ్ షేరా ఉన్నారు.

     

తీర్పు సమయంలో అలిస్టర్ పెరీరా, సంజీవ్ నందాల బీఎండబ్ల్యూ కేసులతో ఈ కేసును న్యాయమూర్తి దేశ్‌పాండే పోల్చారు.

 

తీర్పునకు ముందు ఇరుపక్షాల విజ్ఞప్తులు


 

‘ఇలాంటి చర్యలను తీవ్రంగా తీసుకుంటామన్న సందేశం సమాజానికి వెళ్లాలి. అందువల్ల సల్మాన్‌కు కఠిన శిక్ష విధించాలి. సల్మాన్ చెప్పినట్లుగా ఇది దైవఘటన కాదు. ఇది చాలా తీవ్రమైన నేరం. అందువల్ల గరిష్ట శిక్ష విధించాలని కోరుతున్నా’

 - ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘరత్

 

‘బాధితుల కోసం 2002లోనే రూ. 19 లక్షలను సల్మాన్ డిపాజిట్ చేశారు. సల్మాన్ ఫౌండేషన్‌ను, బీయింగ్ హ్యూమన్ ఎన్జీఓను  స్థాపించి పెద్దఎత్తున సమాజ సేవ చేస్తున్నారు. అంతేకాకుండా తీవ్రమైన నరాల వ్యాధితో బాధపడుతున్నారు. సరైన వైద్యం, జాగ్రత్తలు తీసుకోకపోతే అది సీరియస్ అవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తీర్పు ప్రకటించాలి’

 - సల్మాన్ లాయర్ శ్రీకాంత్ శివాడే

 

(తన నరాల సంబంధిత వ్యాధి గురించి చెబుతున్న ప్పుడు ఆ ప్రస్తావన వద్దంటూ తన లాయర్‌కు సల్మాన్ సైగలు చేశారు)

 

వెంటాడుతున్న ‘జింకలు’


 

1998లో రాజస్థాన్‌లో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి 2006లో జోధ్‌పూర్‌లో వారంపాటు జైల్లో గడిపి, బెయిల్‌పై విడుదలయ్యారు. ఇందులో దోషిగా తేలితే గరిష్టంగా ఏడేళ్ల జైలుశిక్ష పడొచ్చు.

 

 

 నేరం  శిక్ష

 

  ఐపీసీ సెక్షన్ 304(2)- ఉద్దేశపూర్వకం కాని హత్యానేరంకింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 25 వేల జరిమానా

 

    ఐపీసీ సెక్షన్లు 279 (వేగవంతమైన నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్) 337, 338 (ఇతరుల ప్రాణాలకు, వ్యక్తిగత ఆస్తులకు నష్టం కలిగేలా వ్యవహరించడం)-వీటి కింద ఆరునెలల జైలు శిక్ష.



  మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 181 (లెసైన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం), సెక్షన్ 185 (మోతాదు మించి మద్యం తాగి వాహనం నడపడం(డ్రంకన్ డ్రైవ్). ఈ నేరాల కింద ఆరు నెలల శిక్ష.



    బాంబే ప్రొహిబిషన్ యాక్ట్‌లోని 66(ఏ) (బీ) సెక్షన్ల కింద రెండు నెలల జైలు శిక్ష, రూ. 500 జరిమానా.



     పై శిక్షలన్నీ ఒకే సమయంలో అమలవుతాయి.

 

 హైకోర్టుకు అపీల్

 

 తీర్పు వెలువడిన వెంటనే సల్మాన్ న్యాయవాదులు తీర్పును సవాలు చేస్తూ, తీర్పుపై స్టే ఇవ్వాలంటూ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. సెషన్స్ కోర్టు కేవలం శిక్షకు సంబంధించిన 2 పేజీల ఆపరేటివ్ పార్ట్‌ను మాత్రమే నిందితుడికి ఇచ్చిందని, శిక్షలు, అందుకు కారణాలు.. తదితరాలతో కూడిన సమగ్ర తీర్పు కాపీ ఇవ్వలేదని.. అందువల్ల ఆ కాపీ అందేవరకు తన క్లయింట్‌కు బెయిల్ మంజూరు చేయాలని సల్మాన్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదించారు. సాల్వే వాదనతో ఏకీభవించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ థిప్సే.. సల్మాన్‌కు 48 గంటల పాటు అంటే ఈ నెల 8 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. శిక్షకు సంబంధించిన తీర్పు తుది కాపీ సిద్ధం కాకుండానే తీర్పు ఇవ్వడాన్ని  ఆక్షేపించారు. మే 8న కేసుకు సంబంధించిన వాదనలు ప్రారంభమవుతాయన్నారు.

 



13 సంవత్సరాలు



 ప్రమాదం జరిగిన సెప్టెంబర్ 28, 2002 నుంచి మే 6, 2015 వరకు సాగిన విచారణ కాలం

 

 200 - 250  కోట్ల రూపాయలు


సల్మాన్ హీరోగా నిర్మితమవుతున్న  సినీ ప్రాజెక్టుల వ్యయం. వీటి భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది.

 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top