చనిపోయిన ఆమె కోట్ల రూపాయలు ఎవరికో..

చనిపోయిన ఆమె కోట్ల రూపాయలు ఎవరికో.. - Sakshi


అజ్మీర్: పేద వారిగా జన్మించడం తప్పుకాదుగానీ.. పేదవాడిగానే చనిపోవడం మాత్రం తప్పని చెప్తుంటారు. కొంతమంది దురదృష్టం కొద్ది కోట్లు ఉన్నా నిజంగా పేదవారిలాగే ప్రాణాలు విడుస్తారు. భద్రతా భయమో.. డబ్బుపై ఆశో.. కొంతమంది నోరుకడుపు కట్టుకొని కష్టపడి నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు. అందులో ఒక్కరాయి కూడా వాడుకోకుండానే చనిపోతుంటారు. రాజస్థాన్ లో ఇలాగే జరిగింది. దాదాపు రూ.2కోట్ల ఆస్తి ఉన్నా కటిక బీదరాలుగా ఓ డెబ్బై ఏళ్ల వృద్ధురాలు కన్నుమూసింది.



ఆమెకు ఏ దిక్కు లేదనుకుని తలా ఒక రూపాయి వేసుకొని అంత్యక్రియలు నిర్వహించిన చుట్టుపక్కలవారు ఆ ఆస్తుల విషయం తెలిసి అవాక్కయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కానక్లతా అనే 70 ఏళ్ల అజ్మీర్లోని నుల్లా బజార్లో భిక్షాటన చేస్తూ బతుకుతూ ఉండేది. ఆమెకు పిల్లలు లేరు. భర్త ప్రేమ నారయణ్ గత ఏడాది చనిపోయాడు. ఒక చిన్న గదిలో ఆమె ఉంటోంది. గత గురువారమే ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో ఆమెకు ఏ దిక్కూ లేదని భావించిన ఆ కాలనీ వాసులు తలా ఒక రూపాయి వేసుకొని అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం ఆమె ఉంటున్న గదిలో తనిఖీలు చేయగా వివిధ బ్యాంకుల్లో దాదాపు రూ.2 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న పత్రాలు వెలుగు చూశాయి.



ఆ పత్రాల్లో నామినీ కూడా ఎవరూ లేరు. దీంతో ప్రస్తుతం ఆ రెండు కోట్ల రూపాయలు ఎవరికి ఇవ్వాలని బ్యాంకులు ఎదురుచూస్తున్నాయి. అయితే, సినిమాలో ట్విస్ట్ మాదిరిగా తాను చనిపోయిన ఆ ముసలవ్వ అల్లుడినంటూ ఛత్తీస్ గడ్ నుంచి ఓ వ్యక్తి వచ్చాడు. తానొక్కడినే చనిపోయిన ఆమెకు బంధువునని, ఆమెకు అల్లుడిని అవుతానని చెప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే, అంతకుముందెప్పుడు అతడిని తాము చూడలేదని వారు చెబుతున్నారు. ఏదేమైనా తుది నిర్ణయం మాత్రం బ్యాంకుల చేతుల్లో ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top